బాపూజీ.. నా మదిలో..

20 Nov, 2019 07:41 IST|Sakshi

చిన్నారులకు జాతీయస్థాయిలో ఉత్తరాల పోటీ

భారత తపాలా శాఖ సంకల్పం

లేఖలు పంపించేందుకు ఈనెల 30 వరకు గడువు

సాక్షి, జ్యోతినగర్‌ (కరీంనగర్‌) : ప్రస్తుతం అంతా ఆధునిక పోకడ.. సమాచారం పంపించాలన్నా.. తీసుకోవాలన్నా.. ప్రతీ ఒక్కరు ‘ఆన్‌లైన్‌’ సేవలపై ఆధారపడి ఉన్నారు. పట్టణాలు, నగరాలు, గ్రామాలు, మారుమూలలో ఉన్న పల్లె ప్రజల చేతిలో నేడు స్మార్ట్‌ఫోన్‌ కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరాలు రాయడం అనే మాట కనిపించదు.. వినిపించదు.. ఒక్క మాటలో చెప్పాలంటే నేటి యువతరానికి, చిన్నారులకు టెలీగ్రాం, పోస్టు కార్డులు, ఇన్‌ల్యాండ్‌ కవర్లు, రిజిష్టర్‌ పోస్టు, స్పీడ్‌ పోస్ట్, పోస్టల్‌ స్టాంపుల వినియోగం గురించి అంతగా తెలియదు. ఈ క్రమంలో చిన్నారుల్లో ఉత్తరాలు రాసే అభిరుచితో పాటు జాతీయభావం పెంపొందించేందుకు భారత తపాలా శాఖ ఒక చిన్న ప్రయత్నం ప్రారంభించింది. మహాత్మాగాంధీ 150వ జయంతోత్సవాలను పురస్కరించుకొని జాతీయస్థాయిలో ఉత్తరాల పోటీ నిర్వహించాలని నిర్ణయించింది. 

చిన్నారుల్లో జాతీయభావం, సృజనాత్మకతను వెలికితీసేందుకు తోడ్పడే జాతీయ ఉత్తరాల పోటీలో పాల్గొనేవారు పలు భారతీయ భాషల్లో ఉత్తరాలను రాయొచ్చు. ఇంగ్లిష్, హిందీతో పాటు తెలుగు, ఇతర అన్ని ప్రాంతీయ భాషల్లో భావాలను వ్యక్తీకరించేందుకు వీలు కల్పించారు. జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు ‘దాయ్‌ ఆఖర్‌’ అని పేరు పెట్టారు. నవంబర్‌ నెలాఖరు వరకు ఉత్తరాలు రాసేందుకు అవకాశం ఉంది. దీని కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ‘ప్రియమైన బాపూ.. మీరు అమరులు’ అనే శీర్షికతో గాంధీ మహాత్ముడిని ఉద్దేశించి ఉత్తరాలు రాయాలి. ప్రధానంగా విద్యార్థి లోకాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పోటీల నిర్వహణకు కార్యాచరణ రూపకల్పన చేశారు. ఇందులో అన్ని వయసుల వారు పాల్గొనడానికి అవకాశం కల్పించారు. 18 సంవత్సరాల లోపు వయసు వారు ఒక కేటగిరీగా, 18 ఏళ్లు దాటినవారు మరో కేటగిరీగా విభజించారు.

విజేతలకు నగదు పురస్కారాలు..
► జాతీయస్థాయి ఉత్తరాల పోటీలో విజేతగా నిలిచేవారికి రూ.59 వేల నగదు. ద్వితీయ స్థానానికి రూ.25 వేలు, తృతీయ స్థానానికి రూ.10 వేలు అందజేయడం జరుగుతుంది. రాష్ట్రస్థాయిలో విజేతకు రూ.25 వేలు, ద్వితీయ స్థానానికి రూ.10వేలు, తృతీయ స్థానానికి రూ.5వేలు ఇస్తారు.
► ఈ విధంగా రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన వారి ఉత్తరాలు జాతీయస్థాయి పోటీలకు నామినెట్‌ అవుతాయి. ఉత్తరాలు చేరడానికి ఈనెల చివరి వరకు గడువు ఉంది. రాష్ట్రస్థాయి ఫలితాలను 31 జనవరి, 2020న వెల్లడిస్తారు. జాతీయస్థాయి ఫలితాలను 2020 మార్చి31న విడుదల చేస్తారు. 
వ్యాసరచన పోటీ కాదు..
► వ్యాసరచన పోటీ ఎంతమాత్రం కాదు. ఎందుకంటే మహాత్మాగాంధీని ఉద్దేశించి రాసిన ఉత్తరం మాదిరిగా ఉండాలి. రాష్ట్రస్థాయిలో విజేతగా నిలిచే వ్యక్తికి(రూ.25వేలు), జాతీయ స్థాయిలో విజేతకు రూ.50వేలు, రెండు పోటీల్లో విజేతగా నిలిస్తే గరిష్టంగా రూ.75 వేలు ఇవ్వనున్నారు. తపాలా శాఖ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు సైతం ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. బాపూ ఎందుకు అమరులయ్యారనే విషయంపై అవగాహన, ఆలోచన, భావ వ్యక్తీకరణ తదితర అంశాలపై గెలుపు ఆధారపడి ఉంటుందని గమనించాలి.

చేతిరాతతోనే రాయాలి..
మీరు రాసే ఉత్తరంలో వయసుకు సంబంధించిన వివరాలను తప్పక రాయాలి. గెలుపొందాక మీ వయసు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించడం జరుగుతోంది. పాల్గొనదలిచిన వారు ‘దాయ్‌ ఆఖర్‌ జాతీయ ఉత్తరాల రాత పోటీ’ శీర్షికన ఇన్‌లాండ్‌ లెటర్‌లో అయితే 500 పదాలు మించకుండా, ఎన్‌వలప్‌ కవర్‌లో అయితే ఏ–4 సైజు పేపర్‌పై 1000 పదాలకు మించకుండా రాయాలి. టైపు చేసి పంపితే తిరస్కరించబడతాయి. సొంత చేతిరాతతో రాసి పంపినవాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. పూర్తి వివరాలకు సమీపంలోని పోస్ట్‌ ఆఫీసులలో సంప్రదించవచ్చు.

‘నేను పాల్గొంటున్నా’.. మీరు కూడా..
భారత తపాలా శాఖ తలపెట్టిన ‘ప్రియమైన బాపూ.. మీరు అమరులు’ అనే ఉత్తరాల పోటీలో నేనూ పాల్గొంటున్నా.. మీరందరు కూడా పాల్గొనాలి.. అని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎన్టీపీసీ రామగుండం పర్మనెంట్‌ టౌన్‌షిప్‌కు చెందిన చిన్నారి అరిగెల అనుశ్వి కోరుతోంది. మహాత్మాగాందీ 150వ జయంతోత్సవాలను పురస్కరించుకొని విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వ తపాల శాఖ నిర్వహిస్తున్న ఉత్తరాల పోటీల్లో పాల్గొనాలని ఉపాధ్యాయురాలితో కలిసి విజయసంకేతం చూపిస్తోంది.

ఉత్తరాలు పంపించాల్సిన అడ్రస్‌..
చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌
తెలంగాణ సర్కిల్‌
ఆబిడ్స్, హైదరాబాద్‌.
 

మరిన్ని వార్తలు