‘ఎత్తిపోతల’కు ఊరట కొంతే!

29 Mar, 2018 02:23 IST|Sakshi

     సాగునీటి ప్రాజెక్టులకు విద్యుత్‌ చార్జీలను కోరిన మేర తగ్గించని ఈఆర్సీ 

     రూ.6.40 నుంచి రూ.4.88కు తగ్గించాలని కోరిన డిస్కంలు 

     రూ.5.80కు మాత్రమే తగ్గించి తుది ధర ఖరారు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సాగునీటి ఎత్తిపోతల పథకాలకు సరఫరా చేస్తున్న విద్యుత్‌ ధరలపై స్వల్ప ఊరటే లభించింది. యూనిట్‌ ధరను రూ.6.40 నుంచి రూ.4.88కి తగ్గించాలని విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రతిపాదించగా... విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) 60 పైసలు మాత్రమే తగ్గించి, యూనిట్‌ ధరను రూ.5.80గా నిర్ణయించింది. దాంతో ఎత్తిపోతల పథకాల విద్యుత్‌ ఖర్చులో కేవలం రూ.146.77 కోట్లకు మాత్రమే ఉపశమనం లభించనుంది. 

జూన్‌ నుంచి భారీగా వినియోగం 
రాష్ట్రంలో ప్రస్తుతం అలీసాగర్, గుత్ప, ఎల్లంపల్లి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వ కుర్తి వంటి మొత్తం 14 ఎత్తిపోతల పథకాలు పనిచేస్తున్నాయి. వాటికి ప్రస్తుతం ఏటా 1,359 మెగావాట్ల మేర విద్యుత్‌ వినియోగిస్తున్నారు. యూనిట్‌కు రూ.6.40 చొప్పున లెక్కిస్తే.. ఏటా వీటికి రూ.1,565.57 కోట్ల మేర ఖర్చవుతోంది. తాజాగా ధర రూ.5.80కు తగ్గించడంతో ఖర్చు 1,418.80 కోట్లకు తగ్గనుంది. అంటే రూ.146.77 కోట్ల మేర మాత్రమే భారం తగ్గుతోంది. అదే డిస్కంలు కోరిన మేర రూ.4.88కి తగ్గిస్తే.. భారం ఏకంగా రూ.371.82 కోట్లు తగ్గేదని అంచనా. ఇక ఈ ఏడాది జూన్‌–జూలై నాటికి మరిన్ని ఎత్తిపోతల పథకాలు వినియోగంలోకి వస్తుండడంతో.. విద్యుత్‌ అవసరం 3,331 మెగావాట్లకు పెరుగుతుందని నీటి పారుదల శాఖ అంచనా వేసింది. యూనిట్‌ ధర రూ.4.88కి తగ్గించి ఉంటే.. భారం ఏకంగా రూ.911.36 కోట్ల మేర తగ్గేదని అంచనా. 

>
మరిన్ని వార్తలు