రేపటి నుంచి వెబ్‌ ఆప్షన్లు

5 Jul, 2019 02:55 IST|Sakshi

ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజులు ఖరారు

సీఎం వద్దకు ఫైలు.. నేడు ఉత్తర్వులు జారీ?

 జీవో జారీ కాకుంటే షరతులతో ఆప్షన్ల ఎంపిక

అందుబాటులోకి 183 కాలేజీలు.. 91,270 సీట్లు

వెబ్‌ ఆప్షన్ల నాటికి పెరగనున్న సీట్ల సంఖ్య

కన్వీనర్‌ కోటాలో అందుబాటులో ఉన్న 64,709 సీట్లు

ప్రభుత్వ కాలేజీల్లో 3,071, ప్రైవేటు కాలేజీల్లో 61,638

రివైజ్డ్‌ షెడ్యూలు ప్రకటించిన ప్రవేశాల కమిటీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలకు ఈనెల 6వ తేదీ నుంచి వెబ్‌ ఆప్షన్లు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం రివైజ్డ్‌ షెడ్యూలును ప్రవేశాల కమిటీ జారీ చేసింది. విద్యార్థులు ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌ వెల్లడించారు. ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం 54,836 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకొని సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకోగా, అందులో 53,795 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. వారంతా శుక్రవారం నుంచి వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల క్యాంపు    మిగతా కార్యాలయం అధికారి బి.శ్రీనివాస్‌ వివరించారు. అలాగే కాలేజీల వారీగా సీట్ల వివరాలను వెల్లడించారు.

ఫీజుల ఖరారు.. లేదంటే షరతులతో ముందుకు!
రాష్ట్రంలోని 189 ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజుల ఖరారు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈనెల 1 నుంచి 3వ తేదీ వరకు ఫీజుల ఖరారు కోసం కోర్టును ఆశ్రయించిన 81 కాలేజీలతో ప్రవేశాలు ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) హియరింగ్‌ నిర్వహించి ఫీజులను ఖరారు చేసింది. మిగతా 108 కాలేజీల ఫీజల ఖరారు ప్రక్రియను గురువారం చేపట్టింది. అర్ధరాత్రి వరకు కొనసాగించింది. మరోవైపు శుక్రవారం ఉదయం నుంచే ఆయా కాలేజీలతో హియరింగ్‌ నిర్వహించి ఫీజులను ఖరారు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే ఇప్పటికే 81 కాలేజీలకు ఖరారు చేసిన ఫీజులపై ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఫైలును ప్రభుత్వానికి పంపించింది. గురువారం సాయంత్రమే ఆ ఫైలును సీఎం ఆమోదం కోసం విద్యాశాఖ పంపించింది. దీంతో శుక్రవారం ఆయా కాలేజీల ఫీజులపై ఉత్తర్వులు జారీ అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఏఎఫ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ జస్టిస్‌ స్వరూప్‌రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, సాంకేతిక విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ గురువారం సమావేశమై 4గంటల పాటు చర్చించారు. శుక్రవారం సాయంత్రం వరకు మిగతా కాలేజీలకు సంబంధించిన ఫీజుల ఫైలును కూడా పంపించాలన్న ఆలోచనల్లో ఉన్నారు.

సీఎం ఆమోదం ఆలస్యమైతే!
ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపించిన ఫైలుకు ఆమోదం లభించడంలో ఆలస్యమైతే.. ఎలా ముందుకెళ్లాలన్న కార్యాచరణపైనా ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించారు. ఇప్పటికే ఎలాగూ కాలేజీ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి రూ.50వేల లోపు ఫీజున్న కాలేజీలకు 20%, రూ.50వేలకు పైగా ఫీజు ఉన్న కాలేజీలకు 15% పెంపునకు ప్రతిపాదించడం.. దీనికి మెజారిటీ కాలేజీలు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్‌ను ఆలస్యం చేయవద్దని, యాజమాన్యాలకు ఏఎఫ్‌ఆర్‌సీ చేసిన ఫీజు పెంపు ప్రతిపాదనల అమలుతో ముందుకు సాగాలని నిర్ణయించారు. సీఎం కనుక శుక్రవారం ఓకే చేస్తే ఎలాంటి సమస్యా ఉండదన్న భావనకు వచ్చారు. అది జరక్కపోతే మాత్రం కండిషనల్‌గా 15%, 20% పెంపును వర్తింపజేయాలని నిర్ణయించారు. పూర్తిస్థాయి ఫీజులపై ఉత్తర్వులు వచ్చాక వాటిని అమలు చేస్తామని, ఈ అంశాలన్నింటిని తెలియజేస్తూ వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు.

ఇప్పటికే ఫీజుల పెంపుపై స్పష్టత!
తల్లిదండ్రుల్లో ఇప్పటికే ఫీజుల పెంపుపై ఓ స్పష్టత వచ్చిందన్న అభిప్రాయానికి అధికారుల వచ్చారు. ఏఎఫ్‌ఆర్‌సీ హియరింగ్‌ సీబీఐటీకి రూ.1.34 లక్షలు వార్షిక ఫీజుగా ఖరారు చేసినట్లు తెలిసింది. అలాగే శ్రీనిధి, వాసవి కాలే జీలకు రూ.1.30 లక్షలుగా, ఎంజీఐటీకి రూ.1.08 లక్షలుగా ఫీజును ఖరారు చేసినట్లు సమాచారం.దీంతో టాప్‌ కాలేజీల్లో గరిష్టంగా ఫీజు ఎంత ఉండొచ్చన్న అంచనా ఉంది. దీంతో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.25 వేల వరకు ఫీజు పెంపు ఉండనుంది. ఈ నేపథ్యంలో ఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేసిన ఈ ఫీజులకు శుక్రవారం ప్రభుత్వం నుంచి ఆమోదం లభించకపోతే షరతులతో ముందుకు సాగనున్నారు.

కన్వీనర్‌ కోటాలో 64,709 సీట్లు
ఇప్పటివరకు అన్ని సరిగ్గా ఉన్న 183 కాలేజీల్లో మొత్తంగా 91,270 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ప్రవేశాల కమిటీ ప్రకటించింది. అందులో 169 ప్రైవేటు కాలేజీల్లో 88,199 సీట్లు అందుబాటులో ఉండగా, 14 యూనివర్సిటీ/ప్రభుత్వ కాలేజీల్లో 3,071 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం సీట్లలో 70% సీట్లను (64,709) కన్వీనర్‌ కోటాలో కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తంగా 26,561 సీట్లు మేనేజ్‌మెంట్, ఎన్నారై/ఎన్నారై స్పాన్సర్డ్‌ కోటాలో కాలేజీలు భర్తీ చేసుకునే అవకాశం ఉంది. శనివారం నాటికి మరిన్ని కాలేజీలు, సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

యూనివర్సిటీల వారీగా ప్రభుత్వ కాలేజీలు, సీట్లు
యూనివర్సిటీ    కాలేజీలు    సీట్లు
ఉస్మానియా    2    420
జేఎన్‌టీయూ–హెచ్‌    4    1,410
కాకతీయ    3    825
మహత్మాగాంధీ    1    180
జేఎన్‌ఏఎఫ్‌ఏయూ    1    160
అగ్రికల్చర్‌ యూనివర్సిటీ    2    54
వెటర్నరీ యూనివర్సిటీ    1    22
మొత్తం    14    3,071

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మొత్తం సీట్ల వివరాలు..
యూనివర్సిటీ    ఆమోదం లభించిన మొత్తం    కన్వీనర్‌ కోటాలో సీట్లు
 కాలేజీలు    సీట్లు    కాలేజీలు    సీట్లు
ఉస్మానియా    13    7,760    13    5,411
జేఎన్‌టీయూ–హెచ్‌    151    78,729    151    55,030
కాకతీయ    5    1,710    5    1,197
మొత్తం    169    88,199    169    61,638
యూనివర్సిటీ అనుబంధ కాలేజీల్లో    14    3,071
మొత్తంగా కన్వీనర్‌ కోటాలో...    183    64,709


కన్వీనర్‌ కోటాలో కోర్సుల వారీగా సీట్ల వివరాలు..
కోర్సు    యూనివర్సిటీ    ప్రైవేటు
అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌    27    –
ఆర్టిఫిషియల్‌ ఇంటలీజెన్స్‌    –    84
ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌    –    294
ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌    –    84
బయోటెక్నాలజీ    –    21
బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌    30    21
కెమికల్‌ ఇంజనీరింగ్‌    120    126
సివిల్‌ ఇంజనీరింగ్‌    130    7,949
కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ బిజినెస్‌ సిస్టం    –    42
కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌    550    16,614
సీఎస్‌ఐటీ    –    42
డైరీయింగ్‌    22    –
డిజిటల్‌ టెక్నిక్స్‌ ఫర్‌ డిజైన్‌ అండ్‌ ప్లానింగ్‌    60    –
ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌    500    14,955
ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌    –    16
ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌    490    7,792
ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేనేషన్‌ ఇంజనీరింగ్‌    –    322
ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీమ్యాటిక్స్‌    –    42
ఫుడ్‌సైన్స్‌    27    –    
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ    20    –
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ    240    3,717
ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌    –    112
ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఇంజనీరింగ్‌    –    42
మెకానికల్‌ (మెకట్రానిక్స్‌) ఇంజనీరింగ్‌    –    42
మెకానికల్‌ ఇంజనీరింగ్‌    420    8,833
మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌    60    –
మైనింగ్‌ ఇంజనీరింగ్‌    55    168
మెటలర్జీ అండ్‌ మెటీరియల్‌ ఇంజనీరింగ్‌    –    42
పెట్రోలియం ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ    –    84
ఫార్మాసూటికల్‌ ఇంజనీరింగ్‌    –    42
ప్లానింగ్‌    40    –
టెక్స్‌టైల్‌ టెక్నాలజీ    20    –
మొత్తం    3,071    61,638 

మరిన్ని వార్తలు