జూలై 7 నుంచి ఇంజనీరింగ్ తరగతులు

29 May, 2015 03:39 IST|Sakshi

ప్రవేశాలకు జూన్12న షెడ్యూల్
 సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ తరగతులు ఈసారి జూలైలోనే ప్రారంభం కానున్నాయి. గత ఐదారేళ్లుగా ప్రవేశాల ప్రక్రియలో తీవ్ర జాప్యంతో తరగతులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. కానీ ఈ ఏడాది మాత్రం జూలైలోనే తరగతుల ప్రారంభానికి ప్రభుత్వం పక్కాగా ప్రణాళికను రూపొందించింది. అందులో భాగంగానే  ఎంసెట్ ర్యాంకులు వెల్లడించిన రోజునే ప్రవేశాల నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం ఆగస్టు 1వ తేదీ నాటికి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభం కావాలి.

అయితే అంతకన్నా ముందుగానే జూలై 7 నుంచే ఇంజనీరింగ్ తరగతుల ప్రారంభానికి సర్కారు చర్యలు చేపట్టింది. ఇందుకోసం జూన్ 12న ప్రవేశాల షెడ్యూల్‌ను జారీ చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. సీట్ల భర్తీ కోసం వెబ్ ఆప్షన్లలో పాత విధానాన్నే అమలు చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. వన్‌టైమ్ పాస్‌వర్డ్ విధానం ఉంటుందని.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసుకున్నపుడే విద్యార్థులు తమ మొబైల్ నంబర్ ఇవ్వాలని చెప్పారు. విద్యార్థులు వెబ్‌సైట్లోకి లాగిన్ అయిన ప్రతిసారి కొత్త పాస్‌వర్డ్ వస్తుంది.

 ప్రవేశాల షెడ్యూల్
  జూన్ 12న ప్రవేశాలకు నోటిఫికేషన్
  18 నుంచి 24 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్
  20 నుంచి 26వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం
  27న ఆప్షన్లలో మార్పులకు అవకాశం
  30న సీట్ల కేటాయింపు
  జూలై 7 నుంచి తరగతుల ప్రారంభం
  9 నుంచి 14 వరకు చివరిదశ కౌన్సెలింగ్
  21 నుంచి చివరి దశ తరగతులు

>
మరిన్ని వార్తలు