‘మిషన్‌ భగీరథ ప్రాజెక్టు కోసం అప్పు చేయాల్సి వచ్చింది’

11 Jun, 2019 16:13 IST|Sakshi

‘గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా- స్వచ్ఛ భారత్‌’   సదస్సుకు హాజరైన మంత్రి ఎర్రబెల్లి

సాక్షి, న్యూఢిల్లీ : మిషన్‌ భగీరథ ద్వారా వేసవికాలంలో కూడా తాగునీటి కొరత లేకుండా చేయగలిగామని తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి శాఖ.. మంగళవారం ‘గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా- స్వచ్ఛ భారత్‌’   సదస్సును నిర్వహించింది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు రాష్ట్రం తరఫున ఎర్రబెల్లి దయాకర్‌ రావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఇంటికి నీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై కేంద్రం ఇలాంటి సదస్సు నిర్వహించడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాల అధికారులు ప్రశంసించిన విషయాన్ని కేంద్రమంత్రికి చెప్పామని పేర్కొన్నారు. ఇంటింటికీ తాగునీరు అందించేందుకు చేపట్టిన ఇంత పెద్ద ప్రాజెక్టుకు భారీగా ఖర్చుపెట్టిన కారణంగా అప్పు చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఖర్చులో సగం ఖర్చును కేంద్రం భరించాలి లేదా పథకం నిర్వహణ ఖర్చునైనా భరించాలని కేంద్రానికి విన్నవించామని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు