గ్యాంగ్‌ లీడర్‌ నాగలక్ష్మి.. రూ.50 కోట్లు స్వాహా!

7 Oct, 2019 04:40 IST|Sakshi

ఇండెంట్లను ఇంకుతో మార్చేసి మింగేసేది

మెడికల్‌ క్యాంపుల మందుల్లో గోల్‌మాల్‌

నాచారం డిస్పెన్సరీ ఫార్మాసిస్ట్‌ నాగలక్ష్మి అరెస్టు

సుధాకర్‌రెడ్డితో కలిసి రూ.9 కోట్ల మందుల్లో గోల్‌మాల్‌

దేవికారాణి అవినీతిలో ఆమెదే కీలక పాత్ర

సాక్షి,హైదరాబాద్‌: ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌)లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. ఈ కేసులో నాచారం ఫార్మాసిస్ట్‌ నాగలక్ష్మిని అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు ఆదివారం తెలిపారు. నాచారం డిస్పెన్సరీలో గ్రేడ్‌–2 ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్న కొడాలి నాగలక్ష్మి ఐఎంఎస్‌ మాజీ డైరెక్టర్‌ దేవికారాణికి కీలకమైన వ్యక్తి. ఇండెంట్లను ట్యాంపరింగ్‌ చేయడంలో ఈమె దిట్ట. దేవికారాణి, జాయింట్‌ డైరెక్టర్‌ కలకుంట పద్మ సూచన మేరకు లైఫ్‌కేర్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మా ఎండీ సుధాకర్‌రెడ్డితో కుమ్మక్కై మందుల కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడినట్లు ఏసీబీ ఆధారాలు సంపాదించింది. వీరి కారణంగా ఐఎంఎస్‌కు రూ.9.28 కోట్ల నష్టం వాటిల్లిందని తేల్చింది. ఈ వ్యవహారంలో 23 మందిపై ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయగా.. అరెస్టయిన వారి సంఖ్య 10కి చేరింది. రాష్ట్రంలోని పలు డిస్పెన్సరీల ఫార్మాసిస్టులకు గ్యాంగ్‌లీడర్‌ నాగలక్ష్మి అనే ఆరోపణలున్నాయి. 

దేవికారాణికి సన్నిహితురాలు.. 
నాగలక్ష్మిని నాచారం నుంచి సనత్‌నగర్‌లో సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌కు హెడ్‌గా దేవికారాణి నియమించింది. సీనియర్లు ఉన్నా నాగలక్ష్మీని ఏరికోరి తీసుకువచ్చి పెట్టారు. డ్రగ్‌స్టోర్‌లో ఆమె ఎంత చెబితే అంత. అక్కడ సీసీ కెమెరాలను నాగలక్ష్మినే ఏర్పాటు చేయించింది. ఏసీబీ దర్యాప్తు ప్రారంభించగానే సీసీ కెమెరాలను, హార్డ్‌ డిస్కులను హడావిడిగా తీయించేసింది. నాగలక్ష్మికి 5 నకిలీ మందుల కంపెనీలు కూడా ఉన్నాయి. అవన్నీ పేపర్ల మీదే ఉంటాయి. వీటి ద్వారా వచ్చే బిల్లులను దేవికారాణికి పంపుతూ సొమ్ము చేసుకునేవారు. నాగలక్ష్మి అక్రమ మార్గంలో సంపాదించిన డబ్బులతో రూ.50 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో ఐఎంఎస్‌కు చెందిన వివిధ డిస్పెన్సరీల్లో ఫార్మాసిస్టుగా పనిచేసే వడ్డెం రేణుక, వి.లావణ్య, కె.వసంత ఇందిరా, నూన్సావత్‌ గాయత్రీబాయి, కుంచం కరుణ సహకరించారు. 

ఏసీబీ అదుపులో సుదర్శన్‌రెడ్డి..? 
ఈ కుంభకోణంలో ఓ ఫార్మా కంపెనీ యజమాని సుదర్శన్‌రెడ్డిని ఏసీబీ అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో బాలానగర్‌లోని అతని కంపెనీలో దాడులు నిర్వహించారు. 

ఎలా చేస్తుందంటే..?
దేవికారాణి చెప్పినట్లుగా నాగలక్ష్మి చేసేది. మెడికల్‌ క్యాంపుల్లో సరఫరా చేయాల్సిన ఇండెంట్‌ను వారికి అనుకూలంగా మార్చి పంపడంలో ఈమె సిద్ధహస్తురాలు. రాష్ట్రంలోని వివిధ డిస్పెన్సరీల నుంచి గత నాలుగేళ్లుగా వెళ్లిన మందులను పరిశీలించిన ఏసీబీ ఇదే విషయాన్ని గుర్తించింది. పలుచోట్ల మార్చిన అంకెలను, మార్చిన ఇంకుల్లో వ్యత్యాసాలను అధికారులు పట్టుకోగలిగారు. ఇలా పెంచిన బిల్లులను దేవికారాణికి పంపడం.. వాటికి ఆమోదం రావడం.. ఫార్మా కంపెనీకి చెల్లింపులు.. వీరికి కమీషన్‌ రావడం.. చకచకా జరిగిపోయేవి.

మరిన్ని వార్తలు