రివాల్వర్‌ చూపి.. కత్తులతో దాడి చేసి..

13 Dec, 2016 03:07 IST|Sakshi
రివాల్వర్‌ చూపి.. కత్తులతో దాడి చేసి..

పెట్రోల్‌ బంకులో దొంగల బీభత్సం
- బంకు సిబ్బందిపై కత్తులతో దాడికి పాల్పడిన దుండగులు
- రివాల్వర్‌తో బెదిరించి రూ. 22 లక్షలతో పరారీ
- ఆధారాలు దొరక్కుండా సీసీ కెమెరాల ధ్వంసం

మేడ్చల్‌/మేడ్చల్‌రూరల్‌: ఓ పెట్రోల్‌ బంకుపై అర్ధరాత్రి సమయంలో ఆరుగురు దుండగులు దాడి చేసి బీభత్సం సృష్టించారు. బంకు సిబ్బందిని రివాల్వర్‌తో బెదిరించి.. వారిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి రూ. 22 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి మేడ్చల్‌ మండలంలో చోటు చేసుకుంది. మేడ్చల్‌ పోలీసులు, స్థాని కుల కథనం ప్రకారం.. మేడ్చల్‌ మండలం లోని అత్వెల్లి, ఎల్లంపేట్‌ గ్రామాల మధ్యలో 44వ జాతీయ రహదారి పక్కన భారత్‌ పెట్రోలియం కంపెనీ ఔట్‌లెట్‌ ఉంది. పెట్రోల్‌ బంక్‌లో ఆదివారం రాత్రి నైట్‌ డ్యూటీలో అసిస్టెంట్‌ మేనేజర్‌ సంజీవరెడ్డి, క్యాషియర్‌ శ్రవణ్‌కుమార్, సెక్యూరిటీగార్డ్‌ ధన్‌రాజ్, సిబ్బంది రవికుమార్, బాలసాయి, లింగారెడ్డి ఉన్నారు. అర్ధరాత్రి దాటాక ముగ్గురు సిబ్బంది మేనేజర్‌ గదిలో నిద్రించారు.

అదే గదిలో సంజీవరెడ్డి, ధన్‌రాజ్‌ కూర్చొని ఉండగా క్యాషి యర్‌ శ్రవణ్‌ బయట ఉన్నాడు. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఆరుగురు దుండగులు కారులో పెట్రోల్‌ బంక్‌కు చేరుకున్నారు. క్యాషి యర్‌ను ఇద్దరు దుండగులు బెదిరించగా.. మరో నలుగురు మేనేజర్‌ గదిలోకి ప్రవేశించి సిబ్బందిని రివాల్వర్‌తో బెదిరించి బంధిం చారు. డబ్బులు ఎక్కడున్నాయో చెప్పాలని కత్తులతో బెదిరించగా.. సిబ్బంది డబ్బులు లేవని చెప్పడంతో ఆగ్రహించిన దుండగులు సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం కార్యాలయంలోని లాకర్లను పగులగొట్టి రూ.22 లక్షల నగదును దోచు కున్నారు. పెట్రోల్‌ బంక్‌ కంపెనీ ఔట్‌లెట్‌కు చెందినది కావడం.. 3 రోజులు బ్యాంకులకు సెలవు కావడంతో.. 3 రోజులుగా బంక్‌లో అమ్మకం ద్వారా వచ్చిన నగదును లాకర్లలో ఉంచారు. ఈ మొత్తాన్ని దొంగలు దోచుకెళ్లారు. పోలీసులు అర్ధరాత్రి 2 గంటల సమయం లో రేకులబావి, పెట్రోల్‌బంక్, ఎల్లంపేట్‌ వద్దే పికెటింగ్‌ నిర్వహించారు. వారు వెళ్ళిన కొద్దిసేపటికే దోపిడీకి పాల్పడటం గమనార్హం.

సీసీ కెమెరాల ధ్వంసం..
పక్కా పథకం ప్రకారం వచ్చిన దుండ గులు బంక్‌లో ప్రవేశించి సిబ్బందిపై దాడి చేసి నగదును దోచుకున్నారు. ఎలాంటి ఆధారాలు దొరక్కూడదని కార్యాలయంలో ని సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. గదిలో ఉన్న సీసీ కెమెరాల సిస్టమ్‌లను పగులగొట్ట డమే కాక.. సీసీ కెమెరా దృశ్యాలు నిక్షిప్తమైన డీవీఆర్‌ను తమ వెంట తీసుకెళ్లారు. దుండ గులు కత్తులతో దాడి చేయడంతో ఆరుగురు సిబ్బందికి గాయాలయ్యాయి. అసిస్టెంట్‌ మేనేజర్‌ సంజీవరెడ్డి, రవికుమార్‌ స్వల్ప గాయాలతో బయటపడగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని నగర శివారు బాలాజీ ఆస్పత్రికి తరలించారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ శాండిల్యా, బాలానగర్‌ డీసీపీ సాయి శేఖర్, ్రౖకైం డీసీపీ ఉషారాణి ఘటనాస్థలిని పరిశీలించారు. పోలీసు జాగిలాలు, క్లూస్‌ టీంను రప్పించి సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.

మరిన్ని వార్తలు