బీఏసీకి దూరంగా ఉండనున్న ఈటల, ఎర్రబెల్లి

14 Sep, 2019 11:48 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ : శాసనసభ బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశాలకు మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈసారి దూరంగా ఉండనున్నారు. ఇంతకు ముందు కమిటీలో వీరి పేర్లు ఉండగా... తాజా కమిటీ నుంచి ఆ ఇద్దరు మంత్రుల పేర్లను తొలగించారు. కొత్తగా ప్రభుత్వ చీఫ్‌ విప్, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు బీఏసీలో అవకాశం కల్పించారు.

తొలుత స్థానం
రెండోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన అనంతరం ఫిబ్రవరి 21న బీఏసీని ఏర్పాటు చేశారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో సీఎం కేసీఆర్‌ సహా మొత్తం 11 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కూడా సభ్యులుగా స్థానం ఉంది. అయితే స్పీకర్‌ విచక్షణ, పరిస్థితులకు అనుగుణంగా.. బీఏసీని పునర్‌ వ్యవస్థీకరించుకోవచ్చనే నిబంధన మేరకు తాజా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ఈనెల 8న బీఏసీ కమిటీని నామినేట్‌ చేశారు. ఈ మేరకు ఆ కమిటీలో మార్పులు, చేర్పులు జరిగాయి. ఈ కమిటీలో గత బీఏసీ కమిటీ జాబితాలో ఉన్న ఇద్దరు మంత్రులు రాజేందర్, దయాకర్‌రావు పేర్లు లేకపోగా.. వరంగల్‌ ఉమ్మడి జిల్లా నుంచి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయభాస్కర్‌కు అవకాశం కల్పించారు. ఈ మార్పులకు సంబంధించిన ఉత్తర్వుల ప్రతిని తెలంగాణ శాసనసభ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు.  

మరిన్ని వార్తలు