తెలంగాణ తొలి గవర్నర్‌గా నరసింహన్‌ విశిష్ట సేవలు

1 Sep, 2019 13:31 IST|Sakshi

గవర్నర్‌ ఈఎస్ఎల్‌  నరసింహన్‌ గడిచిన తొమ్మిదిన్నర ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోని అనేక రాజకీయ పరిణామాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. ఉమ్మడి ఆం‍ధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో.. అదేవిధంగా  రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు కూడా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మధ్య  స్నేహపూరిత వాతావరణం నెలకొల్పడంలో వారధిగా ఉన్నారు. విభజన అనంతరం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తొలి గవర్నర్‌గా పని చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన వ్యక్తిగత, వృత్తిగత వివరాలు.. 

నరసింహన్ 1945లో తమిళనాడు రాష్ట్రంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు ఎక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీనరసింహన్. హైదరాబాద్‌లోని లిటిల్‌ఫ్లవర్ హైస్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి ఉన్నత విద్య కోసం సొంత రాష్ట్రానికి వెళ్లారు. అక్కడ మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాల నుంచి పొలిటికల్ సైన్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించారు. మద్రాసు లా కళాశాలలో న్యాయవిద్య పూర్తి చేశారు. 1968లో సివిల్ సర్వీసెస్‌లో ఐపీఎస్‌గా ఎంపికై ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించబడ్డారు. 1972లో ఇంటెలిజెన్స్ బ్యూరోకు తన సేవలు అందించారు. కాగా 2006 డిసెంబర్‌లో రిటైర్ అయ్యేవరకు అందులోనే పని చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. అదే విధంగా రెండుదఫాలుగా విదేశీ వ్యవహారాల శాఖలో పనిచేశారు.1981-84 మధ్య మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో ఫస్ట్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. 1996 నుంచి 1999 వరకు విదేశాల్లోని రాయబార కార్యాలయాల భద్రతా వ్యవహారాలు చూశారు. 

2006 డిసెంబర్‌లో నరసింహన్ రిటైర్ అయిన తర్వాత ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. అక్కడ మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి నరసింహన్ విశేష కృషి చేశారు. 2010 జనవరిలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నరసింహన్ బాధ్యతలు స్వీకరించారు. 2012 మేలో మరో ఐదు ఏళ్ల పదవీకాలాన్ని కేంద్రం ప్రభుత్వం పొడిగించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన 2 జూన్ 2014 నుంచి రెండు తెలుగు రాష్ర్టాలకు గవర్నర్‌గా కొనసాగారు. కొద్ది రోజుల క్రితమే కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నూతన గవర్నర్‌ను నియమించగా.. అప్పటినుంచి నరసింహన్ కేవలం తెలంగాణ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. నేషనల్ డిఫెన్స్ కాలేజీ పూర్వ విద్యార్థి అయిన నరసింహన్‌కు సంగీతం అంటే ఇష్టం. కర్ణాటక, హిందుస్థానీ సంగీతాన్ని ఇష్టపడతారు.  నరసింహన్ సతీమణి విమలా నరసింహన్. వారికి ఇద్దరు కొడుకులు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు