జిల్లాకో ఈఎస్‌ఐ ఆస్పత్రి

22 Aug, 2019 03:08 IST|Sakshi
బుధవారం సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ఓపీడీ భవనానికి శంకుస్థాపన చేస్తున్న కేంద్ర మం్రత్రులు సంతోష్‌ కుమార్‌ గంగ్వార్, కిషన్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి. చిత్రంలో బీజేపీ నేత బండారు దత్తాత్రేయ

సనత్‌నగర్‌ ఈఎస్‌ఐలో ఓపీడీ భవన నిర్మాణం 

పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ పేర్కొన్నారు. ఇప్పటికే 400 జిల్లాల్లో ఈఎస్‌ఐ ఆస్పత్రులను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. వచ్చే నాలుగేళ్లలో అన్ని జిల్లాల్లో ఈఎస్‌ఐ ఆస్పత్రులను తెరిచి కార్మిక కుటుంబాలకు అత్యాధునిక వైద్య సేవలందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో నూతనంగా నిర్మించతలపెట్టిన ఓపీడీ భవనానికి బుధవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఈఎస్‌ఐ ఆస్పత్రిని జాతికి అంకితం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఆదర్శ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కొత్తగా నిర్మించనున్న ఓపీడీ భవనాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.124 కోట్లతో నిర్మిస్తున్న ఈ బ్లాకులో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉంటాయని పేర్కొన్నారు. కారి్మకుల సంఖ్య తక్కువ ఉన్న చోట్ల ఈఎస్‌ఐ లబ్ధిదారులు కాని వారికి కూడా సేవలు అందించనున్నట్లు వివరించారు. దేశంలోని 40 కోట్ల మంది అసంఘటిత రంగ కారి్మకులకు నెలవారీగా రూ.3,000 పింఛను అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.  

సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా ప్రకటించాలి
సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రిని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా ప్రకటించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. వైద్య సేవల రంగంలో కేంద్ర ప్రభుత్వం పలు విప్లవాత్మక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.  రాష్ట్రంలో ఈఎస్‌ఐకి సంబంధించిన పెండింగ్‌ అంశాలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈఎస్‌ఐ ఆసుపత్రుల పనితీరు రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల కంటే మెరుగ్గా ఉందని కితాబిచ్చారు.  రాష్ట్రంలో 18 లక్షల మంది కార్మికులు ఈఎస్‌ఐ పరిధిలో ఉన్నారని రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి తెలిపారు. 

మరిన్ని వార్తలు