‘ఇంజనీరింగ్‌’కు ఐఐటీ అండ

9 Jan, 2020 01:42 IST|Sakshi

ఇంజనీరింగ్‌ విద్యలో నాణ్యత పెంచేందుకు ఐఐటీ కౌన్సిల్‌ చొరవ

ఐఐటీ ఎక్స్‌టెన్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని కౌన్సిల్‌ నిర్ణయం

ఒక్కో ఐఐటీ పరిధిలోని 10 కాలేజీలకు స్పాన్సర్‌ 

విద్యా బోధన మెళకువలు, అధ్యాపకులకు శిక్షణ

అందుబాటులోకి అంతర్జాతీయ జర్నల్స్‌..

రీసెర్చ్‌ ల్యాబ్‌లతో లింక్‌

సాక్షి, హైదరాబాద్‌: అత్యున్నత ప్రమాణాలతో కూడిన ల్యాబ్‌లు, విశేష అనుభవం కలిగిన అధ్యాపకులు, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు, ఆధునిక టెక్నాలజీకి సంబంధించిన జర్నల్స్, పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్రాలు మన ఐఐటీలు. అందుకే ఐఐటీలలో బీటెక్, ఎం టెక్‌ ఇతరత్రా కోర్సులు చదవాలన్నది విద్యార్థుల జీవిత లక్ష్యం. వాటిల్లో చదివితే చాలు అంతా సెట్‌ అయిపోయినట్లే. పక్కాగా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌. భారీగా వేతనాలు. లేదంటే పరిశోధనలు.. అదీ కాదనుకుంటే స్టార్టప్‌ దిశగా అడుగులు.. ఇవీ ఐఐటీల్లో చదువుకునే విద్యార్థుల అవకాశాలు. అలాంటి ఐఐటీలు ఇకపై తమ పరిధిలోని సాధారణ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో నాణ్యత ప్రమాణాల పెంపునకు తోడ్పాటు అందించనున్నాయి. ఐఐటీల్లో అమలు చేస్తున్న ప్రత్యేక సిలబస్‌తో కూడిన విద్యా బోధన, అభ్యసన పద్ధతులు, ప్రమాణాల పెంపు, పరిశోధనల వైపు విద్యార్థులు మళ్లేలా ప్రోత్సహించడం వంటి అనేక కార్యక్రమాలను ఇక సాధారణ కాలేజీల్లోనూ అందించేందుకు చర్యలు చేపట్టనున్నాయి. ప్రతి ఐఐటీ.. తమ పరిధిలోని 10 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఐఐటీల ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి నాణ్యత ప్రమాణా పెంపునకు చర్యలు చేపట్టనున్నాయి. ఐఐటీల కౌన్సిల్‌ ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇదీ అమల్లోకి రానుంది.

తమ విద్యార్థుల్లాగే వారికీ..
దేశవ్యాప్తంగా 23 ఐఐటీలు ఉన్నాయి. అవన్నీ తమ ఎక్స్‌టెన్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఐఐటీల కౌన్సిల్‌ నిర్ణయించింది. ఒక్కో ఐఐటీ తమ పరిధిలోని 10 ఇంజనీరింగ్‌ కాలేజీలను ఎంచుకొని ఇంజనీరింగ్‌ విద్యలో నాణ్యత ప్రమాణాల పెంపునకు సహకారం అందించాలని పేర్కొంది. అందుకు ఎంపిక చేసిన 230 సాధారణ ఇంజనీరింగ్‌ కాలేజీల్లోని అధ్యాపకుల్లో బోధన నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు తగిన శిక్షణ అందించనున్నాయి. తద్వారా ఆయా కాలేజీల్లో చదివే ఇంజనీరింగ్‌ విద్యార్థులను ఐఐటీల్లో చదివే విద్యార్థుల తరహాలో తీర్చిదిద్దనున్నాయి. ఈ ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను ఐఐటీ మద్రాసుకు (నోడల్‌ ఇన్‌స్టిట్యూట్‌గా) ఐఐటీల కౌన్సిల్‌ అప్పగించింది. ఐఐటీల పరిధిలోని కాలేజీల ఎంపికలో ఏఐసీటీఈ తగిన సహకారం అందించనుంది.

ల్యాబ్‌లతోనూ అనుసంధానం..
దేశంలోని అత్యున్నత ల్యాబరేటరీలతో ఐఐటీలను అనుసంధానం చేయాలని ఐఐటీల కౌన్సిల్‌ నిర్ణయించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) వంటి అనేక జాతీయ స్థాయి సంస్థలతో ఆయా ప్రాంతాల్లోని ఐఐటీలను అనుసంధానం చేయనుంది. వివిధ పరిశోధనల్లో డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు, ఐఐటీల ఫ్యాకల్టీ కలసి పనిచేయాలని డీఆర్‌డీవో సెక్రటరీ సూచన మేరకు ఆ దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఎలక్ట్రానిక్స్, సైబర్‌ డిఫెన్స్‌ రంగాల్లో డీఆర్‌డీవోతో కలసి ఐఐటీలు జూనియర్‌ రీసెర్చ్‌ ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించింది. డీఆర్‌డీవో శాస్త్రవేత్తలకు పీహెచ్‌డీ లేకపోయినా వారితో బోధన నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి రీసెర్చ్‌ ఫెలో పథకంలో కొన్ని మార్పులు చేయాలని కౌన్సిల్‌ నిర్ణయించింది. ఆ బాధ్యతను నేషనల్‌ కోఆర్డినేటర్‌గా ఐఐటీ ఢిల్లీకి అప్పగించింది. 2020 ఫిబ్రవరి నాటికి నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. అలాగే ఐఐటీల్లో విదేశీ విద్యార్థులు చేరేలా ప్రోత్సహించేందుకు నేరుగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఐఐటీల్లో విదేశీ అధ్యాపకులను నియమించాలని ప్రాథమికంగా అంగీకారానికి వచ్చినా, ఈ అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలించాలని నిర్ణయించింది. అలాగే కొత్తగా నిర్మించే ఐఐటీ క్యాంపస్‌లలో ఒక్కో విద్యార్థికి 75 స్క్వేర్‌ మీటర్లు కాకుండా 108 స్క్వేర్‌ మీటర్ల చొప్పున స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించింది. బీటెక్‌ స్థాయిలోనే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ప్రోగ్రాం ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన రంగాలను గుర్తించాలని పేర్కొంది. 
 

>
మరిన్ని వార్తలు