‘రేపటి నుంచి కరోనా కేసులు తగ్గే అవకాశం’

9 Apr, 2020 19:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో రేపటి(శుక్రవారం) నుంచి కరోనా కేసులు తగ్గే అవకాశం ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. తెలంగాణలో గురువారం మరో 18 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 471 మందికి కరోనా సోకిందని వెల్లడించారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో కరోనాతో నేడు మరొకరు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 12కు చేరింది. ఇప్పటివరకు మొత్తం  45 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 414 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్‌ 22 కల్లా పూర్తి స్థాయిలో కరోనా బాధితులు డిశ్చార్జ్‌ అవుతారు. 

ఈ రోజు పరీక్షించిన 665 శాంపిళ్లలో కేవలం 18 మాత్రమే కరోనా పాజిటివ్‌ వచ్చాయి. ప్రజలంతా లాక్‌డౌన్‌కు సహకరిస్తున్నారు. లాక్‌డౌన్‌ వల్లే కరోనా కేసులు తగ్గాయి. గాంధీ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్ పేషెంట్లు మాత్రమే ఉంటారు. ప్రజలు ఓపీ కోసం కింగ్‌ కోఠి ఆస్పత్రికి వెళ్లాలి. ఎక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాం. తెలంగాణలో 101 హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేశాం. హాట్‌స్పాట్‌ ప్రకటించిన ప్రాంతాల్లో రాకపోకలు బంద్‌ చేస్తున్నాం’ అని తెలిపారు.

చదవండి : అష్ట దిగ్బంధంలోకి ఆ 15 ప్రాంతాలు..

మాస్క్‌ ధరించకుంటే రూ. 200 జరిమానా

మరిన్ని వార్తలు