ఆదివాసీల నిర్బంధంపై హైకోర్టులో విచారణ

16 Jun, 2019 17:04 IST|Sakshi

హైదరాబాద్‌: ఆదివాసుల అక్రమ నిర్బంధానికి సంబంధించి హైకోర్టులో దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ నేడు విచారణకు రానుంది. హైకోర్టు ఆదేశాల మేరకు 67 మంది ఆదివాసీలను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచాలని న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెల్సిందే. కాగజ్‌ నగర్‌ వెంపల్లి అటవీశాఖ డిపో నుంచి ఆదివాసీలను హైదరాబాద్‌కు అటవీ శాఖాధికారులు తీసుకొచ్చారు. ప్రస్తుతం అటవీశాఖాధికారుల అదుపులో ఉన్న 67 మంది ఆదివాసీలు హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌కు చేరుకున్నారు. వీరికి అధికారులు కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. కౌన్సిలింగ్‌ ముగిసిన తర్వాత కుందన్‌బాగ్‌లోని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ముందు అటవీశాఖాధికారులు హాజరు పరచనున్నారు.

వివరాలు..కుమ్రం భీం జిల్లా రేపల్లెలోని ఫారెస్ట్‌ డిపోలో ఆదివాసీలను అక్రమంగా నిర్బంధించారని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎదుట పౌరహక్కుల సంఘం హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. నాలుగు రోజులుగా 67 మంది ఆదివాసీలను అక్రమంగా నిర్బంధించి చిత్ర హింసలకు గురిచేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. వెంటనే వారందరినీ కోర్టు ఎదుట హాజరుపరచాలని ఫారెస్ట్‌ డివిజినల్‌ అధికారిని హైకోర్టు ఆదేశించింది. ఆదివాసీలను ప్రత్యేక బస్సులో హైదరాబాద్‌కు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది.

ఎవరినీ బలవంతంగా బంధించలేదని వాళ్లు ఇష్టపూర్వకంగానే వచ్చి ఫారెస్ట్‌ డిపోలో ఉంటున్నారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. కానీ ప్రభుత్వ వాదనను కోర్టు అంగీకరించలేదు. దశాబ్దాలుగా ఆదివాసీలు పోడు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారని, ఇటీవల ఆదిలాబాద్‌, కుమ్రంభీం జిల్లాల్లో పోడు వ్యవసాయం చేస్తోన్న ఆదివాసీలపై అటవీశాఖ అధికారుల దాడులు పెరిగిపోతున్నాయని అధికార పార్టీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సాక్షాత్తూ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వినతి పత్రం కూడా సమర్పించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకుని దాడులను నిలిపి వేసేలా చర్యలు తీసుకోవాలని ఆత్రం సక్కు కోరారు.

మరిన్ని వార్తలు