వైద్య సిబ్బందికి సెలవులు రద్దు

8 Mar, 2020 05:10 IST|Sakshi
కోవిడ్‌ వ్యాప్తి నివారించేందుకు శనివారం వీడియో కాన్ఫరెన్స్‌లో డీఎంహెచ్‌వోలతో మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్‌

కోవిడ్‌ నేపథ్యంలో సర్కారు నిర్ణయం

10న 70 వేల మంది వైద్య సిబ్బందికి శిక్షణ

జిల్లా వైద్య అధికారులతో మంత్రి సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ వైరస్‌ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు శనివారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి తీవ్రత కనిపిస్తుండటంతో వైద్య ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. వైద్యుల కొరత ఎక్కువగా ఉండటం, వైద్య సిబ్బంది చాలా మంది విధులకు హాజరుకాకపోవడం వల్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. డాక్టర్ల సమయపాలనపై కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సమయపాలన పాటించని వైద్యులు, వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అవసరమైతే అలాంటి వారిని సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించింది. కోవిడ్‌పై 70 వేల మందికి క్షేత్రస్థాయిలో మరింత అవగాహన కల్పించేందుకు ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు, పీహెచ్‌సీ వైద్యులందరికీ శిక్షణ ఇవ్వనున్నారు. వారికి ఈ నెల 10న టీ శాట్స్‌ ద్వారా ఒకేసారి అవగాహన కల్పించనున్నారు.

గాంధీఆసుపత్రిలో మార్పులుచేర్పులు
గాంధీ ఆస్పత్రిలో కోవిడ్‌ చికిత్స అందిస్తున్న ఏడో అంతస్తులోకి ఎవరూ వెళ్లకుండా అన్ని ద్వారాలు మూసేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. విదేశాలకు వెళ్లి వచ్చిన లేదా వారితో కలిసి ఉండి జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలున్న వారికి ఓ చోట, విదేశాలకు వెళ్లి వచ్చి కోవిడ్‌ లక్షణాలు లేని వారిని మరో వార్డులో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. గాంధీ ఆసుపత్రికి వస్తున్న వారికి వైరస్‌ సోకకుండా అనుసరించాల్సిన ప్రొటోకాల్‌ను పాటించాలని, ఆ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖను సర్కారు సూచించింది.

డీఎంహెచ్‌వోలతో ఈటల వీడియో కాన్ఫరెన్స్‌.. 
కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రి ఈటల రాజేందర్‌ శనివారం అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలతో సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరి డేటాను సేకరించాలని, వారిని ట్రాక్‌ చేయాలని మంత్రి ఆదేశించారు. కరీంనగర్‌కు గ్రానైట్‌ వ్యాపారం కోసం వచ్చిన చైనా, ఉజ్బెకిస్తాన్‌ దేశీయులను గుర్తించి క్వారంటైన్‌లో ఉంచినట్లు అక్కడి జిల్లా వైద్యాధికారి మంత్రికి తెలిపారు. కోవిడ్‌పై ప్రజల్లో నెలకొన్న భయాన్ని పోగొట్టేందుకు గ్రామ కార్యదర్శి స్థాయి నుంచి ఆశ వర్కర్‌ వరకు అందరూ పనిచేయాలని మంత్రి సూచించారు. దీనికి జిల్లాల్లో జిల్లా వైద్యాధికారులే బాధ్యత వహించాలన్నారు. వైరస్‌ కేసులు నమోదు కాలేదు కాబట్టి రిలాక్స్‌ అవుతామన్న భావన రావొద్దన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. కేంద్రం నుంచి వచ్చిన ఎన్‌సీడీసీ ప్రతినిధులు కూడా మంత్రితో సమావేశమై పలు అంశాలను చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసింది.

కేసీఆర్‌ అభినందనలు
కోవిడ్‌ వైరస్‌పై కొద్ది రోజు లుగా నిర్విరామంగా పనిచేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను సీఎం కేసీఆర్‌ అభినందించినట్లు సమాచారం. వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల్లో పెద్ద ఎ త్తున అవగాహన కల్పించడంతో వైద్య ఆరోగ్య శాఖ సఫలీకృతం అ యినట్లు వ్యాఖ్యలు వినిపిస్తున్నా యి. వైద్య ఆరోగ్య శాఖ కూడా బాగా పనిచేసిందని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు