బ్యాంకర్లకు ధన్యవాదాలు : ఈటెల

28 Jun, 2018 14:32 IST|Sakshi

రైతు బంధు పథకంలో గొప్ప సహకారం అమోఘం

19వ త్రైమాసిక రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా ఈటెల

2018-2019 వార్షిక క్రెడిట్ ప్లాన్‌ను ఆవిష్కరించిన మంత్రి

సాక్షి, హైదరాబాద్‌ : రైతు బంధు పథకంలో బ్యాంకర్లు గొప్ప సహకారం అందించారని, వారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్టు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. రైతు బంధు పథకంతో బ్యాంకులలో డబ్బుల కొరత కొంతమేర తగ్గిందన్నారు. దేశంలో రైతు బంధు పథకం ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. గురువారం తాజ్‌ డెక్కన్‌లో జరిగిన ‘19వ త్రైమాసిక రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమీక్ష సమావేశం’లో ఈటెల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2018-19 వార్షిక క్రెడిట్‌ ప్లాన్‌ను మంత్రి ఆవిష్కరించారు. రైతు బంధు పథకం కోసం కేంద్రం నుంచి 5 వేల కోట్ల రూపాయలను కోరగా.. 3 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని ఈటెల ఈ సందర్భంగా తెలిపారు.

కొత్త రాష్ట్రం, చిన్న రాష్ట్రమైన తెలంగాణను, అనేక అద్భుతాలు సాధించి నెంబర్ వన్‌లో నిలపడానికి బ్యాంకర్ల పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. తెలంగాణ ప్రస్తుతం ఒక రోల్‌ మోడల్‌గా ఉందన్నారు. దేశానికి గుజరాత్‌ రోల్‌ మోడల్‌ అని అప్పట్లో చదువుకునే వాళ్లమని, కానీ ఇప్పుడు తెలంగాణ రోల్‌ మోడల్‌గా చదువుకుంటున్నాం అని చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ ముందు ఉందని కాగ్‌ కూడా క్రెడిట్‌ ఇచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, దానికి బ్యాంకర్లు అందించిన సహకారం మరవలేదని కొనియాడారు. 
 

మిషన్‌ భగీరథకు బ్యాంకర్లు రూ.25 వేల కోట్లు
మిషన్‌ భగీరథ ప్రాజెక్ట్‌కు 25 వేల కోట్ల రూపాయలు ఇచ్చి ప్రోత్సహించారన్నారు. మిషన్‌ భగీరథకు బ్యాంకర్లు ఇచ్చిన సహకారం ఇప్పటికీ మరవలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి అయితే మరింత సాగు విస్తీర్ణంలోకి వస్తుందని కూడా తెలిపారు. గతంలో ‘రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అనేవారని, కానీ ఇప్పుడు తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ అనే స్థాయికి ఎదిగామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంక్‌ల సంఖ్య పెంచాలని ఈటెల బ్యాంకర్లను కోరారు.  బ్యాంక్‌లలో ఉద్యోగుల సంఖ్య పెంచి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు రుణాల ఇచ్చి వారిని ఆర్థికంగా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వం, బ్యాంకులపైనే ఉందన్నారు. చిన్న చిన్న పరిశ్రమలకు బ్యాంక్ డిపాజిట్‌ లేకుండా రుణాలు ఇవ్వాలని కోరారు. కుటుంబ పెద్ద చనిపోతే ప్రభుత్వమే ఆదుకునేలా రైతు బీమా పథకం పెట్టామని చెప్పారు. బ్యాంకర్లు ప్రభుత్వంలో భాగమని, తెలంగాణ రాష్ట్రానికి బ్యాంకర్ల సహకారం ఎప్పటికీ ఉండాలన్నారు. ప్రభుత్వం నుంచి బ్యాంక్‌లకు సహాయ సహకారాలు అందుతాయని తెలిపారు. 


 

మరిన్ని వార్తలు