రాచకొండపై నజర్

30 Nov, 2014 03:12 IST|Sakshi

 చౌటుప్పల్ : పరిశ్రమల ఏర్పాటు, ఫిలింసిటీ, వాటర్‌గ్రిడ్ నిర్మాణం చేయాలని కృతనిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు కావాల్సిన భూమి కోసం అన్వేషణ ప్రారంభించింది. ఇందులో భాగంగా నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న రాచకొండ అటవీప్రాంతాన్ని, పరిసర గ్రామాలను డిసెంబర్ మూడో తేదీన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేయనున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయంలో శనివారం రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. కాగా, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో రెండు జిల్లాల పరిధిలో 35వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములున్నాయి. వీటిని సీఎం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలన చేసి, భవిష్యత్ అవసరాలకు ఎలా వినియోగించుకోవాలన్న ఆలోచనతోనే  పర్యటిస్తున్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు భూములు కే టాయించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రాచకొండ ప్రాతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగురోడ్డు, 65వ నంబర్ జాతీయ రహదారికి సమీపంలో ఉండడంతో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైనదిగా ప్రభుత్వం భావిస్తోంది.
 
 ఫిలింసిటీ ఏర్పాటుకు అనువైన ప్రాంతం
 రాచకొండ ప్రాంతం సినీ పరిశ్రమ ఏర్పాటుకు అనువైనదిగా ప్రభుత్వం భావిస్తోంది. రెండు వేల ఎకరాల్లో ఫిలిం సిటీ నిర్మించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు ప్రకటన కూడా చేశారు. అయితే హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమై ఉన్న చిత్ర పరిశ్రమ రాష్ర్ట విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోకుండా ఉండేందుకు రాష్ట్ర రాజధాని నగరం సమీపంలో హైటెక్ హంగులతో సినిమా, సీరియళ్ల చిత్రీకరణకు అనుగుణంగా అలాగే స్థానికులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కలిపించేలా 2వేల ఎకరాల్లో ఫిలిం సిటీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అవసరమైన 2వేల ఎకరాల ప్రభుత్వభూమి హైదరాబాద్ సమీపంలో మరెక్కడా లేదు. దీనికి తోడు రాచకొండ  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే 65వ నంబర్ జాతీయ రహదారికి ఆనుకొని, ఔటర్ రింగురోడ్డుకు సమీపంలో ఉంది. శంషాబాద్ విమానాశ్రయానికి కూడా కేవలం 25కిలో మీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఈ ప్రాంత మంతాగుట్టలతో నిండి, ప్రకృతి అందాలను మైమరపించే లొకేషన్లతోపాటు, గుట్టలపై నుంచి జాలువారే సెలయేళ్లు ఉన్నాయి. సుమారు 400సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన కాకతీయుల పాలన నాటి అపురూపవైన కట్టడాలు, చారిత్రక సంపద ఎంతో ఉంది. రామోజీ ఫిలిం సిటీ కూడారాచకొండకు కేవలం 15కిలోమీట్ల లోపే ఉండడంతో సినీ పరిశ్రమ ఏర్పాటుకు ఆలోచన చేస్తోంది.
 
 రాచకొండ మీదుగా మరో రింగు రోడ్డు ..
 ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగురోడ్డుకు అనుసంధానంగా, హైదరాబాద్‌కు నలువైపులా ఉన్న జాతీయ రహదారులను కలుపుతూ ప్రభుత్వం మరో రింగురోడ్డుకు రూపకల్పన చేస్తోంది. హైదరాబాద్‌నుంచి 60నుంచి 100 కిలోమీటర్ల పరిధిలో ఈ రింగురోడ్డు ఉంటుందని ప్రకటన కూడా చేసింది. కరీంనగర్, వరంగల్, విజయవాడ, సాగర్, శ్రీశైలం హైవేలను అనుసంధానించడం ద్వారా హైదరాబాద్‌కు వచ్చే వాహనాల తాకిడిని తగ్గించడంతో పాటు సమయాన్ని ఆదా చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ రోడ్డు రాచకొండ మీదుగా వెళ్లనుంది. త ద్వారా రాచకొండలో ఏర్పాటయ్యే ఫిలిం ఇండస్ట్రీ, పరిశ్రమలకు కూడా రవాణా సౌకర్యం కల్పించవచ్చన్న యోచనలో ఉంది. దీనికి తోడు కృష్ణాజలాల కోసం మునుగోడు నియోజకవర్గంలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం, ఈ ప్రాంతంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు నీటి అవ సరాలను కూడా అధిగమించొచ్చన్న ఆలోచన చేస్తోంది.
 
 ఆ పక్కన పరిశ్రమలు..
 రంగారెడ్డి-నల్లగొండ జిల్లాల సరిహద్దులో విస్తరించి ఉన్న రాచకొండకు ఈ ప్రక్కన సంస్థాన్ నారాయణపురం మండలం ఉంటే, ఆ పక్కన మంచాల మండలం ఉంది. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం భూములను కేటాయిం చింది. ఇప్పటికే పలుమార్లు ఏపీఐఐసీ అధికారులు ఆ భూములను పరిశీలించారు.
 

మరిన్ని వార్తలు