సీఎంతో మాట్లాడి అవసరమైన నిధులు

3 Oct, 2019 11:30 IST|Sakshi
సభలో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

ప్రతి ఒక్కరూ పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి  

ఇంటింటికీ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి  

సాక్షి, కొత్తగూడెం: పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారిస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి జిల్లా అభివృద్ధికి కావాల్సినన్ని నిధులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బుధవారం చుంచుపల్లి మండలంలోని చుంచుపల్లి తండా గ్రామపంచాయతీలో సర్పంచ్‌ ధనలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వారం రోజుల తర్వాత మరోసారి జిల్లా పర్యటనకు వస్తానని, అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతానని చెప్పారు.

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు యువకుల కంటే ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. జిల్లా కలెక్టర్‌ మాటలు చెప్పడమేనా.. పనులు చేయిస్తున్నారా అని వనమాను అడగగా.. బాగా పని చేయిస్తున్నారని ఆయన బదులిచ్చారు. తర్వాత ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలని, మిగిలిన సమయాల్లో కలసికట్టుగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. 30 రోజుల ప్రణాళికను సీఎం కేసీఆర్‌ చాలెంజ్‌గా చేపట్టారని, ఆయన ఆకాంక్షల మేరకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు. ‘మన ఇల్లు–మన ఊరు’ అనే దృక్పథం అందరిలో రావాలన్నారు.

చుంచుపల్లి తండా పంచాయతీలో చెత్తబుట్టలు విరాళంగా ఇచ్చిన నాయక్‌ పేరు, ఫొటోను చక్కగా ప్రదర్శించాలని చెప్పారు. సర్పంచ్‌ ధనలక్ష్మి తన అత్తగారి జ్ఞాపకార్థం గ్రామంలో ట్రీ గార్డుల ఏర్పాటుకు రూ.5 లక్షలు విరాళం ఇవ్వగా ఆమెను అభినందించారు. ఇలాంటి ఆదర్శ గ్రామాలపై మరింత ప్రత్యేక దృష్టి పెడతానన్నారు. దేశానికి గాంధీ స్వాతంత్య్రం తీసుకొస్తే, తెలంగాణకు కేసీఆర్‌ తెచ్చారని అన్నారు. ప్రతి గ్రామంలో శ్రమదానం చేసేందుకు అన్ని వర్గాలు ముందుకు రావాలని కోరారు. ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్‌ ఇస్తున్నట్లు ప్రకటించారు. చెత్త బయట పడేసినా, చెట్లు నరికినా జరిమానాలు భారీగా ఉంటాయని హెచ్చరించారు. గ్రామాల అభివృద్ధికి నిధుల కొరత లేదని, స్వీపర్ల జీతాలు సైతం పెంచామని చెప్పారు. ప్రతి ఇంట్లో ఇంకుడుగుంత ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. డ్వాక్రా గ్రూపులకు వడ్డీ లేకుండా రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు రుణాలు ఇస్తామని, ఈ పథకాన్ని భద్రాద్రి జిల్లా నుంచే ప్రారంభిస్తామని చెప్పారు.

సమస్యలపై అవగాహన ఉంది... 
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ తాను ఖమ్మం నుంచి గెలిచినప్పటికీ పుట్టింది మాత్రం భద్రాచలంలోనేనని, ఏజెన్సీ ప్రాంత సమస్యలన్నింటిపై పూర్తి అవగాహన ఉందని అన్నారు. బాల్యమంతా  భద్రాద్రి ఏజెన్సీలోనే గడిచిందని, ఈ జిల్లా అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పాటుపడతానని హామీ ఇచ్చారు. గిరిజన, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. 30 రోజుల ప్రణాళిక సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక అన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం ప్రజలందరూ కలసికట్టుగా ముందుకు వెళ్లాలన్నారు. సర్పంచ్‌గా ప్రస్థానం ప్రారంభించిన తాను రాష్ట్రంలో మొదటి మహిళా మంత్రిగా ప్రజల ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి గురించి ఇంత భృహత్తరంగా ఆలోచించిన ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్‌ ఒక్కరేనన్నారు.

భద్రాద్రి జిల్లాలో 30 రోజుల ప్రణాళిక అమలు బాగుందన్నారు. చుంచుపల్లి తండాలో ఈ కార్యక్రమం అమలు తీరు బాగుందని, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ గ్రామపంచాయతీకి రూ.5 లక్షలు తన ఎంపీలాడ్స్‌ నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్‌ అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ, జెడ్పీచైర్మన్‌ కోరం కనకయ్య, వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు, జిల్లా గ్రంధాలయ చైర్మన్‌ దిండిగాల రాజేందర్, కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ, జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఓ జగత్‌కుమార్‌రెడ్డి, ఎంపీపీ బాణోత్‌ శాంతి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా