ఇంజనీరింగ్‌ సీట్లు 90,011

16 Jun, 2017 02:22 IST|Sakshi
ఇంజనీరింగ్‌ సీట్లు 90,011

36 వేల సీట్లకు కోత
టాప్‌ కాలేజీల్లో సీట్లు యథాతథం
ఓ మోస్తరు కాలేజీలకు భారీగా దెబ్బ
కన్వీనర్‌ కోటాలో 61,441 సీట్లు... నేటి నుంచి వెబ్‌ ఆప్షన్లు
మిగతావి యాజమాన్య కోటాలో భర్తీ
ప్రభుత్వం సరేనంటే కొత్త కోర్సుల్లో మరో 500


సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలకు యూనివర్సిటీలు ఎట్టకేలకు అనుబంధ గుర్తింపును ఖరారు చేశాయి. మొత్తంగా 90,011 సీట్లకు గుర్తింపు జారీ చేశాయి. 70 శాతం కన్వీనర్‌ కోటాలో భర్తీ చేసేందుకు ప్రవేశాల క్యాంపు కార్యాలయం చర్యలు చేపట్టింది. ఈనెల 16వ తేదీ నుంచి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్‌ వెల్లడించారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) 250 కాలేజీల్లో 1,26,315 సీట్లకు గుర్తింపు ఇవ్వగా, వర్సిటీలు 201 కాలేజీల్లోని 90,011 సీట్లకు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్‌) ఇచ్చాయి. వీటిలో 187 ప్రైవేటు కాలేజీల్లో 86,951 సీట్లు, 14 ప్రభుత్వ కాలేజీల్లో 3,060 సీట్లున్నాయి.

ఈసారి ప్రవేశాలు వీటిలోనే జరుగనున్నాయి. ఏఐసీటీఈ గుర్తింపు ఇచ్చిన సీట్లలో సదుపాయాలు, అధ్యాపకుల కొరత తదితర లోపాలతో 36 వేలకు వర్సిటీలు కోత పెట్టాయి. గతేడాది ఏఐసీటీఈ 1.39 లక్షల సీట్లకు గుర్తింపునివ్వగా, వాటిలో 1.04 లక్షల సీట్లకు వర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. గతేడాదితో పోలిస్తే వర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చిన సీట్లలో 14 వేలకు కోత పడింది. ఈసారి కొన్ని కాలేజీలు కొత్త కోర్సులకు అనుబంధ గుర్తింపు తెచ్చుకున్నాయి. వాటిని ప్రభుత్వం ఆమోదిస్తే మరో 500 దాకా సీట్లు అందుబాటులోకి వస్తాయి. అనుబంధ గుర్తింపులో ఈసారి మధ్య తరహా కాలేజీలకు దెబ్బ పడింది. కొన్నింటికి గుర్తింపే లభించలేదు. ఏఐసీటీఈ 250 కాలేజీలకు గుర్తింపు ఇస్తే లోపాల కారణంగా 49 కాలేజీల్లో ప్రవేశాలకు వర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. వీటిలో 11 కాలేజీలు ప్రవేశాలొద్దని వేడుకున్నాయి. టాప్‌ కాలేజీల్లో సీట్లకు యథాతథంగా ఆమోదం తెలిపారని, డిమాండ్‌ లేని కోర్సుల్లో సీట్లనే తగ్గించారని సమాచారం.

వెబ్‌ ఆప్షన్లు నేటి నుంచి
వర్సిటీలు ఆమోదం తెలిపిన కాలేజీల్లో 9 ముస్లిం మైనారిటీ, అదర్‌ మైనారిటీ కాలేజీలు తమ పరిధిలోని దాదాపు 8 వేల సీట్లకు సొంత ప్రవేశ పరీక్ష ద్వారా సింగిల్‌ విండో (ఎస్‌డబ్ల్యూ)–1, 2 విధానంలో ప్రవేశాలు చేసుకోనున్నాయి. ఇవి పోను 83,432 సీట్లు అందుబాటులో ఉంటాయి. వీటిలో 70 శాతం కన్వీనర్‌ కోటాలో 58,381 సీట్లు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ కాలేజీల్లోని 3,060 సీట్లు కలిపి మొత్తం 61,441 సీట్లను కన్వీనర్‌ కోటాలో భర్తీ చేస్తారు. 15 శాతం ఓపెన్‌ మెరిట్‌ ఉంటుంది. ఇందులో ఏపీ విద్యార్థులకు, నాన్‌ లోకల్స్‌కు (గతంలో తెలంగాణలో 10 ఏళ్లు నివాసమున్న కుటుంబాల పిల్లలకు) కూడా అవకాశమిస్తారు. శుక్రవారం నుంచి వెబ్‌ ఆప్షన్లను ప్రారంభించనున్నారు. ఇందుకోసం విద్యార్థుల రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్లకు ఇప్పటికే లాగిన్‌ ఐడీలను ప్రవేశాల క్యాంపు కార్యాలయం పంపింది. మిగతా 28,570 సీట్లలో యాజమాన్యాలు 15 శాతం సీట్లను మేనేజ్‌మెంట్‌ కోటాలో, మరో 15 శాతాన్ని ఎన్‌ఆర్‌ఐ/ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్‌ కోటాలో భర్తీ చేసుకుంటాయి.

రెండు రోజుల్లో 36,000 ర్యాంకు దాకా ఆప్షన్లు
ఇంజనీరింగ్‌ ప్రవేశాల్లో తొలి రెండు రోజుల్లో 1–36 వేల దాకా ర్యాంకున్న విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకునేలా ఏర్పాట్లు చేశారు. 16న ఉదయం 11 నుంచి 18న ఉదయం 11 గంటల ్టట్ఛ్చఝఛ్ఛ్టి.nజీఛి.జీ nలో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. కాలేజీలు, బ్రాంచీలవా రీగా సీట్ల వివరాలను సైట్‌లో పొందవ చ్చు. ఆ తర్వాత ఆప్షన్లు ఇచ్చుకునే వారికి తేదీలవారీ షెడ్యూలును ప్రవేశాల క్యాంపు కార్యాలయం ఖరారు చేసింది. గురువారం దాకా 36 వేల ర్యాంకు లోపు 24,259 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. శుక్రవారం 36,001 నుంచి 46 వేల ర్యాంకు దాకా విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ జరుగుతుంది.

ర్యాంకులవారీగా వెబ్‌ ఆప్షన్ల తేదీలు
తేదీలు    ర్యాంకు

16–6–2017, 17–6–2017    1 నుంచి 36 వేలు
18–6–2017, 19–6–2017    36001 నుంచి 56 వేలు
20–6–2017, 21–6–2017    56001 నుంచి 80 వేలు
21–6–2017, 22–6–2017    80001 నుంచి చివరి ర్యాంకు దాకా
22–6–2017, 23–6–2017    వెబ్‌ ఆప్షన్లలో మార్పులకు అవకాశం
28–6–2017    సీట్లు కేటాయింపు, వెబ్‌సైట్‌లో వివరాలు
3–7–2017లోగా:    కాలేజీల్లో చేరడం

ర్యాంకులవారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ తేదీలు
తేదీలు    ర్యాంకు

16–6–2017    36,001 నుంచి 46,000
17–6–2017    46,001 నుంచి 56,000
18–6–2017    56,001 నుంచి 68,000
19–6–2017    68,001 నుంచి 80,000
20–6–2017    80,001 నుంచి 92,000
21–6–2017    92,001 నుంచి చివరి ర్యాంకు దాకా

>
మరిన్ని వార్తలు