వేధింపులకు విద్యాకుసుమం బలి

22 Jan, 2016 11:57 IST|Sakshi

రైలు కింద పడి కేయూ ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
మృతురాలి స్వగ్రామానికి చెందిన ఆకతాయిల వేధింపులతో మనస్తాపం

 
మఠంపల్లి(నల్లగొండ) : ఆకతాయిల వేధింపులకు గిరిజన విద్యాకుసుమం రాలిపోయింది. చదువులో మేటిగా రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తందనుకున్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలోని చింతల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడిన రూపావత్ లలిత(19) స్వగ్రామం మఠంపల్లి మం డలం రాంచద్రాపురం తండా. రూపావత్ మగతనాయక్, బుజ్జి దంపతులకు కుమార్తె లలితతోపాటు కుమారుడు రమేష్ ఉన్నాడు. రమేష్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుండగా మగత స్థానిక సిమెంట్ పరిశ్రమలో తాత్కాలిక కార్మికుడు. తల్లి బుజ్జి రోజువారీ కూలీగా జీవనం సాగిస్తోం ది. లలిత చిన్ననాటి నుంచి చదువులో రాణిస్తోంది. టెన్‌‌తలో 9.8 మార్కులతో స్కూల్ టాపర్‌గా నిలిచింది. కోదాడలోని ఎస్‌వీ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ చదివి 974 మార్కులతో కళాశాల టాపర్‌గా నిలిచింది. ఇంజనీర్ కావాలనే ధ్యేయంతో కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్(ఈసీఈ) గ్రూప్‌లో చేరింది. ఇటీవల సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లింది.

ఈ క్రమంలో అదే తండాకు చెందిన పలువురు ఆకతాయిలు తన ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌లు పంపడమేగాక ఫోన్ చేసి వేధిస్తున్నారని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తామం తా ఉన్నామని నీకు భయంలేదని భరోసా కల్పించి మూడు రోజుల క్రితం కళాశాలకు పంపించారు. అనంతరం స్థానిక పెద్దమనుషులతో ఆకతాయిలను మందలింపజేశారు. అయి నా ఆకతాయిల వేధింపులు ఆగకపోవడంతో బుధవారం రాత్రంతా హాస్టల్‌లో ఉన్న లలిత విలపించింది. గురువారం కళాశాలకు వెళ్లి మధ్యాహ్నం తోటి స్నేహితులకు చెప్పకుండా రైల్వేట్రాక్ వద్దకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. చదువులో ముందుండే లలిత ఉన్నత ఉద్యోగం సాధించి తండాకు మంచి పేరు తెస్తుందని అనుకున్నామని అంతలోనే ఇంతటి అఘాయిత్యం జరుగుతుందని తాము ఊహించలేకపోయామని బంధువులు విలపిస్తూ తెలిపారు.

ఈ సంఘటనపై లలిత  తల్లిదండ్రలు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమించమని వేధించడం వల్లే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. పోలీసులు  కేసు నమోదు చేసుకుని ఆ దిశగా విచారణ చేపట్టారు. 

మరిన్ని వార్తలు