ఆస్పత్రుల్లో ఏం జరుగుతోంది?

12 Jun, 2019 03:06 IST|Sakshi

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనితీరుపై దృష్టి సారించిన మంత్రి ఈటల

గాంధీ, ఉస్మానియా, నీలోఫర్‌లను సందర్శించిన మంత్రి

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి నడుం బిగించారు. ముందుగా హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రులైన ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, నేచురోపతి ఆసుపత్రులను మంగళవారం పరిశీలించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆయా ఆసుపత్రుల్లో పరిస్థితులను అధ్యయనం చేశారు. ఆయన మంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోనే ఉంది. ఇటీవల ఎన్నికల కోడ్‌ ముగియడంతో ఆయన ఆసుపత్రులను అధ్యయనం చేయడం మొదలుపెట్టారు.

ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించినప్పుడు అక్కడున్న వైద్య సిబ్బంది తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అక్కడున్న భవనం అధ్వానంగా ఉన్న పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త భవనం నిర్మించడానికి, ప్రస్తుతం ఉన్న భవనాన్ని ఆధునీకరించేందుకు రూ. 25 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం రూ. 5.27 కోట్లతో నడుస్తున్న మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. అలాగే జూనియర్‌ డాక్టర్లకు అవసరమైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు నర్సింగ్‌లకు ప్రత్యేక భవనం కేటాయిస్తానని పేర్కొన్నట్లు మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. క్యాత్‌లాబ్‌ పనిచేయడం లేదని ఫిర్యాదు చేయగా, దాన్ని అందుబాటులోకి తీసుకొస్తానని ఆయన వివరించారు. ఇక నీలోఫర్‌ను సందర్శించినప్పుడు అక్క డున్న పరిస్థితులను అధ్యయనం చేశారు. నర్సింగ్‌ స్టాఫ్‌ కొరత వేధిస్తుందని, కొందరిని ఇస్తే తాము అద్భుతంగా పనిచేస్తామని అక్కడున్న వైద్యులు పేర్కొన్నారు. ఆ తర్వాత మంత్రి గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. కొన్ని సందర్భాల్లో మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.  

జిల్లాల్లోనూ పర్యటనకు ఏర్పాట్లు..
మున్ముందు జిల్లాల్లోనూ ఆకస్మికంగా పర్యటనలు చేయాలని మంత్రి ఈటల భావిస్తున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. జిల్లాల్లో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యం లో ఆయన వాటిని స్వయంగా పరిశీలించాలని భావి స్తున్నారు. ప్రభుత్వం కేసీఆర్‌ కిట్‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆసుపత్రుల్లో ప్రసవాలు సరిగా చేసే పరిస్థితులు ఉన్నాయా? లేదా? అని ఆయన పరిశీలించనున్నారు. మరోవైపు చాలా చోట్ల వైద్యుల కొరత వేధిస్తోంది. కొన్ని చోట్ల వైద్యులున్నా ఆసుపత్రులకు రెగ్యులర్‌గా రావడం లేదు. అవసరమైతే తన ఆకస్మిక పర్యటనలో కొందరిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

>
మరిన్ని వార్తలు