అది నా వ్యక్తిగత జీవితంలో భాగం..

4 Sep, 2019 02:59 IST|Sakshi

విభజన సమస్యలపై భేద, దండోపాయాలతో పనిలేకుండా చక్కదిద్దా

తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్క బుల్లెట్‌ కూడా కాల్చొద్దని చెప్పా

గవర్నర్‌గా తొమ్మిదిన్నరేళ్లు పనిచేయడంపై నరసింహన్‌

పాలనానుభవాలపై మీడియాతో ఇష్టాగోష్టి

దేవాలయాల సందర్శనపై వచ్చిన విమర్శలు బాధించాయి

ఏపీ, తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలు, మధుర జ్ఞాపకాలతో వెళ్తున్నా

కశ్మీర్‌ గవర్నర్‌గా పనిచేయాలని ఆహ్వానం అందలేదు

పుస్తకాలు రాయను.. రాజకీయాల్లో చేరను.. చెన్నైలో శేషజీవితం గడుపుతా  

‘రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వేర్వేరు ప్రభుత్వాలు ఏర్పడగా ఇరువురు సీఎంల నడుమ పలు సందర్భాల్లో విభేదాలు తలెత్తాయి. సాధ్యమైనంత మేర చర్చల ద్వారా వాటిని సామరస్యంగా పరిష్కరించా. భేద, దండోపాయాలతో సంబంధం లేకుండా సామ, దానాలతోనే సమస్యలు పరిష్కరించా’ అని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ తెలిపారు. అంతరాత్మ ప్రబోధం మేరకు నడుచుకోవడంతోపాటు వ్యక్తిగత ఎజెండా లేకపోవడంతో సరైన మార్గంలో వెళ్లానన్నారు. తాను ఏ గ్రూపునకూ మద్దతివ్వలేదని, రాజ్యాంగ నిబంధనలకు లోబడే పనిచేశానని చెప్పారు. కేసీఆర్, జగన్‌కు అనుకూలంగా పనిచేశాననే ఆరోపణలు సరికాదన్నారు. ఏ పనిలోనైనా విమర్శలు సహజమన్నారు. తొమ్మిదిన్నరేళ్లకుపైగా ఉమ్మడి ఏపీ, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేసిన నరసింహన్‌.. మంగళవారం రాజ్‌భవన్‌ దర్బార్‌ హాల్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గవర్నర్‌గా తనకు ఎదురైన అనుభవాలు, అనుభూతులను తనదైన చమత్కారపూరిత వ్యాఖ్యలతో పంచుకున్నారు. అలాగే తన శేషజీవితాన్ని ఎలా గడుపుతానో వివరించారు. గవర్నర్ల నియామకంలో పారదర్శకత, కేంద్రంలో సలహాదారు పదవి వంటి ప్రశ్నలపై ‘ఔటాఫ్‌ సిలబస్‌’అంటూ సమాధానం దాటవేశారు. నరసింహన్‌ పాలనానుభవాలు ఆయన మాటల్లోనే...         
– సాక్షి, హైదరాబాద్‌

కర్ఫ్యూ వాతావరణంలో బాధ్యతలు... 
ఉమ్మడి ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు కర్ఫ్యూ వాతావరణంలో హైదరాబాద్‌లో అడుగు పెట్టా. శాంతిభద్రతల సమస్యతోపాటు కొందరు ఎమ్మెల్యేల రాజీనామాతో పాలన కూడా అస్తవ్యస్తంగా ఉండేది. రాష్ట్రపతి పాలన విధించేందుకే నన్ను గవర్నర్‌గా పంపారనే వార్తలు వచ్చాయి. కానీ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పడంతోపాటు ఉద్యమంలో ఒక్క బుల్లెట్‌ కూడా కాల్చవద్దని చెప్పా. అలా జరిగితే ఉద్యమం పోలీసులకు వ్యతిరేకంగా మలుపు తిరుగుతుందని హెచ్చరించా. రాష్ట్ర విభజన జరిగితే ఇళ్లు, ఆస్తులు వదిలి వెళ్లాల్సి వస్తుందనే అపోహలు కొందరిలో ఉండేవి. కానీ రాజకీయ పార్టీలు, పోలీసులు, అధికారుల సహకారంతో అన్నింటినీ సమర్థంగా ఎదుర్కొన్నాం. రాష్ట్ర విభజన సమయంలో 3 నెలలపాటు రాష్ట్రపతి పాలనలోనూ కొన్ని సమస్యలు ఎదురైనా అందరి సహకారంతో ఎదుర్కొన్నా. ఎంసెట్‌ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో మొత్తం పరీక్షను రద్దు చేయడంపై అభ్యంతరాలు వచ్చినా లెక్కపెట్టలేదు. 

పుస్తకాలు రాయను.. రాజకీయాల్లో చేరను 
చెన్నైలోని వివిధ రెస్టారెంట్లలో దోసె, సాంబారు జుర్రుకుంటూ గడిపేస్తా. గవర్నర్‌గా పనిచేసిన కాలంలో చోటుచేసుకున్న ఘటనలపై పుస్తకం రాసే ఆలోచన లేదు. నేను రాజకీయాల్లో చేరను. జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌గా పనిచేయడంపై నాకు ఏ ఆహ్వానమూ అందలేదు. సోనియా, మోదీ సహా ఒక్కోక్కరికీ ఒక్కో రకమైన పాలనా శైలి ఉంటుంది. నేను జీవితంలో ఏదీ జరగాలని కోరుకోను. ఛత్తీస్‌గఢ్, ఉమ్మడి ఏపీ, తెలంగాణ, ఏపీ గవర్నర్‌గా సుదీర్ఘకాలం పనిచేస్తానని ఊహించలేదు. వ్యక్తిగతంగా గత తొమ్మిదిన్నరేళ్లలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా. కొన్నిసార్లు నరుడిగా, మరికొన్ని సార్లు సింహంగా, ఇంకొన్నిసార్లు నరసింహన్‌గా రూపాలు ధరించాల్సి వచ్చింది. గవర్నర్‌గా రాక మునుపు సాదాసీదా ఉండేవాడిని. శేషజీవితాన్ని నాకు ఇష్టమున్న రీతిలో గడుపుతా. పోలీసు అధికారిగా అత్యున్నత పదవిలో ఉన్నప్పుడు కుటుంబానికి సమయం ఇచ్చేవాడిని. మీరూ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు మన రాష్ట్రం అనే భావనతో ఉండాలి. తెలంగాణ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది.  

సర్వాధికారిని కాదు... 
తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చే సందర్భంలో డిసెంబర్‌ 31వ తేదీ తర్వాత ఏం జరుగుతుందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా జనవరి 1వ తేదీ వస్తుందని బదులిచ్చా. దీంతో గవర్నర్‌ నరసింహన్‌ తెలంగాణ వ్యతిరేకి అంటూ విమర్శించారు. ఏదో సినిమాలో కూడా ఈ డైలాగ్‌ను పెట్టినట్లు గుర్తు. ‘సర్వాధికారి’ అంటూ ఓసారి నా శరీరానికి మహేశ్‌బాబు తలను కలిపి ఫొటో వేస్తే పరువునష్టం దావా వేస్తానని చెప్పా. నేను యూనిఫారం వేసుకున్నా. నేను అధికారినే తప్ప సర్వాధికారిని కాదు. 

అన్ని గుళ్లకూ వెళ్లలేదు... 
దేవుడి దయ, పెద్దల ఆశీస్సులు, ప్రజల ఆదరణతోనే గవర్నర్‌గా ఆటంకాలను అధిగమించా. ఏపీ, తెలంగాణ ప్రజల ఆదరాభిమా నాలు, మధుర జ్ఞాపకాలతో వెళ్తున్నా. ప్రతి అంశంపైనా నిర్మాణాత్మక విమర్శ అవసరమే. నేను గుళ్లకు వెళ్లడంపై మీడియాలో వచ్చే విమర్శలు సహా అన్ని రకాల వార్తలు చదువుతా. నేను గుడికి పోయి పాపాలు చేసి ఉండొచ్చు. నేను అన్ని గుడులకూ వెళ్లలేదు. కేవలం ఖైరతాబాద్‌ హనుమాన్, భద్రాచలం, యాదగిరిగుట్ట, తిరుమల దేవాలయాలనే సందర్శించా. దేవాలయాల సందర్శనపై వచ్చిన విమర్శలు కొన్నిసార్లు బాధించాయి. కొందరు పేకాట ఆడతారు. కొందరు మద్యం సేవిస్తారు. గుడులకు వెళ్లడం నా వ్యక్తిగత జీవితంలో భాగం. 

ఎమ్మెల్యేలు దాడి చేస్తారని ఊహించా.. 
ఉద్యమ సమయంలో ఏపీ ఉభయసభలను ఉద్దేశించి ప్రసం గించే సమయంలో శాసనసభ్యులు దాడి చేస్తారని ముందే ఊహించా. మైక్‌ లాక్కున్నా ప్రసంగం కొనసాగించేందుకు కార్డ్‌లెస్‌ మైక్‌ ధరించా. రక్తం కారినా ప్రసంగం ఆపొద్దని నిర్ణయించుకున్నా. ప్రసంగప్రతులు చింపేస్తారని కొన్ని అదనపు ప్రతులు వెంట తీసుకెళ్లా. సభ్యులు దూకడం, ఎగరడం వంటి వాటిని గమనిస్తూనే ప్రసంగాన్ని పూర్తి చేశా. అప్పుడు నవ్వడం మినహా ఏం చేయగలను? అదేరోజు సాయంత్రం నాగం జనార్దన్‌రెడ్డి ఓ వివాహ విందులో కలసి మీ ఆశీర్వాదాలు కావాలని అడిగారు. హోలీ సందర్భంగా ఓ నేత రాజ్‌భవన్‌లో రంగులు పూసి బయటకు వెళ్లాక గవర్నర్‌ గో బ్యాక్‌ అని నినాదాలు చేస్తానని ముందే చెప్పారు. రాజకీయ, వ్యక్తిగత, అధికారిక సంబంధాలను వేర్వేరుగా చూడటం వల్లే ఇన్నేళ్లపాటు పనిచేయగలిగా. నాతో పనిచేసిన సీఎంలంతా మంచివారే. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు