సాగునీరిచ్చి రైతులను ఆదుకుంటాం

24 Sep, 2019 07:44 IST|Sakshi
నీటి విడుదల సందర్భంగా పూజలు చేస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు  

గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 

నవాబుపేట రిజర్వాయర్‌ నీటి విడుదల

హాజరైన ఆలేరు, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేలు సునీత, రాజయ్య

సాక్షి, గుండాల(ఆలేరు) : గుండాల మండల రైతులకు సాగునీరు అందించి ఆదుకుంటామని గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం నవాబుపేట రిజర్వాయర్‌ సాగు జలాలను గుండాల మండలానికి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగాల ఘనపురం, గుండాల రైతులకు రిజర్వాయర్‌ ద్వారా సాగునీరు అందించాలన్నారు. రిజర్వాయర్‌లో కెపాసిటీకి అనుగుణంగా నీటిని నిల్వ ఉంచి నీరు విడుదల చేస్తామన్నారు. ఆయకట్టు కింద ఉన్న రైతులు అధైర్య పడొద్దని సూచించారు. రిజర్వాయర్‌ కింద ఉన్న రైతులకు చిత్తశుద్ధితో సాగు నీరు అందించి వారి కష్టాలు తీరుస్తామని పేర్కొన్నారు.

నీటి విడుదలలో హైడ్రామా..!
నీటిని విడుదల కన్న ముందు హైడ్రామా చోటు చేసుకుంది. మంత్రి దయాకర్‌రావు, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ముగ్గురు ఉదయం 8గంటలకు నీటిని విడుదల చేస్తారని సమాచారం ఉంది. అనుకున్న సమయానికి మంత్రి, ఆలేరు ఎమ్మెల్యే వచ్చారు. అయితే స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి వచ్చే నీటి ప్రవాహానికి రిజర్వాయర్‌కు అడ్డంగా ఉన్న కట్ట తెగిపోయింది. దీంతో మంత్రి, ఆలేరు ఎమ్మెల్యే తమతమ నియోజకవర్గాల్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి వెళ్లారు. అనంతరం తిరిగి ఆలేరు ఎమ్మెల్యే నవాబుపేట రిజర్వాయర్‌కు చేరుకొని మధ్యాహ్నం వరకు మంత్రి,  ఎమ్మెల్యే రాజయ్య కోసం వేచిచూశారు.

అప్పటికే ఎమ్మెల్యే రాజయ్య కూడా కాలువను పరిశీలించి వెళ్లారు. అయితే సాయంత్రం మంత్రి హడావుడిగా వచ్చి కాల్వలో పూలు చల్లి మాట్లాడి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆలేరు, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేలు వచ్చి  గంగమ్మకు పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రైతులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుండాల ఎంపీపీ తాండ్ర అమరావతి, జెడ్పీటీసీ కోలుకొండ లక్ష్మి, నాయకులు జి.సోమిరెడ్డి, జి.పాండరి, ఎన్‌.రామకృష్ణారెడ్డి, కె.యాదగిరి, మండల పార్టీ అధ్యక్షుడు ఇమ్మడి దశరథ గుప్తా,  ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు