కమలాకర్‌ వెళ్లాక.. రాజేందర్‌ రాక

25 Nov, 2019 07:40 IST|Sakshi

ఈటల వచ్చే ముందు నిష్క్రమించిన కెప్టెన్‌ సాబ్‌

సమావేశానికి హాజరు కాని కలెక్టర్‌ సర్ఫరాజ్‌

ఢిల్లీలోనే బండి సంజయ్‌

గైర్హాజరైన ఎమ్మెల్యేలు రసమయి, వొడితెల సతీశ్‌ 

ఆలస్యమైనా... అతిథులంతా వచ్చిన తరువాతే ఏ సభ అయినా మొదలవడం ఆనవాయితీ. అందులోనూ... అధికారిక సభలయితే ఆ హంగామానే వేరు. కానీ కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ సమావేశం అందుకు భిన్నంగా సాగింది. జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను ఇక్కడి సమావేశం ఆవిష్కరించింది. అధికార పార్టీలోని ఇద్దరు మంత్రుల మధ్య నెలకొన్న అగాధం ప్రస్ఫుటంగా కనిపించింది. ఇద్దరు మంత్రులు కరీంనగర్‌లోనే ఉన్నా... ఒకరు హాజరైన సమయంలో మరొకరు అక్కడ లేకపోవడం గమనార్హం. ఉదయమే టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఒక్కరే వెళ్లారు. ఆయనతోపాటు ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్, టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి ఉండగా... కరీంనగర్‌లోనే ఉన్న మంత్రి గంగుల కమలాకర్‌ హాజరు కాలేదు. 11.30 గంటలకు మొదలైన జిల్లా పరిషత్‌ సమావేశానికి మంత్రి గంగుల కమలాకర్‌ రాగా... ‘ఆ సమయంలో’ మంత్రి ఈటల రాలేదు. గంగుల వెళ్లిపోయిన కొద్దిసేపటికి ఈటల హాజరై తనదైన శైలిలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరును వివరించారు.  

సాక్షి, కరీంనగర్‌ : జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కనమల విజయ అధ్యక్షతన ఆదివారం కరీంనగర్‌ జెడ్పీ   సమావేశం జరిగింది. ఉదయం 11.30 గంటలకు సమావేశం మొదలుకాగా... అప్పటికి జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు , ఎమ్మెల్యే రవిశంకర్, కొందరు కార్పొరేషన్‌ చైర్మన్లు, 16 మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్ల తీరు, పౌరసరఫరాల శాఖ, సహకార సమాఖ్యలు చేస్తున్న కృషి, జరుగుతున్న అవకతవకలను మంత్రి వివరించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆ సమయంలో మరో మంత్రి ఈటల రాజేందర్‌ సభలో లేకపోవడం గమనార్హం.  

9 గంటలకు కరీంనగర్‌లోనే ‘ఈటల’ 
ఉదయమే కరీంనగర్‌ వచ్చిన మంత్రి ఈటల రాజేందర్‌ 9 గంటలకు కొత్తపల్లిలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడి నుంచి జెడ్పీ చైర్‌పర్సన్‌ కనమల విజయ నివాసానికి వెళ్లి అల్పాహారం చేశారు. అక్కడి నుంచి తన సొంత నియోజకవర్గానికి వెళ్లిపోయారు. జమ్మికుంటలో పెళ్లిళ్లు, ఇతర ప్రొగ్రామ్స్‌లో పాల్గొని ఒంటిగంట ప్రాంతంలో తిరిగి కరీంనగర్‌ చేరుకుని జిల్లా పరిషత్‌ సమావేశానికి హాజరయ్యారు. అయితే అప్పటికే తన శాఖకు సంబంధించిన లోటుపాట్లను చర్చించిన మంత్రి గంగుల కమలాకర్‌ ఖమ్మంలో వివాహానికి హాజరు కావాలని చెప్పి సమావేశం నుంచి వెళ్లిపోయారు. గంగుల వెళ్లిపోయిన కొద్దిసేపటికి మంత్రి ఈటల జెడ్పీ హాల్‌లోకి అడుగుపెట్టారు. కాగా మంత్రి గంగుల కమలాకర్‌ ఉన్నంత సేపు సభలో ఉన్న రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు మంత్రి ఈటల రాజేందర్‌ వచ్చే ముందు హాల్‌ నుంచి వెళ్లిపోవడం గమనార్హం.  

సమావేశానికి రాని కలెక్టర్‌ 
జిల్లా పరిషత్‌ సమావేశంలో కలెక్టర్‌ కీలకంగా వ్యవహరిస్తారు. కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్,  కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఫోన్‌లో మాట్లాడిన సంభాషణ ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీనిపై మంత్రి గంగుల మాట్లాడుతూ కలెక్టర్‌ తన రాజ్యాంగబద్ధమైన పదవి పరిధిని దాటి వ్యవహరించారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య అంతరం పెరిగినట్లయింది. యాదృశ్ఛికమో... కావాలని జరిగిందో తెలియదో గానీ ఈ సమావేశానికి కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ హాజరు కాలేదు. ఆయన తరఫున  జాయింట్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ లాల్‌ సమావేశం ముగిసే వరకు ఉన్నారు. ఆయనతోపాటు సీఈవో వెంకట మాధవరావు సమావేశం నిర్వహణలో ఉన్నారు. 

ఢిల్లీలో ఎంపీ సంజయ్‌ 
పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ఢిల్లీలో ఉండడంతో జెడ్పీ సమావేశానికి హాజరు కాలేదు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ జెడ్పీ సమావేశానికి గైర్హాజరయ్యారు.

మరిన్ని వార్తలు