పాఠ్యాంశంగా ఈశ్వరీబాయి చరిత్ర

25 Feb, 2019 04:34 IST|Sakshi
ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన ఈశ్వరీబాయి వర్ధంతి సభలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌. చిత్రంలో గీతారెడ్డి, రమణాచారి తదితరులు

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ గడ్డపై జన్మించిన ధీరవనిత ఈశ్వరీబాయి జీవితచరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి, మరింతగా సమాజానికి చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం ఇక్కడ భాషా సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్‌ ట్రస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఆమె వర్ధంతిసభను ఘనంగా నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ 94 ఏళ్ల తర్వాత కూడా ఈశ్వరీబాయి గురించి మనం మాట్లాడుకొంటున్నామంటే ఆమె ఆ రోజుల్లో సమాజం కోసం ఎంతగా పనిచేసి ఉంటారో ఇట్టే అర్థం చేసు కోవచ్చని అన్నారు. పేద కుటుంబం, దళితవర్గంలో జన్మించిన మహిళ అయి కూడా సమాజం బాగుకు ధైర్యంగా ముందుకు సాగడం గొప్ప విషయమని కొనియాడారు. అధికార పార్టీకి చెందిన మంత్రిని ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టిన ధీరవనిత అని అన్నారు. మంత్రి పదవి ఇస్తామన్నా తృణప్రాయంగా తిరస్కరించిందని తెలిపారు. అంబేద్కర్‌ భావజాలం పుణికిపుచ్చుకుందని, కుల, మత విశ్వాసాలు బలంగా ఉన్న ఆ రోజుల్లోనే మనుషులంతా ఒక్కటే అని చాటి చెప్పిందన్నారు. 1969 జరిగిన తెలంగాణ ఉద్యమంలోనూ ఈశ్వరీబాయి కీలకపాత్ర పోషించిందని తెలిపారు. 90 ఏళ్ల క్రితమే ఎదిగి, ఎన్నికల్లో కొట్లాడి, ఎన్నో సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొని సాంఘిక సంస్కరణలకు కారణభూతురాలు అయిందని తెలిపారు.  

ఉమ్మడి పాలకులు తొక్కిపెట్టారు
తెలంగాణగడ్డపై పుట్టిన ఎంతోమంది మహనీయులచరిత్రను ఉమ్మడి పాలకులు తొక్కిపెట్టారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. కేసీఆర్‌ తెలంగాణ సాధించి సీఎం పదవి చేపట్టిన తర్వాత అధికారికంగానే ఈశ్వరీబాయి జయంతి, వర్ధంతిని జరుపుకొం టున్నామన్నారు. ఇప్పుడు తపాలా శాఖ కూడా  ఈశ్వరీబాయి పేరుతో ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ తీసుకురావటం అభినందనీయమన్నారు. ఈశ్వరీబాయి చరిత్రను అందరూ చదువుకుని ఆమె స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. ఆమె ఆదర్శప్రాయమైన జీవితం అందరికీ ఆదర్శవంతం కావాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టిన వీరనారి ఈశ్వరీబాయి అని కొనియాడారు. ఆమె తెలంగాణ పోరాటయోధురాలు, ధీర వనితన్నారు. వంద ఏళ్ల తర్వాత కూడా జనం హృదయాల్లో నిలిచిన వనిత అని చెప్పా రు. మాజీమంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ 28 ఏళ్ల క్రితం భౌతికంగా వదిలి వెళ్లినా ఇప్పటికీ అందరి హృదయాల్లో ఈశ్వరీ బాయి ఉండి పోయారన్నారు. బాగా చదువుకొని డాక్టర్‌ కావాలని, రాజకీయాల్లోకి మాత్రం రావద్దని చెప్పేవారన్నారు. పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ స్వశక్తితో పైకి వచ్చిన ఓ గొప్ప మహిళ ఈశ్వరీబాయి అని అన్నారు. అనంతరం ఈశ్వరీబాయిపై రూపొందిన లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, డాక్టర్‌ నందన్, డాక్టర్‌ రామచంద్రారెడ్డిలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు