‘ఎస్కులేషన్’ ఎప్పటినుంచి?

22 Nov, 2014 03:38 IST|Sakshi
‘ఎస్కులేషన్’ ఎప్పటినుంచి?

 సాక్షి ప్రతినిధి, నల్లగొండ: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టు నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించే అంశంలో చిన్న మెలిక పడింది. పనుల ప్రారంభానికి గాను ఎస్కులేషన్ చార్జీలు (పెరిగిన ముడిసరుకుల ధరల మేరకు ఒప్పందంలో ఉన్న దాని కన్నా అదనంగా చెల్లించే మొత్తం) ఎప్పటి నుంచి చెల్లించాలన్న అంశంపై ఏమీ తేలకపోవడంతో మరోమారు ఇంజనీరింగ్ నిపుణులతో కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులు చర్చలు జరపనున్నారు. ఈ మేరకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, జిల్లా ప్రజాప్రతినిధులు, అఖిలపక్షం నేతలతో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్టు కంపెనీ అడిగిన విధంగా 2012 నుంచి ఎస్కులేషన్ చార్జీలు ఇవ్వాలా? లేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన జూన్ 2 నుంచి చార్జీలు లెక్కించాలా అన్నది ఈ సమావేశం అనంతరం తేలనుంది.
 
రెండు గంటలపాటు చర్చ
ముఖ్యమంత్రి సమక్షంలో గురువారం జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు నీటిపారుదల మంత్రి హరీష్‌రావు కాంట్రాక్టు కంపెనీ అయిన జేపీ అసోసియేట్స్ ప్రతినిధులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డితో పాటు ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్ (సీపీఐ), సున్నం రాజయ్య (సీపీఎం), ప్రభాకర్ (బీజేపీ), తాటి వెంకటేశ్వర్లు (వైఎస్సార్‌సీపీ) హాజరయ్యారు.

ఇందులో ప్రధానంగా కాంట్రాక్టు కంపెనీకి ఎస్కులేషన్ చార్జీలు ఎప్పటి నుంచి చెల్లించాలన్న దానిపై రెండు గంటల పాటు చర్చ జరిగింది. కాంట్రాక్టర్ కోరిన విధంగా 2010 నుంచి చెల్లించాల్సి వస్తే రూ.723 కోట్ల అదనపు భారం పడుతుందని, అదే 2012 నుంచి అయితే రూ.600 కోట్లు, లేదా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన నాటి నుంచి ఇస్తే దాదాపు రూ.500 కోట్లు ఎస్కులేషన్ చార్జీలు ఇవ్వాల్సి ఉం టుందని అధికారులు వివరించారు. దీనిపై జిల్లా ప్రజాప్రతినిధు లు, ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయిన నాటి నుంచి ఎస్కులేషన్ చార్జీలు తీసుకోవాలని సూచించారు.

దీనికి కంపెనీ తరఫున హాజరయిన జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ పంకజ్‌గౌర్, మరో ప్రతినిధి కామత్‌లు స్పందిస్తూ తాము 2010 నుంచే ఎస్కులేషన్ చార్జీలు చెల్లించాలని 2012లో దరఖాస్తు పెట్టుకున్నామని, కనీసం 2012 నుంచయినా ఇవ్వాలని కోరారు. ఇందుకు ప్ర జాప్రతినిధులు అంగీకరించకపోవడంతో నీటిపారుదల ఈఎన్‌సీ, ప్రాజెక్టు సీఈలతో సమావేశం అయి దీనిపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశం త్వరలోనే జరగనుంది.

మరిన్ని వార్తలు