ఈసారి 90 వేల లోపే ఇంజనీరింగ్‌ సీట్లు!

7 Jun, 2019 08:12 IST|Sakshi

లెక్కలు వేస్తున్న యూనివర్సిటీలు

ఏఐసీటీఈ అనుమతి 1,08,175 సీట్లకే

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈసారి ఇంజనీరింగ్‌ సీట్లు మరింతగా తగ్గిపోనున్నాయి. గతేడాది అనుబంధ గుర్తింపు ఇచ్చిన సీట్ల కంటే ఈసారి 5 వేలకు పైగా సీట్లు తగ్గిపోయే పరిస్థితి నెలకొంది. గతేడాది రాష్ట్రంలోని 228 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 1,14,247 సీట్ల భర్తీకి ఏఐసీటీఈ గుర్తింపు ఇచ్చింది. అయితే రాష్ట్రంలోని యూనివర్సిటీలు ఇంజనీరింగ్‌ కాలేజీల్లోని ఫ్యాకల్టీ, వసతులను బట్టి 198 కాలేజీల్లో 95,235 సీట్లకే అనుబంధ గుర్తింపును ఇచ్చాయి. ఇక ఈ విద్యా సంవత్సరంలో ఏఐసీటీఈ రాష్ట్రంలో 214 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 1,08,175 సీట్లకు గుర్తింపు ఇవ్వగా.. యూనివర్సిటీలు దాదాపు 180 కాలేజీల్లో 90 వేల లోపు సీట్లలో భర్తీకే అనుబంధ గుర్తింపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

కొన్ని కాలేజీల్లో ప్రవేశాలు లేక కొన్ని కోర్సులను రద్దు చేసుకోగా, కొన్ని కాలేజీలు పూర్తిగా మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయి. మరోవైపు కొన్ని కాలేజీల్లో లోపాల కారణంగా యూనివర్సిటీలు సీట్లను తగ్గిస్తున్నట్లు తెలిసింది. దీంతో గతేడాది కంటే ఈసారి 5 వేలకు పైగా సీట్లు తగ్గిపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే యూనివర్సిటీలు ప్రారంభించిన కాలేజీ వారీగా అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. దీంతో యూనివర్సిటీల పరిధిలో మొత్తంగా ఎన్ని కాలేజీల్లో ఎన్ని సీట్లలో ప్రవేశాలకు అనుబంధ గుర్తింపు ఇచ్చామన్న లెక్కలు సిద్ధం చేస్తున్నాయి. మరోవైపు ఏఐసీటీఈ గుర్తింపు ఇచ్చిన కాలేజీలు, సీట్ల వివరాలను సాంకేతిక విద్యాశాఖ గురువారం ప్రకటించింది. అయితే అందులో ఎన్ని కాలేజీలు, ఎన్ని సీట్లలో ప్రవేశాలకు వర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇస్తాయనేది తేలాల్సి ఉంది.

వెబ్‌సైట్‌లో గతేడాది ర్యాంకుల వివరాలు..
గతేడాది ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఏ ర్యాంకుల వారికి ఏయే కాలేజీల్లో సీట్లు వచ్చాయన్న వివరాలను  (http://www.sbtet.telangana.gov.in) అందుబాటులో ఉంచినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్‌ తెలిపారు. 2018కి సంబంధించి ఎంసెట్‌తోపాటు ఐసెట్‌ ప్రవేశాల ర్యాంకుల వివరాలను కాలేజీల వారీగా అందులో పొందుపరిచినట్లు వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు