ఆ మూడు ఇళ్లకు జరిమానా వేయండి: మంత్రి

4 Oct, 2019 11:36 IST|Sakshi
చిట్యాలలో ఓ ఇంటి పక్కనే ఉన్న పెంటకుప్పను తొలగించాలని సర్పంచ్‌ను ఆదేశిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

చిట్యాలలో పూర్‌ ప్రోగ్రెస్‌: ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి దయాకర్‌రావు

డీఆర్‌డీఓ, డీపీఓ, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌కు నోటీసులు

చిట్యాల, పెద్దగూడెం గ్రామాల్లో వీధులు,ఇళ్లు పరిశీలన  స్వచ్ఛత పాటించని 3 ఇళ్లకు  జరిమానా వేయాలని ఆదేశించిన మంత్రి

అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై అసంతృప్తి

సాక్షి, వనపర్తి: 30రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి జిల్లాలో రెండు గ్రామాల్లో  పర్యటించారు. హెలిక్యాప్టర్‌లో జిల్లాకు చేరుకున్న మంత్రి దయాకర్‌రావు చిట్యాల గ్రామంలో మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి భోజనం చేశారు. అనంతరం చిట్యాల గ్రామంలో పర్యటించారు. లోపించిన పారిశుద్ధ్యంను చూసి అసహనం వ్యక్తంచేశారు. ఓ ఇంటి ముందు పెంటకుప్పను ఏర్పాటు చేయటం, ఓ కిరాణంషాపు ఎదురుగా స్థలంలో చెత్తాచెదారం నిండి ఉండటం చూసిన మంత్రి అధికారులపై మండిపడ్డారు. మంత్రి గ్రామానికి వస్తున్నాడని తెలిసినా ఇంత నిర్లక్ష్యం ఏమిటని ప్రశ్నించారు.  

అధికారులకు నోటీసులు..  
ఓ గృహిణితో మంత్రి మాట్లాడుతూ ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి నిర్మించుకున్నారా..? వాడుతున్నారా అని ప్రశ్నించగా.. ఆమె మరుగుదొడ్డిలేదని, బహిర్భూమికి వెళ్తామని చెప్పారు. ఒక్కసారిగా మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓడీఎఫ్‌ జిల్లా అంటే ఇదేనా అని డీపీఓను ప్రశ్నించారు. మరో ఇంటికి వెళ్లిన మంత్రి ఇంకుడుగుంతలను పరిశీలించారు. లేకపోవటంతో చిట్యాల గ్రామంలో ఇంటింటికీ ఇంకుడుగుంతలు ఉన్నాయా అని ప్రశ్నించారు. డీఆర్‌డీఓను వెంటనే నిర్మాణం చేయిస్తామని సమాధానం ఇచ్చారు. 30 రోజుల ప్రణాళికా కార్యక్రమంలోనే పని చేయకుంటే ఎప్పుడు పని చేస్తారంటూ డీఆర్‌డీఓ గణేష్, డీపీఓ రాజేశ్వరిని, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ను ప్రశ్నించారు. వెంటనే వీరికి నోటీసులు జారీ చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌కు సూచించారు.  

గ్రామంలో మిషన్‌ భగీరథ తాగునీరు రావటం లేదని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకురావటంతో తాగునీరు ఎందుకు రావటంలేదని  మిషన్‌ భగీరథ ఎస్‌ఈ జగన్మోహన్‌ను మంత్రి ప్రశ్నించారు. గంట నుంచి గ్రామంలో ఓ మంత్రి పర్యటిస్తుంటే రావాలని తెలియదా అంటూ ఎస్‌ఈని మందలించారు. ఇంటి ఆవరణ శుభ్రంగా ఉంచుకోని వారికి, పెంటకుప్ప ఏర్పాటు చేసిన వారికి జరిమానా వేయాలని అధికారులకు సూచించారు. చిట్యాల గ్రామాన్ని అధికారులు పట్టించుకోవటం లేదా  సర్పంచు ఏం చేస్తున్నారు. ఎందుకింత పూర్‌ ప్రోగ్రేస్‌ అంటూ మండిపడ్డారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పారిశుద్ధ్య కమిటీ ఏర్పాటు నామమాత్రంగా చేశారా అని మంత్రి ప్రశ్నించారు.  

కమిటీ సభ్యులలో ఒకరిని వేదికపై పిలిచి ఎందుకు గ్రామంలో నివాసగృహాల ఎదుట అపరిశుభ్రత ఉందని ప్రశ్నించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏం చేద్దామని అడిగారు. జరిమానాలు వేసి కచ్చితంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. గ్రామంలో పారిశుద్ధ్య నివారణ చర్యలు, శ్రమదానం కార్యక్రమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలన్నారు. మహిళా సంఘాల సభ్యులు శ్రమదానం చేస్తే వారికి రూ.50వేల నుంచి రూ.3లక్షల వరకు రుణాలు ఇప్పిస్తామని మంత్రి దయాకర్‌రావు వెల్లడించారు. గ్రామంలో శ్రమదానం చేసిన వారిపేర్లను, ఆర్థిక సాయం చేసిన వారి పేర్లను గ్రామ పంచాయతీ కార్యాలయంలో బోర్డులు ఏర్పాటు చేసి పేర్లు రాయాలని సూచించారు. అనంతరం పెద్దగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. వనపర్తి మార్కెట్‌యార్డు మర్చంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పెద్దగూడెం, కడుకుంట్ల గ్రామాల అభివృద్ధి కోసం రూ.పది లక్షల విరాళం ప్రకటించారు. రూ.5లక్షల చెక్కును మంత్రి దయాకర్‌రావుకు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అబ్రహం, జెడ్పీ చైర్మన్‌లు ఆర్‌.లోక్‌నాథ్‌రెడ్డి, సరిత, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, పీసీసీఎఫ్‌ శోభ, ఏ.కె. సిన్హా, జేసీ డి.వేణుగోపాల్, డీఆర్‌ఓ వెంకటయ్య ఉన్నారు.   

మరిన్ని వార్తలు