సెప్టెంబర్‌ 1నుంచి ఇంజనీరింగ్‌ క్లాసులు

6 May, 2020 03:14 IST|Sakshi

జూలై 18 నుంచి 23 వరకు జేఈఈ మెయిన్‌.. ఆగస్టులో అడ్వాన్స్‌డ్‌ 

జూన్‌ 15 నాటికి ఇంజనీరింగ్‌ కొత్త కోర్సులకు ఏఐసీటీఈ అనుమతులు

అదే నెల 30 నాటికి యూనివర్సిటీల అఫిలియేషన్‌

ఆగస్టు 15 నాటికి మొదటి విడత కౌన్సెలింగ్‌.. సీట్ల కేటాయింపు

సవరించిన షెడ్యూల్‌ను జారీ చేసిన ఏఐసీటీఈ

ఇంజనీరింగ్‌ సెమిస్టర్‌ పరీక్షల్లోనూ యూజీసీ మార్గదర్శకాలే అమలు

ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులకు ప్రమోషన్‌

పరీక్ష తేదీలను ప్రకటించిన కేంద్రమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్

‌సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సాంకేతిక విద్యా కాలేజీల్లో తరగతులు సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యేలా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) షెడ్యూల్‌ను సవరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉన్నా కరోనా నేపథ్యంలో సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి తరగతులను ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. నెల రోజులు ఆలస్యంగా విద్యా సంవత్సరం ప్రారంభించేలా చర్యలు చేపట్టింది. ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో చేరే పాలిటెక్నిక్‌ డిప్లొమా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే ల్యాటరల్‌ ఎంట్రీ కూడా సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచే తరగతులు ప్రారంభించాలని పేర్కొంది. జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ తదితర పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం ఢిల్లీలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ విడుదల చేశారు.

ఏప్రిల్‌ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్‌ పరీక్షలను కరోనా కారణంగా కేంద్రం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా మంగళవారం తాజా షెడ్యూల్‌ను కేంద్ర మంత్రి జారీ చేశారు. జూలై 18, 20, 21, 22, 23 తేదీల్లో జేఈఈ మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్షలను నిర్వహిస్తామని వెల్లడించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఆగస్టులో నిర్వహిస్తామని, తేదీని తర్వాత ప్రకటిస్తామని వివరించారు. ఈ నేపథ్యంలోనే ఏఐసీటీఈ సాంకేతిక విద్యా కాలేజీల గుర్తింపు, యూనివర్సిటీలు ఇవ్వాల్సిన అఫిలియేషన్‌ (అనుబంధ గుర్తింపు), కౌన్సెలింగ్‌ నిర్వహణ, తరతగతుల ప్రారంభానికి సంబంధించిన పూర్తి వివరాలతో షెడ్యూల్‌ను జారీ చేసింది. చదవండి: జూలై 26న నీట్‌ 

అప్రూవల్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి..
కోర్సుల్లో ఎలాంటి మార్పులు లేకుండా అప్రూవల్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీలకు తమ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆమోదం మేరకు ఏప్రిల్‌ 30న అనుమతులు జారీ చేసినట్లు ఏఐసీటీఈ మెంబర్‌ కన్వీనర్‌ రాజీవ్‌ కుమార్‌ ప్రకటించారు. ఆయా యాజమాన్యాలు తమ వెబ్‌సైట్‌ నుంచి అప్రూవల్‌ లేఖలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. కమిటీ నిర్ణయం మేరకు ఈ తాజా షెడ్యూల్‌ను జారీ చేసినట్లు వెల్లడించారు. కొత్త కోర్సులకు అప్రూవల్‌ కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీలకు అప్రూవల్స్‌ ఇచ్చేందుకు జూన్‌ 15వ తేదీ వరకు గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరినట్లు వెల్లడించింది. యాజమాన్యాలు ఆన్‌లైన్‌ మీటింగ్, ఆన్‌లైన్‌ స్క్రూటినీ, డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌ కోసం మైక్రో సాఫ్ట్‌ టీం సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచించింది. 

మేనేజ్‌మెంట్‌ కోర్సులకు వేరుగా..
మేనేజ్‌మెంట్‌ కోర్సులకు మాత్రం ఏఐసీటీఈ వేరుగా షెడ్యూల్‌ను ప్రకటించింది. పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం), పీజీసీఎం కోర్సులకు మాత్రం ఆగస్టు ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని.. 2021 జూలై 31 వరకు విద్యా సంవత్సరాన్ని పూర్తి చేయాలని పేర్కొంది. పాత విద్యార్థులకు జూలై 1 నుంచే ప్రారంభించాలని తెలిపింది. ఈ కోర్సుల ప్రవేశాలను ప్రతి ఏటా జూన్‌ 30కే పూర్తి చేయాల్సి ఉన్నా ఈసారి మాత్రం జూలై 31 వరకు గడువు ఇచ్చింది.

సాంకేతిక విద్యా సంస్థలకు యూజీసీ మార్గదర్శకాలే..
యూనివర్సిటీలు, డీమ్డ్‌ యూనివర్సిటీలు, సాంకేతిక విద్యా సంస్థల్లో విద్యా కార్యక్రమాలు, పరీక్షలకు సంబంధించి ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) జారీ చేసిన మార్గదర్శకాలు అమలు చేయాలని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా సాంకేతిక విద్యా సంస్థలకు అవే మార్గదర్శకాలు వర్తిస్తాయని పేర్కొంది. ఫైనల్‌ సెమిస్టర్, ఇతర సెమిస్టర్‌ విద్యార్థుల పరీక్షల విషయంలో వాటి ప్రకారమే ముందుకు సాగాలని సూచించింది. ఈ మేరకు ఏఐసీటీఈ మెంబర్‌ సెక్రటరీ రాజీవ్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

దీంతో ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో డిటెన్షన్‌ను ఎత్తేసి, ఆయా విద్యార్థులను పైసెమిస్టర్‌కు ప్రమోట్‌ చేయనున్నారు. ఈసారి ఫెయిల్‌ అనేది.. నిర్ణీత 50 శాతం సబ్జెక్టులు పాస్‌ కాకుండా అదే సెమిస్టర్‌లో ఆగిపోవడం అనేది ఉండదు. ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులకు ప్రమోషన్‌ ఇవ్వనున్నారు. అయితే వారికి జూలై 15 నుంచి 30 మధ్య పరీక్షలు నిర్వహించాలని, ఫైనల్‌ సెమిస్టర్‌ విద్యార్థులకు జూలై 1 నుంచి 15లోగా పరీక్షలు నిర్వహించాలని యూజీసీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో వీటి అమలుకు త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు