అంగన్‌వాడీ కేంద్రాల్లో బుడి‘బడి’ అడుగులు

19 Aug, 2019 11:05 IST|Sakshi

సాక్షి, హుజూరాబాద్‌: అంగన్‌వాడీ కేంద్రాలను చిన్నారులను బుడి‘బడి’ అడుగులు వేయిస్తున్నాయి. పౌష్టికాహారం అందించడంతోపాటు ఆటపాటలతో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన సాగిస్తున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో కొంతమేరకు విద్య నేర్చుకున్న తర్వాత తల్లిదండ్రులు చిన్నారులను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారని గుర్తించిన ప్రభుత్వం ఈ ఏడాది నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించింది. ఎల్‌కేజీ, యూకేజీ తరగతుల బోధనకు కార్యాచరణ సిద్ధం చేసి నూతన విధానాన్ని అమలు చేస్తోంది. కరీంనగర్‌ జిల్లాలో మొత్తం 777 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 752 ప్రధాన కేంద్రాలు ఉండగా, 25 మినీ కేంద్రాలు ఉన్నాయి. ఏడు నెలల నుంచి ఏడాది వయసు లోపు విద్యార్థులు 5,416 మంది ఉన్నారు. ఏడాది నుంచి మూడేళ్లలోపు విద్యార్థులు 1,181 మంది ఉండగా, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు విద్యార్థులు 9,210 మంది ఉన్నారు.

జిల్లా వివరాలు..

జిల్లాలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు 4
ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు 752
మినీ కేంద్రాలు 25
ఏడాదిలోపు విద్యార్థులు 5,416
మూడేళ్లలోపు విద్యార్థులు 1,181
ఆరేళ్లలోపు విద్యార్థులు 9,210

ఆటపాటలతో విద్య...
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే విద్యార్థుల్లో మానసిక, శారీరక వికాసాన్ని పెంపొందించేలా బోధన జరుగుతోంది. చిన్నారులను గ్రూపులుగా విభజించి రోజూ కనీసం 2 గంటలకు తగ్గకుండా పీరియడ్‌లు విభజించుకుని బోధన చేస్తున్నారు. నర్సరీ పిల్లలకు ఆటపాటలు, బొమ్మలు, మూడు, నాలుగేళ్లలోపు వారికి ఎల్‌కేజీ, నాలుగు, ఐదేళ్లలోపు వారికి యూకేజీ పాఠాలు బోధిస్తున్నారు. ఆంగ్లంలో రూపొందించిన చార్టులు బోధనకు అనుగుణంగా తరగతి గదుల్లో ప్రదర్శిస్తున్నారు. ఆంగ్లం వర్క్‌ బుక్స్, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌, పుస్తకం, నేను నా పరిసరాల పేరుతో ఉన్న పుస్తకాలతో పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నారు. చిన్నారులకు బోధన ఎలా చేయాలనే దానిపై అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రత్యేకంగా సంసిద్ధ పేరుతో ఉన్న పుస్తకాలను అందజేయగా, ఇందులో పాఠాలు ఏ విధంగా బోధించాలో రూపొందించారు. ఆ పుస్తకాల ఆధారంగా బోధన చేస్తున్నారు. 

నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు
అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతోపాటు ఆటపాటలతో కూడిన ప్రాథమిక విద్యాబోధన పేరుతో మూడు రకాల అభ్యాస దీపికలను అందించారు. వీటితో బోధన చేస్తున్నారు. కొందరు చిన్నారుల తల్లిదండ్రులు మూడు, నాలుగేళ్లు దాటగానే చిన్నారులను ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఇదీ పేదవారికి భారమే అయినా పిల్లల భవిష్యత్‌ కోసం భరిస్తున్నామని పలువురు చిన్నారుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆంగ్ల మాధ్యమంలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ, బోధనకు చర్యలు చేపట్టగా,  జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో విజయవంతంగా అమలవుతోంది.

విద్యార్థుల సంఖ్య పెరిగింది 
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆంగ్ల బోధన చేస్తుండడంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యను కేంద్రాల్లోనే చెబుతున్నాం. తల్లిదండ్రులకు కూడా ప్రైవేట్‌ పాఠశాలల ఫీజు భారం కొంత మేరకు తగ్గుతుంది. ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో చేపట్టిన ఆంగ్ల విద్య విధానం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రభుత్వం ఆంగ్ల విద్య బోధనకు మాకు అందజేసిన సంసిద్ధ పుస్తకంలో చెప్పినట్లు బోధన చేస్తున్నాం.
– రాణి, అంగన్‌వాడీ టీచర్,హుజురాబాద్‌

ఆంగ్ల బోధన మంచి ఉద్దేశం
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆంగ్ల బోధన అమలు చేయడం మంచి ఉద్దేశం. ఈ ఏడాది నుంచి నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యాబోధన వర్క్‌బుక్స్‌ ద్వారా చేయడం జరుగుతుంది. విద్యార్థులకు అర్థమయ్యే విధానంలో ఆటపాటలతో కూడా విద్యా బోధన చేస్తున్నాం. ఆంగ్ల బోధన ద్వారా కేంద్రాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య పెరిగింది. తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చిన్నారులను అంగన్‌వాడీల్లో చేర్పించాలి.
– బండి ఉష, ప్రాజెక్టు అధ్యక్షురాలు

విజయవంతంగా సాగుతోంది
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆంగ్ల విద్యాబోధన విజయవంతంగా సాగుతోంది. ప్రాథమిక స్థాయిలో విద్యా విధానంలో వస్తున్న పోటీ కారణంగా ప్రభుత్వం ప్రాథమిక స్థాయిలో చిన్నారులకు ఆంగ్ల బోధన జరగాలని సంకల్పించి, అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్ల బోధన అమలు చేస్తోంది. చిన్నారులకు అర్థమయ్యే రీతిలో ఫ్లాష్‌కారŠుడ్స ద్వారా, ఆట పాటలతో కూడిన విద్యాబోధన చేస్తున్నాం. మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రైవేట్‌ స్కూళ్లకు దీటుగా అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ఆంగ్ల బోధన ఎంతగానో దోహదపడుతుంది.
– శారద, ఐసీడీఎస్, సీడీపిఓ, హుజురాబాద్‌

మరిన్ని వార్తలు