చంపడాలు పరిష్కారం కాదు

15 Dec, 2019 02:10 IST|Sakshi

మానవ వికాస వేదిక మహాసభల్లో మంత్రి ఈటల  

సాక్షి, హుజూరాబాద్‌: సమాజంలో మార్పు వచ్చినప్పుడే దిశ, నిర్భయ వంటి ఘటనలు పునరావృతం కావని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. తాత్కాలిక ఉపశమనం కోసం చంపడాలు, ఉరి శిక్షలు వేయడం పరిష్కారం కాదని చెప్పారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో శనివారం జరిగిన మానవ వికాస వేదిక 3వ రాష్ట్ర మహాసభల్లో ఈటల మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహ కోసం సంఘర్షణ జరగాలని, అప్పుడే శాశ్వత పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. మనిషి మృగంగా మారుతుండటంతోనే దిశ లాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

వినకూడని, చూడకూడని దారుణాలను పత్రికలు, మీడియా ద్వారా వినాల్సి వస్తోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచం ఎప్పుడూ వైరుధ్యాలమయమని, మానవ మనుగడ ఉన్నంత కాలం వైరుధ్యాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. నేటి సమాజంలో సెల్‌ఫోన్, ఆధునిక టెక్నాలజీ మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచి కోసమే వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో సామాజిక కార్యకర్త దేవి, మానవ వికాస వేదిక కేంద్ర కమిటీ అధ్యక్షుడు సాంబశివరావు, కేంద్ర కమిటీ సభ్యులు ఎన్‌ఎస్‌ మూర్తి, రాష్ట్ర అధ్యక్షుడు జార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్వరాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు