22నుంచి ‘ఇంజనీరింగ్’ సర్టిఫికెట్ల వెరిఫికేషన్

16 Jun, 2016 03:00 IST|Sakshi
22నుంచి ‘ఇంజనీరింగ్’ సర్టిఫికెట్ల వెరిఫికేషన్

నోటిఫికేషన్ జారీ.. షెడ్యూల్ విడుదల
జూలై 1 వరకు సాగనున్న ప్రక్రియ

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఈ నెల 22 నుంచి జూలై 1 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టాలని ఎంసెట్ ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. బుధవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశమైన కమిటీ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేయడంతోపాటు షెడ్యూల్‌ను విడుదల చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 21 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పా టు చేసింది. ఎంసెట్‌లో ర్యాంకులు సాధించిన 1,03,923 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించనుంది. వెబ్ ఆప్షన్ల తేదీలను తరువాత ప్రకటి స్తామని కమిటీ పేర్కొంది.

ప్రతి రోజూ రెండు దఫాలుగా వెరిఫికేషన్ చేపడతామని వివరించింది. హెల్ప్‌లైన్ కేంద్రాల్లో తేదీలు, ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వివరాలను https://tseamcet.nic.in వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. వెరిఫికేషన్ కోసం తీసుకురావాల్సిన సర్టిఫికెట్లతోపాటు ఇతర వివరాలనూ అందులో పేర్కొంది. జేఎన్‌టీయూహెచ్ నుంచి కాలేజీల అనుబంధ గుర్తింపునకు సంబంధించిన సమాచారం అందకపోవడంతో వెబ్ ఆప్షన్ల ప్రక్రియపై కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోలేదు. జూలై 15 తరువాతే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు...
వెరిఫికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులు కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కోసం చెల్లించాల్సిన ఫీజును పెంచాలని (ఏపీలో పెంచడంతో) కమిటీ నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీల విద్యార్థులకు రూ. 100, బీసీ, ఓసీ విద్యార్థులకు రూ. 200 మేర పెంచింది. దీంతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రిజిస్ట్రేషన్‌కు రూ. 500, బీసీ, ఓసీ విద్యార్థులు రూ. 1,000 చెల్లించాల్సి రానుంది. యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చే కాలేజీలు, సీట ్ల సంఖ్య ఖరారైనందున ఏఐసీటీఈ అనుమతిచ్చిన కాలేజీలు, సీట్లకు ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని కమిటీ పేర్కొంది. అలాగే వెబ్ ఆప్షన్లు ప్రారంభించే లోగా కాలేజీల జాబితాలు, వాటిల్లో ఫీజుల వివరాలు ఏఎఫ్‌ఆర్‌సీ ఇవ్వాలని సూచించింది. సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, సాంకేతిక విద్య డెరైక్టర్ ఎంవీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 ఏఎఫ్‌ఆర్‌సీ భేటీ వాయిదా
బుధవారం జరగాల్సిన ఏఎఫ్‌ఆర్‌సీ సమావేశం ఈ నెల 22కు వాయిదా పడింది. ఆ రోజు కాలేజీలవారీగా ఫీజులను ఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపనుంది. ఎన్‌సీసీ, వికలాంగులు, స్పోర్ట్స్ తదితర స్పెషల్ కేటగిరీల వారికి మాసబ్ ట్యాంక్‌లోని సాంకేతిక విద్యా భవన్‌లో వెరిఫికేషన్ ఉంటుంది. తేదీల వారీగా, ర్యాంకుల వారీగా వివరాలను వెబ్‌సైట్‌లో పొందవచ్చు.

 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో వివరాల పరిశీలన
పరీక్ష సమయంలో సేకరించిన విద్యార్థుల బయోమెట్రిక్ వివరాలను హెల్ప్‌లైన్ కేంద్రాల్లో పోల్చి చూడాలి. ఇక పరీక్ష సమయంలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోని విద్యార్థుల జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. వారి నుంచి బయోమెట్రిక్ వివరాలను హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సిబ్బంది తీసుకోవాలి. అలాగే విద్యార్థుల నుంచి తానే ఆ విద్యార్థి అని అండర్‌టేకింగ్ తీసుకోవాలి. ఆధారాలు పరిశీలించాలి. ఈసారి విద్యార్థుల ఆధార్ నెంబరు తీసుకోవాల్సిందే. వెరిఫికేషన్ సమయంలోనే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. విద్యార్థి ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను వెంట తెచ్చుకోవాలి.

వెంట తెచ్చుకోవాల్సిన సర్టిఫికెట్లు

ఎంసెట్ ర్యాంకు కార్డు,  ఎంసెట్ హాల్ టికెట్,

ఆధార్ కార్డు,  పదో తరగతిమార్కుల మెమో,

ఇంటర్ మార్కుల మెమో, పాస్ సర్టిఫికెట్,

6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు,  టీసీ,  2016 జనవరి 1వ తేదీ తరువాత జారీ చేసిన ఆదాయం సర్టిఫికెట్ (ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన వారికి),  కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ (వర్తించే వారు),  నాన్ లోకల్ కేటగిరీ అభ్యర్థులైతే వారి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తెలంగాణలో ఉన్న పదేళ్ల కాలానికి నివాసం సర్టిఫికెట్,

విద్యా సంస్థల్లో రెగ్యులర్‌గా చదవని వారి నివాసం సర్టిఫికెట్.

మరిన్ని వార్తలు