‘కేటీఆర్‌కు సీఎం అయ్యే అన్ని అర్హతలున్నాయి’

2 Jan, 2020 13:36 IST|Sakshi

సాక్షి, వరంగల్ రూరల్: టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌కు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలున్నాయని.. ఆయన అన్నివిధాల సమర్థుడని పంచాయతీరాజ్ శాఖ మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు  అన్నారు. కేటీఆర్‌ నాయకత్వంలో జరిగిన అన్ని ఎన్నికల్లో విజయం సాధించామని.. ఆయన సీఎం ఎప్పుడవుతారో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిస్తారని దయాకర్‌ రావు తెలిపారు. జిల్లాలోని వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమన్ని మంత్రి ఎర్రబెల్లి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన నెహ్రూ కుటుంబం ప్రభుత్వాన్ని నడపలేదా, రాష్ట్రానికి స్వాతంత్ర్యం తెచ్చిన కేసీఆర్ కుటుంబం ఎందుకు పాలించవద్దని ప్రశ్నించారు. కేటీఆర్‌.. చంద్రబాబు కొడుకు లోకేష్‌, సోనియాగాంధీ కుమారుడు రాహుల్‌ గాంధీలా అసమర్థుడు కాదని వ్యాఖ‍్యలు చేశారు.

గత ప్రభుత్వం అభివృద్ధి చేయడంలో విఫలమైందని ఎర్రబెల్లి విమర్శించారు. గతంలో అసెంబ్లీ చర్చల సందర్భంలో తెలంగాణ వస్తే అంధకారం అవుతుందని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారని ఆయన మండిపడ్డారు. అయితే నేడు రాష్ట్రంలో 24 గంటల కరెంట్‌, తాగునీరు, సాగునీరు అందించిన ఘ​నత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెందుతుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారని కొనియాడారు. గ్రామల్లో ఉన్న యువత ప్రత్యేక చొరవ తీసుకోవాలని.. దాతల సహాయం కూడా తీసుకొని అభివృద్ధి చేసుకోలని ఆయన తెలిపారు. అదేవిధంగా చెడు అలవాట్లు ఉన్నవారిని మహిళ సంఘలు నిలదీయాలని సూచించారు.

చెత్త బయట వేసిన వ్యక్తుల పట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ భాద్యత వహించి చర్యలు తీసుకొని జరిమానా విధించాలన్నారు. ‘పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఎవరూ నన్ను గురించలేదు. కానీ ముఖ్యమంత్రి కేసిఆర్ నన్ను గుర్తించి మంత్రి పదవి కట్టబెట్టారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ. 12లక్షలతో ప్రతి గ్రామంలో స్మశాన వాటిక, డంపింగ్ యార్డు నిర్మాణం చేపట్టిందని పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమం ద్వారా గ్రామాలు పచ్చదనంతో కళకళడుతున్నాయని ఎర్రబెల్లి తెలిపారు. త్వరలోనే జాఫర్‌ఘాడ్ చెరువులోకి దేవదుల ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు వస్తాయని ఆయన చెప్పారు. మహిళ సంఘలకు ప్రత్యేకంగా రూ. 5కోట్ల రుణాలు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లితోపాటు స్థానిక ఎమ్మెల్యే ఆరురి రమేష్, జడ్పీ చైర్ పర్సన్‌ గండ్ర జ్యోతి, ఎస్ఆర్ విద్యాసంస్థల అధినేత వరదరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు