ఔటర్‌ చుట్టూ.. వాటర్‌ వండర్‌!

21 Sep, 2018 01:53 IST|Sakshi

‘కాళేశ్వరం’ తరహాలో 18 సొరంగాల్లో పైపులైన్లు

రింగ్‌ రోడ్డు లోపలున్న 60 గ్రామాలకు జలసిరులు

నవంబర్‌ నెలాఖరుకు 190 గ్రామాలు, మున్సిపాలిటీల దాహార్తి దూరం

జీహెచ్‌ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ ఎం.దానకిశోర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ చేపట్టనున్న జలహారం(వాటర్‌గ్రిడ్‌) పనుల్లో అద్భుతం ఆవిష్కృతం కానుంది. కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో ఔటర్‌ చుట్టూ 18 ప్రదేశాల్లో భూమి పైభాగం నుంచి సుమారు3–4 మీటర్ల లోతున సొరంగమార్గాలు తవ్వి వాటిల్లో రేడియల్‌ మెయిన్‌ భారీ తాగునీటి పైపులైన్లను ఏర్పాటు చేయనున్నారు. సొరంగాలతో ఆయా ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్లు, రహదారులు, గ్రామాలు దెబ్బతినకుండా చూడవచ్చు.

మహానగర దాహార్తిని దూరం చేసేందుకు రూ.4,765 కోట్ల అంచనా వ్యయంతో భారీ రింగ్‌ మెయిన్‌ పైప్‌లైన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు, జలమండలి మార్గదర్శకాల మేరకు టాటా కన్సల్టెన్సీ ఇంజనీరింగ్‌ సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికలో ప్రతి అంశం సాంకేతికంగా ఎన్నో అద్భుతాలకు మూలం కానుండటం విశేషం. ఈ ప్రాజెక్టులో భాగంగా ఔటర్‌ చుట్టూ 120 మిలియన్‌ లీటర్ల నీటినిల్వ సామర్థ్యంతో 12 భారీ స్టోరేజి రిజర్వాయర్లను నిర్మించనున్నారు. ఈ రింగ్‌మెయిన్‌ ప్రాజెక్టుతో కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు జలాలను నగరం నలుమూలలకూ కొరత లేకుండా సరఫరా చేయవచ్చు. దేశంలో ఇప్పటివరకు ఏ నగరంలో లేని తరహాలో ఈ రింగ్‌ మెయిన్‌ ప్రాజెక్టు డిజైన్లు సిద్ధం చేయడం విశేషం.

నవంబర్‌ నాటికి ఔటర్‌ గ్రామాల దాహార్తి దూరం
ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపలున్న 183 పంచాయతీలు, 7 నగరపాలక సంస్థల పరిధిలో నివసిస్తున్న సుమారు పది లక్షల మంది దాహార్తిని ఈ ఏడాది నవంబర్‌ నాటికి సమూలంగా దూరం చేస్తామని జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.దానకిశోర్‌ స్పష్టం చేశారు. ఓఆర్‌ఆర్‌ తాగునీటి పథకంలో ఇప్పటికే 70 గ్రామాల దాహార్తిని దూరం చేసేందుకు 60 స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణాన్ని పూర్తి చేశామని తెలిపారు. 615 కి.మీ. మార్గంలో నీటి పంపిణీ పైపులైన్లు ఏర్పాటు చేయడం ద్వారా సుమారు మూడు లక్షల మంది దాహార్తిని దూరం చేశామన్నారు.

గురువారం ఖైరతాబాద్‌ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఈ పథకానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఔటర్‌ గ్రామాల్లో ఇప్పటికే ఇబ్రహీంపట్నం మండలంలో ఒకటి, మహేశ్వరం మూడు, శంషాబాద్‌ 5, సరూర్‌నగర్‌ మూడు, రాజేంద్రనగర్‌ ఏడు, హయత్‌నగర్‌ తొమ్మిది, పటాన్‌చెరు 10, ఘట్‌కేసర్‌ 9, కుత్బుల్లాపూర్‌ ఐదు, కీసర 4, శామీర్‌పేట్‌ 4 రిజర్వాయర్లను నిర్మించామన్నారు. మిగిలిన 112 రిజర్వాయర్ల పనులు పురోగతిలో ఉన్నాయని, వీటిలో అక్టోబర్‌లో 20, మిగిలిన వాటిని నవంబర్‌లో పూర్తి చేస్తామని చెప్పారు.

ఓఆర్‌ఆర్‌ రింగ్‌ మెయిన్‌ ప్రాజెక్టు ఇదీ..
రూ. 3,965  కోట్లు -  ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ 158 కి.మీ. మార్గంలో 3000 ఎంఎం వ్యాసార్థంలో భారీ పైపులైన్‌ నిర్మాణానికి వ్యయం
రూ. 550  కోట్లు -  ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల 18 చోట్ల 98 కి.మీ. మార్గంలో రేడియల్‌ మెయిన్‌ పైపులైన్ల ఏర్పాటుకు..
రూ. 250  కోట్లు - ఔటర్‌ చుట్టూ 12 చోట్ల భారీ గ్రౌండ్‌ లెవల్‌ సర్వీస్‌ రిజర్వాయర్ల(జీఎల్‌ఎస్‌ఆర్‌) నిర్మాణానికి..
రూ. 4,765  కోట్లు - మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం...

మరిన్ని వార్తలు