మీకు విజన్‌ లేదు

18 Mar, 2017 03:06 IST|Sakshi
మీకు విజన్‌ లేదు

విపక్షాలపై మంత్రి ఈటల రాజేందర్‌ ఫైర్‌
వృత్తులపై గౌరవమూ లేదని మండిపాటు
ఎంబీసీల అభివృద్ధికి చర్యలు చేపడితే హేళనలా?
చదువంటే ఉద్యోగమే కాదు
మాకు ప్రజల అభివృద్ధే ముఖ్యం
మేమేం చేశామో ఊళ్లకు వెళ్లి అడగండి


సాక్షి, హైదరాబాద్‌: ‘‘ప్రతిపక్షాలకు విజన్‌ లేదు. వృత్తులపై గౌరవం లేదు! ప్రజా సమస్యల సమస్యల పరిష్కారంపై దృష్టి అంతకంటే లేదు!! అందుకే రాష్ట్రం, దేశం ఇన్నాళ్లుగా ఇలా ఉన్నాయి’’ అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ ధ్వజమెత్తారు. శుక్రవారం బడ్జెట్‌ చర్చపై సభ్యులు లేవనెత్తిన పలు అంశాలకు బదులిస్తూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ‘‘చదువుంటేనే ఉద్యోగమా? బతుకంటేనే ఉద్యోగమా? ఇంకేమీ లేదా?’’ అని ప్రశ్నిం చారు. ప్రజల అభివృద్ధే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. కోళ్లు, గొర్రెల పెంపకం ద్వారా వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. గొర్రెల పెంపకం పథకం ద్వారా రూ.20 వేల కోట్ల సంపద సృష్టిని లక్ష్యంగా పెట్టుకున్నామని గుర్తు చేశారు. నీలి విప్లవానికి శాస్త్ర విజ్ఞానాన్ని జోడించి వేలకోట్ల రూపాయల మత్స్య సంపద సృష్టించాలన్నారు.

బడ్జెటంటే తమకు సంబంధం లేదన్నట్లు ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఆక్షేపించారు. కానీ తాజా బడ్జెట్‌లో తమ బతుకుందని ప్రజలు భావించారన్నారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణను నిర్లక్ష్యం చేశారు. మేమిప్పుడు బాగు చేసుకోవడానికి కృషి చేస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కారమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఎన్నికలు, అధికారం మాకు ముఖ్యం కాదు. గతంలో కొన్ని కులాల వారికి సర్టిఫికెట్లు కూడా ఇచ్చేవారు కాదు. ఎంబీసీల అభివృద్ధికి మేం తొలి సారిగా రూ.1,000 కోట్లు కేటాయించాం. రజకులు, నాయీబ్రాహ్మణుల అభివృద్ధికి రూ.500 కోట్లతో చర్యలు చేపడుతుంటే, గొర్రెల పెంపకం పథకం తెస్తుంటే.. ఇదే పని చేయాలా అంటూ హేళనగా మాట్లాడుతున్నారు. వృత్తిపై ఆధారపడిన వారిని బాగు చేసేందుకు చర్యలు పడితే చిన్నచూపుతో వారిని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు’’ అంటూ తూర్పారబట్టారు. హేళనలు కాకుండా అభివృద్ధికి చేయూతనివ్వాలని హితవు పలికారు.

అనూస్‌ వంటివాటిని ఎవరు నడిపిస్తున్నారో గ్రహించాలన్నారు. గొర్రె కాపర్లకు, గౌడ కులస్తులకు, మత్స్యకారులకు, ప్రమాదవశాత్తూ చనిపోయిన వారికి రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పించామన్నారు. బ్యాంకుల జోక్యాన్ని తగ్గించి రూ. లక్ష రుణం తీసుకుంటే రూ.80 వేల సబ్సిడీ ఇచ్చేలా చర్యలు చేపట్టా్టమన్నారు. మూడేళ్లలో ఏం చేశారని అడుగుతున్నారని, ఆ ప్రశ్న గ్రామాల్లోకి వెళ్లి అడిగితే తెలుస్తుందని ఈటల అన్నారు. ‘‘కొత్త రాష్ట్రమైన అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. అభివృద్ధికి సహకరిస్తామన్నారు. కానీ విపక్షాలకు మాత్రం ఇది కనిపించడం లేదు’’ అంటూ చురకలు వేశారు. అభివృద్ధి కోసం మంచి సలహాలిస్తే స్వీకరిస్తాం తప్ప నిరాధార ఆరోపణలు చేయొద్దన్నారు.

అభివృద్ధి చర్యలు భేష్‌: అక్బరుద్దీన్‌
విద్యుత్, వ్యవసాయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ‘‘కోతలు లేకపోవడం సంతోషకరం. వర్షాలతో వ్యవసాయం పెరిగింది. దీనితో రైతులకు అన్ని విధాలా మేలు కలుగుతుంది. రైతులకు రుణమాఫీ, సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించడం హర్షణీయం. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్‌ను ఇంకా అభివృద్ధి చేయాలి. పాతబస్తీ అభివృద్ధికి రూ.5 వేల కోట్లివ్వండి. పాతబస్తీకి గండిపేట నుంచి మంచి నీరివ్వండి. నీటి సరఫరాకూ నిధులివ్వండి’’ అని అక్బరుద్దీన్‌ కోరారు.

సిటీ ఎమ్మెల్యేలు, ట్రాఫిక్‌
పోలీసులతో సమావేశం: నాయిని

హైదరాబాద్‌లో కోఠి తదితర ప్రాంతాల్లో రోడ్లపై బండ్లు పెట్టుకొని వ్యాపారం చేసుకునే వారిని మూడేసి రోజులు జైళ్లో పెడుతున్నారని అక్బరుద్దీన్‌ పేర్కొనగా అలాంటిదేమీ లేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. ‘‘అలా చేయొద్దని పోలీసులకు ఆదేశాలిచ్చాం. దీనిపై మరోసారి నగర ఎమ్మెల్యేలు, ట్రాఫిక్‌ పోలీసులతో చర్చిద్దాం’’ అని చెప్పారు.

మరిన్ని వార్తలు