ఇంటి దొంగ

6 Jul, 2020 12:15 IST|Sakshi
వరంగల్‌ లీగల్‌ మెట్రాలజీ కార్యాలయం

లీగల్‌ మెట్రాలజీ కార్యాలయంలో సామగ్రి మాయం

భద్రపరచాల్సిన అధికారే విక్రయించినట్లు ఆరోపణలు

తన పరిధిలోని అన్ని జిల్లాల్లో యథేచ్ఛగా వసూళ్లు

గతంలో పనిచేసిన ప్రాంతాల వ్యాపారులకూ బెదిరింపులు

జిల్లా ఉన్నతాధికారిపై ప్రభుత్వానికి అందిన ఫిర్యాదు

కంచే చేను మేయడం అంటే ఇదే కావొచ్చు. తనిఖీల్లో జప్తు చేసిన తూనికలు, కొలతల సామగ్రిని భద్రంగా దాచాల్సిన అధికారే అక్రమంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు గతంలో పనిచేసి న జిల్లాల్లోనూ పలు అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. పెద్దసంఖ్యలో బాధితులు ముందుకొస్తుండడంతోకొందరు ఏకంగా సదరు అధికారి అవినీతిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం గమనార్హం.

వరంగల్‌: వరంగల్‌ పోచమ్మమైదాన్‌లో తూనికలు, కొలతల శాఖ సహాయ సంచాలకుల కార్యాలయం ఉండేది. ఈ కార్యాలయ ఆవరణ, గదులు అన్నీ సక్రమంగా.. సరిపడా ఉన్నా ఎందుకో తెలియదు కానీ ఆ కార్యాలయాన్ని కొత్తవాడకు మార్చారు. ఈ సమయాన్నే కార్యాలయంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. మూడు, నాలుగేళ్లుగాఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తూనికలు, కొలతల శాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో స్వాధీనం చేసుకున్న ఇత్తడి కొలతల పావులు, టన్నుల కొద్ది బాట్లు(తూకం రాళ్లు), ఎలక్ట్రానిక్, మాన్యువల్‌ కాంటాలు పాత కార్యాలయంలోని రెండు గదుల్లో ఉండేవి. వీటితో పాటు కార్యాలయంలోని మోడల్‌ కుర్చీలు, ఫ్యాన్లను సైతం కార్యాలయం మార్చే సమయంలో రహస్యంగా అమ్ముకున్నట్లు పలువురు ప్రభుత్వానికి అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అ«ధికారులు స్వాధీనం చేసుకున్న సమయంలో పూర్తి వివరాలను జప్తు రిజిస్టర్‌తో పాటు అసెట్స్‌ రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ప్రస్తుతం ఇవన్నీ కొత్త కార్యాలయంలో లేవని, నమోదు చేసిన పుస్తకాలు సైతం మాయం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయానికి చెందిన వాహనాలను సైతం ఆర్టీఏ అ««ధికారులతో తక్కువ ధరగా నిర్ణయించి తన బినామీలతో టెండర్లలో కొనుగోలు చేయించారని సమాచారం.

పైసలు ఇస్తేనే పని
సదరు అధికారి వద్దకు ఏదైనా పని నిమిత్తం వెళ్లే క్రమంలో ఖాళీ చేతులతో వెళ్తే నిరాశే ఎదురవుతుందని చెబుతారు. వేలాది రూపాయలు ముడుపులు సమర్పించుకుంటే తప్ప కొత్త లైసెన్సులు, రెన్యూవల్స్‌ కాని పరిస్థితి కార్యాలయంలో నెలకొన్నట్లు సమాచారం. ఆయన పరిధిలోని కరీంనగర్‌ జోన్‌ జగిత్యాల జిల్లాలో లైసెన్సుల జారీకి సవాలక్ష కొర్రీలు పెట్టి నిరాకరించడంతో బాధితులు రాష్ట్ర కంట్రోలర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయినప్పటికీ చేయి తడిపిన తర్వాతే ఈ ఏడాదికి లైసెన్సు జారీ చేసినట్లు చెబుతుండడం అక్రమాల విషయంలో ఆయన పట్టింపునకు నిదర్శనంగా చెప్పొచ్చు. నిర్మల్‌ జిల్లాలో పనిచేసే ఆ శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఒకరు రూ.60వేలు ప్రభుత్వ ఖజానాలో జనవరి వరకు జమ చేయలేదు. ఈ విషయమై పత్రికల్లో కథనాలు రావడంతో మార్చిలో ఆ డబ్బు ఖజానాకు చేరింది. అయితే, ఈ విషయాన్ని ఇక్కడ పనిచేసే ఉన్నతాధికారి కంట్రోలర్‌ దృష్టికి తీసుకువెళ్లకుండా ఉండేందుకు పెద్దమొత్తంలో ముడుపులు తీసుకున్నట్లు సమాచారం.

జిల్లా మారినా..
ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఉన్నతాధికారి వరంగల్‌ రూరల్‌ అధికారిగా పనిచేస్తూ పదోన్నతిపై వచ్చారు. అయినప్పటికీ పాత గుర్తింపు కార్డును సదరు జిల్లా వ్యాపారుల వద్దకు సిబ్బంది ద్వారా పంపించి వసూళ్లకు పాల్పడుతారని తెలుస్తోంది. కాగా, తూనికలు, కొలతల్లో తేడా వచ్చినప్పుడు అధికారులు కేసు నమోదు చేసి వెంటనే జరిమానా కట్టించుకునే విధానం రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తోంది. కానీ వరంగల్‌లోని ఈ ఉన్నతాధికారి మాత్రం జరిమానా తానే విధిస్తానని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసి సదరు వ్యాపారులను బెదిరించి రూ.వేలల్లో తీసుకుంటారని సమాచారం. ఈ విషయమై పూర్తి ఆధారాలతో పలువురు బాధితులు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తే సదరు ఉన్నతాధికారి బాగోతం బయటపడుతుందని వారు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు