ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌కు పిలుపు

19 Feb, 2019 07:28 IST|Sakshi

సీఎంవో నుంచి ఇద్దరు నేతలకు సమాచారం

రెండోసారి కేసీఆర్‌ కేబినెట్‌లో ఈటలకు అవకాశం

ప్రభుత్వ విప్‌ నుంచి కొప్పులకు పదోన్నతి

సోమవారం రాత్రే హైదరాబాద్‌కు అభిమానులు

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేబినెట్‌లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి ఇద్దరికీ మంత్రుల అవకాశం దక్కింది. ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మాజీమంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు మరోమారు మంత్రి పదవి దక్కింది. ప్రభుత్వ మాజీ విప్, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు తొలిసారి మంత్రివర్గంలో స్థానం దక్కింది. ఈ ఇద్దరు నేతలు మంగళవారం ఉదయం 11.30 గంటలకు కుటుంబసభ్యులతో ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరుకావాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సోమవారం సమాచారం అందింది. ఈసారి మంత్రి వర్గంలో ఉమ్మడి జిల్లాలో ముగ్గురికి మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం జరిగింది. సీఎం తనయుడు, మాజీమంత్రి కేటీఆర్‌ పూర్తిస్థాయిలో పార్టీ బాధ్యతలు చూస్తుండటంతో ఆయనను కేబినెట్‌లోకి తీసుకోలేదంటున్నారు. ఈనేపథ్యంలో మాజీమంత్రి ఈటల రాజేందర్, మాజీ విప్‌ కొప్పులకు మంత్రులకు అవకాశం కల్పించినట్లు చెప్తున్నారు. తమ అభిమాన నేతలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారన్న సమాచారం అందుకున్న ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌ అభిమానులు, బంధువులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం రాత్రే హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. 

ఓటమెరుగని నేత ‘ఈటల’.. ఆరుసార్లు గెలిచిన ‘కొప్పుల’
ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్‌ఎస్‌లో కీలకంగా వ్యవహరించిన ఈటల రాజేందర్‌ వరుస విజయాలతో ఓటమెరుగని నేతగా నిలిచారు. ఈటల రాజేందర్‌ 2004లో కమలాపూర్‌ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత 2008 ఉప ఎన్నికల్లోనూ విజేతగా నిలిచారు. ఆ తర్వాత అనూహ్యంగా హుజురాబాద్‌ నియోజకవర్గానికి రాజకీయ మకాం మార్చిన ఈయన 2009, 2010 (ఉప ఎన్నిక), 2014, 2019 ఎన్నికలవరకు వరుస విజయాలతో సత్తా చాటారు. 2019 ఎన్నికల్లో బరిలో నిలిచి గెలిచిన రాజేందర్‌ డబుల్‌ హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. తెలంగాణ మొదటి కేబినెట్‌లో ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు చేపట్టి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావడంలో కీలకంగా వ్యవహరించారు. మాజీ విప్, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ ఏడుసార్లు పోటీచేసి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి ఓడిన ఈయన ఆ తర్వాత వరుస విజయాలు సాధించారు. రద్దైన మేడారం నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ తరఫున 1994లో తొలిసారి పోటీచేసి ఓటమిపాలయ్యారు. తర్వాత 2004లో మేడారం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా తొలి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత 2008 ఉప ఎన్నికలో విజేతగా నిలిచారు. తరువాత ధర్మపురి నియోజకవర్గానికి మారిన ఆయన 2009, 2010 (ఉప ఎన్నిక), 2014, 2019లో వరుస విజయాలతో దూసుకెళ్లారు. ఏడుసార్లు పోటీ ఆరుసార్లు గెలిచి డబుల్‌ హ్యాట్రిక్‌ను ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈయన గత కేబినెట్‌లోనే మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగినా.. సమీకరణలు, సామాజిక కోణాల సర్దుబాటులో తృటిలో తప్పింది. ఈసారి ఈటల రాజేందర్‌తోపాటు కొప్పుల ఈశ్వర్‌కు మంత్రివర్గంలో స్థానం దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 

శాఖల కేటాయింపుపై సస్పెన్స్‌.. ప్రమాణ స్వీకారం తర్వాతే బాధ్యతలు
మాజీమంత్రి ఈటల రాజేందర్, మాజీ విప్‌ కొప్పుల ఈశ్వర్‌కు ఈ మంత్రివర్గంలో స్థానం లభించగా.. ఈ ఇద్దరు నేతలకు ఏయే శాఖలు కేటాయిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సీఎంగా కేసీఆర్, హోంమంత్రిగా మహమూద్‌ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా 16 మందిని భర్తీ చేయాల్సి ఉంది. ఈసారి 10 మందినే భర్తీ చేస్తున్నందున.. ఉమ్మడి జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేతలకు ఏ శాఖలు కేటాయిస్తారన్న చర్చ జరుగుతోంది. ఈసారి కొందరి శాఖల మార్పులు ఖాయమన్న ప్రచారం బలంగా ఉంది. ఈ మంత్రివర్గంలో కేటీఆర్‌ లేకపోగా.. మిగిలింది ఈటల రాజేందర్‌. సీఎంవో కార్యాలయం నుంచి ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని మాత్రమే సమాచారం అందగా.. కేటాయించే శాఖల ప్రస్తావన లేదు. గత ప్రభుత్వంలో రాజేందర్‌ ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రిగా వ్యవహరించారు. ఈ సారి ఏ శాఖ కేటాయిస్తారనేది చర్చనీయాంశం అయ్యింది. కొత్తగా మంత్రివర్గంలో చేరుతున్న కొప్పుల ఈశ్వర్‌కు కేటాయించే శాఖపైనా చర్చ జరుగుతోంది. ఈ విషయమై అధినేత కేసీఆర్‌ ఏం యోచిస్తున్నారు? అయన మదిలో ఏముంది..? అనేది ప్రమాణ స్వీకారం తర్వాతే తేలనుందంటున్నారు.

‘ఈటల’ బయోడేటా..
పేరు : ఈటల రాజేందర్‌
పుట్టినతేదీ :  24–03–1964
తల్లిదండ్రులు : ఈటల వెంకటమ్మ, మల్లయ్య
స్వగ్రామం :  కమలాపూర్‌  
విద్యాభ్యాసం :  బీఎస్సీ(బీజెడ్‌సీ), ఎల్‌ఎల్‌బీ డిస్‌కంటిన్యూ
వ్యాపారం :   1986 నుండి కోళ్ళపరిశ్రమ వ్యాపారం
కుటుంబం  :   భార్య జమునారెడ్డి, కూతురు నీత్, ఒక కొడుకు నితిన్‌

రాజకీయ నేపథ్యం 2002లో టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2004లో మెుదటిసారిగా కమలాపూర్‌ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2008 ఉప ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా, టీఆర్‌ఎస్‌ లెజిస్లెషన్‌ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్షనేతగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి వకుళాభరణం కృష్ణమోహన్‌రావుపై 15,035 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2010 ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎం.దామోదర్‌రెడ్డి, 2014లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కేతిరి సుదర్శన్‌రెడ్డిపై విజయం సాధించిన రాజేందర్, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డిని ఓడించారు. 2014లో కేసీఆర్‌ కేబినేట్‌లో ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రిగా వ్యవహరించిన ఈయనకు రెండోసారి కేసీఆర్‌ కొలువులో మంత్రిగా అవకాశం దక్కింది. 

‘కొప్పుల’ బయోడేటా..
పేరు : కొప్పుల ఈశ్వర్‌ 
పుట్టిన తేదీ : 1959 ఏప్రిల్‌ 20 
తల్లిదండ్రులు : మల్లమ్మ, లింగయ్య 
విద్యార్హతలు  : డిగ్రీ 
స్వగ్రామం    :  కుమ్మరికుంట, జూలపల్లి మండలం
భార్య : స్నేహలత 
పిల్లలు : కూతురు నందిని, అల్లుడు  అనిల్, మనుమడు భవానీనిశ్చల్‌
 

రాజకీయ నేపథ్యం సింగరేణి సంస్థలో 20ఏళ్లపాటు ఉద్యోగిగా పనిచేశారు. 1983లో టీడీపీలో చేరిన ఈశ్వర్‌ రాష్ట్ర మిడ్‌క్యాప్‌ సంస్థ డైరెక్టర్‌గా.. మినిమమ్‌ వేజ్‌ అడ్వైజరీ బోర్డ్‌ డైరెక్టర్‌గా.. మేడారం నియోజకవర్గం దేశం పార్టీ ఇన్‌చార్జిగా పనిచేశారు. 1994లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. 2001 టీఆర్‌ఎస్‌లో చేరారు. 2004 జనవరిలో జరిగిన ఎన్నికల్లో మేడారం నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి 56 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో 28వేల ఓట్ల మెజార్టీతో అదేస్థానం నుంచి ఎన్నికయ్యారు. నియోజకవర్గ పునర్విభజనలో మేడారం నియోజకవర్గం రద్దు కావడంతో ధర్మపురి నియోజకవర్గం నుంచి 2009 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెలిచారు. 2009, 2010 ఉప ఎన్నిక, 2014 సాధారణ, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను వరుసగా ఓడించారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా వ్యవహరించిన కొప్పుల ఈశ్వర్‌కు ఈసారి మంత్రిపదవి దక్కింది.  

మరిన్ని వార్తలు