ఆశ్రమ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం!

2 Mar, 2018 04:23 IST|Sakshi

     319 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయం

     గురుకులాల తరహాలో హంగులు అద్దనున్న గిరిజన సంక్షేమ శాఖ

     పక్కా భవనాలు ఉండటంతో విద్యార్థుల సంఖ్యను పెంచుకునే వెసులుబాటు

     ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించిన అధికారులు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. వాటిని గురుకులాల స్థాయిలో అభివృద్ధి చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో గురుకుల సొసైటీల ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలకు సమాంతరంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆశ్రమ పాఠశాలలు కొనసాగుతున్నాయి. భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూరు, మన్ననూరు ఐటీడీఏల పరిధిలో 319 ఆశ్రమ పాఠశాలలు ఉండగా.. వాటిల్లో 1.2 లక్షల మంది విద్యార్థులున్నారు. పూర్తిగా గిరిజన, అటవీ ప్రాంతాలు కావడం.. బోధన, అభ్యాసనలో వెనుకబాటు ఉండటంతో గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేకంగా ఈ ఆశ్రమ పాఠశాలలను నిర్వహిస్తోంది. ఈ పాఠశాలల్లో ప్రస్తుతం తెలుగు మీడియంలోనే బోధన సాగుతోంది. అయితే మారుతున్న సామాజిక పరిస్థితులు, సర్కారు తలపెట్టిన కేజీ టు పీజీ విద్య పథకంలో భాగంగా ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యత పెరిగింది. ఇప్పటికే గురుకులాల్లో ఇంగ్లిష్‌ మీడియం అమల్లో ఉంది కూడా. ఈ నేపథ్యంలో ఆశ్రమ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది.

విడతల వారీగా అమలు..
ప్రస్తుతం ఆశ్రమ పాఠశాలల్లో మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు బోధన సాగుతోంది. ఈ పాఠశాలల్లో పూర్తి స్థాయి బోధనా సిబ్బంది ఉండటంతోపాటు హాస్టల్‌ వసతి కూడా ఉంది. దాదాపు అన్ని ఆశ్రమ పాఠశాలలకు పక్కా భవనాలు కూడా ఉన్నాయి. ఇలా అన్ని సదుపాయాలు ఉన్న నేపథ్యంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. అయితే ఒకేసారి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉండటంతో.. దశల వారీగా చేపట్టాలని భావిస్తోంది. తొలుత ప్రాథమిక స్థాయిలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టనున్నారు. తర్వాత ఏటా ఒక్కో తరగతికి పెంచుకుంటూ వెళతారు. ప్రస్తుతం తెలుగు మీడియం అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆటంకం లేకుండా ఇంగ్లిష్‌ మీడియం అమలవుతుంది. మొత్తంగా దాదాపు ఐదారేళ్లలో ఆశ్రమ పాఠశాలలు పూర్తిస్థాయిలో ఆంగ్ల మీడియం పాఠశాలలుగా మారుతాయి.

ఖాళీల భర్తీకి చర్యలు..
ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గిరిజన సంక్షేమ శాఖ చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఆరు వందలకు పైగా ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ ద్వారా నియామక ప్రక్రియ చేపట్టనుంది. ఈ భర్తీ ప్రక్రియలో ఇంగ్లిష్‌ మీడియంలో బోధించే సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆశ్రమ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విధానానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు గిరిజన సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు