బీసీలకు పంద్రాగస్టు కానుక: ఈటల

13 Aug, 2018 03:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వెనుకబడిన కులాలకు పంద్రాగస్టునాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కానుక ఇవ్వనుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఈ నెల 15న బీసీల కోసం పెద్దఎత్తున రాయితీ రుణ పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఆదివారం తన నివాసంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈటల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచన మేరకు పంద్రాగస్టునాడు అన్ని జిల్లాల్లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. బీసీల కోసం దాదాపు రూ.2 వేల కోట్లతో రాయితీ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. బ్యాంకులతో లింకు లేకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, దీంతో లబ్ధిదారులు స్వయం ఉపాధి యూనిట్‌ను స్థాపించడం సులభతరమవుతుందన్నారు. బీసీ రుణ పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, పైరవీలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. కొన్నిచోట్ల దళారులు చొరబడుతున్నారనే విమర్శలు వస్తున్నాయని, అలాంటి వాటిని ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో మాజీమంత్రి సారయ్య, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కార్పొరేషన్‌ ఎండీ అలోక్‌కుమార్, రజక, నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు