తాత్కాలిక విద్యుత్‌ బిల్లు 

8 Apr, 2020 02:02 IST|Sakshi

గతేడాది ఏప్రిల్‌ బిల్లుకు సమానంగా ప్రస్తుత నెల బిల్లు

గృహ, వీధి దీపాలు, నీటి సరఫరా పథకాల కనెక్షన్లకు జారీ

ఇతర ఎల్టీ కేటగిరీలకు గతేడాది ఏప్రిల్‌ బిల్లులో 50 శాతం బిల్లు

డిస్కంల ప్రతిపాదనలకు ఈఆర్సీ గ్రీన్‌ సిగ్నల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నియంత్రణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో మీటర్‌ రీడింగ్‌ తీసుకోకుండా ప్రత్యామ్నాయ విధానంలో ఎల్టీ విద్యుత్‌ వినియోగదారులకు ప్రస్తుత ఏప్రిల్‌ నెలలో బిల్లులు జారీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) తాజాగా అనుమతిచ్చింది. గతేడాది సరిగ్గా ఏప్రిల్‌ నెలలో లేదా గత మార్చి నెలలో జారీ చేసిన విద్యుత్‌ బిల్లులు ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుత ఏప్రిల్‌ నెలలో వినియోగదారులకు తాత్కాలిక బిల్లులు జారీ చేస్తామని దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసిన ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోదం తెలిపింది. రాష్ట ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తివేసిన వెంటనే తదుపరి నెలకు సంబంధించిన మీటర్‌ రీడింగ్‌ను తీసి వినియోగదారుల వాస్తవ విద్యుత్‌ వినియోగం ఆధారంగా తాత్కాలిక విధానంలో జారీ చేసిన బిల్లుల్లోని హెచ్చుతగ్గులను సరిదిద్దాలని ఆదేశించింది. ఏప్రిల్‌లో ఎల్టీ వినియోగదారులకు ఈ కింది పద్ధతిలో విద్యుత్‌ బిల్లులు    జారీ చేయనున్నారు.

విద్యుత్‌ బిల్లు జారీ ఇలా.. 
► 2019 మార్చి నాటికి ఉనికిలో ఉన్న గృహ (ఎల్టీ–1), వీధి దీపాలు (ఎల్టీ–6ఏ), నీటి సరఫరా పథకాల (ఎల్టీ–6బీ) విద్యుత్‌ కనెక్షన్ల వినియోగదారులకు 2019 ఏప్రిల్‌లో జారీ చేసిన బిల్లులకు సమాన బిల్లులను ప్రస్తుత ఏప్రిల్‌ నెలలో జారీ చేయనున్నారు. అంటే మార్చి 2019లో వినియోగించిన విద్యుత్‌కు సంబంధించిన బిల్లులను 2019 ఏప్రిల్‌లో చెల్లించాలి. 2020 మార్చిలో వాడిన విద్యుత్‌కు సంబంధించిన బిల్లులను సైతం తాత్కాలికంగా 2019 మార్చిలో వాడిన విద్యుత్‌ గణాంకాల ప్రాతిపదిక వసూలు చేయాలని డిస్కంలు ప్రతిపాదించగా, ఈఆర్సీ ఆమోదించింది. 
► 2019 ఏప్రిల్‌ 1– 2020 ఫిబ్రవరి 29 మధ్య కాలంలో జారీ చేసిన గృహ (ఎల్టీ–1), వీధి దీపాలు (ఎల్టీ–6ఏ), నీటి సరఫరా పథకాల (ఎల్టీ–6బీ) విద్యుత్‌ కనెక్షన్ల వినియోగదారులకు 2020 మార్చిలో జారీ చేసిన బిల్లుకు సమాన బిల్లును ప్రస్తుత నెలలో జారీ చేయనున్నారు. 
► మార్చి 2020లో జారీ చేసిన కొత్త గృహ (ఎల్టీ–1), వీధి దీపాలు (ఎల్టీ–6ఏ), నీటి సరఫరా పథకాల (ఎల్టీ–6బీ) విద్యుత్‌ కనెక్షన్ల వినియోగదారులకు కనీస డిమాండ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌ 2020లో బిల్లులు జారీ చేయనున్నారు. 
► మార్చి 2019 నాటికి ఉనికిలో ఉన్న ఇతర అన్ని రకాల ఎల్టీ కేటగిరీల (ఎల్టీ–5 వ్యవసాయ కేటగిరీ మినహాయించి) కనెక్షన్లకు సంబంధించిన వినియోగదారులకు ఏప్రిల్‌ 2019లో జారీ చేసిన బిల్లుకు 50 శాతం సమాన బిల్లును 2020 ఏప్రిల్‌లో జారీ చేయనున్నారు. 
► 2019 ఏప్రిల్‌ 1– 2020 ఫిబ్రవరి 29 మధ్యకాలంలో జారీ చేసిన ఇతర అన్ని రకాల ఎల్టీ కేటగిరీల (ఎల్టీ–5 వ్యవసాయ కేటగిరీ మినహాయించి) కనెక్షన్లకు సంబంధించిన వినియోగదారులకు 2020 మార్చిలో జారీ చేసిన బిల్లుకు 50 శాతం సమాన బిల్లును ఏప్రిల్‌ 2020లో జారీ చేస్తారు. ఇతర ఎల్టీ కేటగిరీలో కమర్షియల్‌ (ఎల్టీ–2ఏ/2బీ), అడ్వర్టయిజ్‌ మెంట్‌ హోర్డింగ్స్‌ (ఎల్టీ–2సీ), హెయిర్‌కట్టింగ్‌ సెలూన్స్‌ (ఎల్టీ–3డీ), పరిశ్రమలు (ఎల్టీ–3), కుటీర పరిశ్రమలు (ఎల్టీ–4ఏ), వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు (ఎల్టీ–4బీ) కేటగిరీల వినియోగదారులు వస్తారు. 
► మార్చి 2020లో జారీ చేసిన ఇతర అన్ని రకాల ఎల్టీ కేటగిరీల (ఎల్టీ–5 వ్యవసాయ కేటగిరీ మినహాయించి) కనెక్షన్లకు సంబంధించిన వినియోగదారులకు కనీస డిమాండ్‌ లెక్కల ప్రాతిపదికన 2020 ఏప్రిల్‌లో బిల్లులు జారీ చేస్తారు. 
► ఎస్‌ఎంఎస్‌లు/మొబైల్‌ యాప్స్‌/వెబ్‌సైట్ల ద్వారా వినియోగదారులకు వారి బిల్లుల వివరాలు తెలియజేయనున్నారు.

మరిన్ని వార్తలు