గిరిజనులకు భరోసా

27 Jul, 2015 02:00 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : దగా పడ్డ దళిత గిరిజనులకు సాక్షి అక్షర గొడుగు పట్టింది. అన్యాయాన్ని ఎత్తిచూపి.. వారికి అండగా నిలబడింది. వరుస కథనాలతో అక్షర సమరం చేసింది. ఎట్టకేలకు భూ సీలింగ్ చట్టం కింద భూములు పొందిన దళిత గిరిజనులకు పట్టాలిచ్చేందుకు రెవెన్యూ అధికారులు అంగీకరించారు. పెద్దల గుప్పిట్లో ఉన్న భూమిని విడిపించి..అర్హులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం మెదక్ ఆర్డీఓ మెంచు నగేష్, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులతో కలిసి తిమ్మాయిపల్లి భూములను సందర్శించారు. వాస్తవ పరిస్థితిని అంచనావేశారు. రెవెన్యూ అధికారికి ‘సాక్షి’ అందించిన కీలక పత్రాలతో గిరిజనులు భూ యజమానులు కాబోతున్నారు..

 వరుస కథనాలతో వెన్నులో వణుకు:
 అన్నల కోటలో.. అన్యులెవరు ప్రవేశించని అనంతసాగర్ భూముల డొంకను ‘సాక్షి’ కదిలించింది. సీలింగ్ యాక్ట్‌లో భాగంగా ప్రభుత్వం నుంచి పట్టాలు పొంది సాగు చేసుకుంటున్న గిరిజనుల భూములను కొంతమంది దొరలు లాక్కునే ప్రయత్నాన్ని సాక్షి అడ్డుకుంది. 63మంది గిరిజనుల జీవితాలకు భరోసా ఇచ్చే క్రమంలో మార్చి 11న  ‘‘భూ మాయ’’ శీర్షికన తొలిసారి పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది.  ‘‘ఆరాచకం’’ పేరుతో మరో కథనాన్ని ప్రచురించడంతో అధికార గణాల్లో చలనం ప్రారంభమైంది. ఇదే విషయాన్ని మార్చి 19న ‘‘ఏం చేస్తుండ్రు’’ మరో కథనాన్ని ప్రచురించింది. తదనుగుణంగా అధికారులు విచారణ ప్రారంభించినప్పటికీ ఆశించిన స్థాయిలో విచారణ సాగకపోవడంతో జూన్‌లో ‘మళ్లీ వచ్చాడు భూచోడు’ శీర్షికన టాబ్లాయిడ్‌లో... ‘భూదందా గుట్టురట్టు’ అనే శీర్షికతో మెయిన్‌లో కథనాలు ప్రచురించింది.

అనంతరం జూలై 25న మరోసారి ‘భూచోళ్లకు అండ’ శీర్షికతో  అలసత్వాన్ని ఎండగట్టింది. అనంతరం తిమ్మాయిపల్లి భూముల్లో విస్తృత పరిశోధన చేసి అనేక ప్రాంతాలు తిరిగి దగాపడ్డ అడవి బిడ్డల దీనగాధను అర్థం చేసుకుని వారిదగ్గరున్న కీలక పత్రాలను సంపాదించి బాధితుల తరపున మెదక్ ఆర్డీఓకు అందజేసింది. దీంతో అధికారుల్లో చలనం వచ్చింది. అనంతరం ఇతర మీడియా, అధికారులు ఎవరికి వారే  స్పందించారు. ఇందుకనుగుణంగా ఆదివారం మెదక్ ఆర్డీఓ రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో కలిసి తిమ్మాయిపల్లి వెళ్లి పూర్తిస్థాయి విచారణ గావించారు.
 
 గిరిజనులకు న్యాయం చేస్తాం
 గిరిజనుల వద్ద ఉన్న ప్రొిసీడింగ్‌లను, వాటి ప్రతులను రెవెన్యూ రికార్డులతో సరి చూసుకుంటాం. అవి రికార్డులకనుగుణంగా సరిపోతే గిరిజనులకు ఢోకాలేదు. వారికి భూమిపై హక్కులు కల్పిస్తాం. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు.
  - మెంచు నగేష్, ఆర్డీఓ
 
 ‘సాక్షి’కి సలాం
 రెక్కలు ముక్కలు చేసుకొని దుక్కులు దున్నుకొని బతుకీడుస్తున్న మా భూములపై పెద్దల కన్ను పడింది. మా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్నారు. మా మీద దౌర్జన్యం చేసి, మా భూములు మాకు కాకుండా చేశారు. భూ ఆక్రమణకు సిద్ధమయ్యారు. ఎవరికి చెప్పుకున్నా... మా వేదన అరణ్య రోదనే అయింది. ఆ సమయంలో ‘సాక్షి’ మాకు అండగా నిలిచింది. ‘సాక్షి’ పత్రికలో వచ్చిన కథనాల వల్లే పెద్ద దొరలు వెనక్కు తగ్గారు. అధికారులు ముందుకు వచ్చారు. మా భూములు మాకిప్పించేందుకు చర్యలు ప్రారంభించారు. మేము మా భూములు పొంది, మా భార్యాబిడ్డలకు ఇంత బువ్వపెట్టే పరిస్థితి వస్తే... అది ‘సాక్షి’ పుణ్యమే. ‘సాక్షి’కి చేతులెత్తి దండం పెడుతున్నాం.
 - ఎరుకల సిద్దిరాంలు/సడిమళ్ల కుమార్, బాధిత రైతులు

>
మరిన్ని వార్తలు