అత్తింటి వేధింపులే కారణం

7 Mar, 2020 08:08 IST|Sakshi
వివరాలు సేకరిస్తున్న ఏసీపీ, సీఐ, తహసీల్దార్‌

సాక్షి, తిమ్మాపూర్‌(మానకొండూర్‌): మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ స్థానిక ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ థర్డ్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థిని శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్తనపేట గ్రామానికి చెందిన జడ అనూష(21) మండల కేంద్రంలోని గర్ట్స్‌ హాస్టల్‌లో ఉంటూ బీటెక్‌ చదువుతోంది. ఏడాది క్రితం తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన ఆది మల్లేష్‌తో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా హాస్టల్‌లో ఉంటూనే చదువు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం అనారోగ్యంగా ఉందని కాలేజీకి వెళ్లకుండా గదిలోనే ఉంది. మధ్యాహ్నం భోజనం చేసేందుకు అనూష రాకపోవడంతో పక్కగదిలో ఉంటున్న మరో విద్యార్థిని వెళ్లి చూడగా కనిపించలేదు. వెంటనే హాస్టల్‌ యజమానికి చెప్పడంతో కిటికీ పగలగొట్టి చూడగా బాత్‌రూంలో కాళ్లు కనిపించాయి. జారిపడి ఉంటుందని భావించారు. బాత్‌రూంకు గడియ పెట్టడంతో వెంటిలేటర్‌ నుంచి చూడగా ఉరేసుకుని ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, రూరల్‌ ఏసీపీ విజయసారధి, సీఐ మహేశ్‌గౌడ్, ఎల్‌ఎండీ ఎస్‌హెచ్‌వో నీతికపంత్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హైదరాబాద్‌లో ఉన్న అనూష భర్తను కూడా రప్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అత్తింటి వేధింపులే కారణం!
అనూష మృతికి అత్తింటి వేధింపులే కారణమంటూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. ఏడాది క్రితం తమ కుమార్తెకు రూ.21 లక్షల కట్నం, బంగారం ఇచ్చి సాగనంపామని, సంవత్సరం గడవకముందే ఆడపడచు, అత్త వేధింపులు మొదలయ్యాయని, మరో రూ.పది లక్షలు అదనంగా వరకట్నం తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపారు. అనూష మరిదికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. అతడికి రూ.25 నుంచి రూ.30 లక్షలు ఇస్తున్నారని, నీవు కూడా అంత కట్నం తీసుకురావాలని అనూషను ఒత్తిడి చేసినట్లు తల్లిదండ్రులు, బంధువులు వాపోతున్నారు. ఏసీపీ, సిఐ, తహసీల్దార్‌ మృతురాలి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తండ్రి జడ మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేష్‌గౌడ్‌ తెలిపారు. 

మర్తనపేటలో విషాదం
కోనరావుపేట(వేములవాడ): కోనరావుపేట మండలం మర్తనపేట గ్రామానికి చెందిన జడ అనూష ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది.  భర్త హైదరాబాద్‌లో ప్రైవేట్‌ జాబ్‌ చేస్తున్నాడు. శుక్రవారం అనూష ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కరీంనగర్‌కు తరలివెళ్లారు. 

మరిన్ని వార్తలు