మంత్రి పదవి భిక్ష కాదు

30 Aug, 2019 02:37 IST|Sakshi

కులం పేరుతో కొట్లాడి మంత్రిని కాలే... 

ఘాటుగా స్పందించిన ఈటల రాజేందర్‌ 

గులాబీ జెండాకు ఓనర్లం మేం 

ఇప్పుడు చిల్లర వార్తలకు స్పందించను    

సాక్షి, కరీంనగర్‌ : ‘మంత్రి పదవి నాకు ఎవరో వేస్తే వచ్చిన భిక్ష కాదు.. మంత్రి పదవి కోసం కులం పేరుతో కొట్లాడలేదు.. తెలంగాణ కోసం చేసిన ఉద్యమమే నన్ను మంత్రిని చేసింది’ అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో గురువారం జరిగిన టీఆర్‌ఎస్‌ సభలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. మంత్రి పదవిపై గత కొన్ని రోజులుగా కొన్ని పత్రికలు, సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన పరోక్షంగా స్పందించారు. పదవిని అడుక్కునేవాళ్లం కాదని, అడుక్కునేవాళ్లు ఎవరో తొందరలోనే తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

అధికారం శాశ్వతం కాకపోవచ్చునని.. ధర్మం, న్యాయం మాత్రమే శాశ్వతమని పేర్కొన్నారు. సొంతంగా ఎదగలేని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, బయట జరుగుతున్న చిల్లర రాజకీయాలపై స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ వ్యవహారంపై సభలో ఘాటుగా స్పందించిన ఆయన.. అనంతరం తన వ్యాఖ్యలు తీవ్రంగా చర్చనీయాంశం కావడంతో గురువారం రాత్రి వివరణ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తన ప్రసంగాన్ని వక్రీకరించడం సరికాదని, తాను గులాబీ సైనికుడినేనని, తమ నాయకుడు సీఎం కేసీఆరేనని స్పష్టంచేశారు. అంతకుముందు సభలో ఈటల ఏమన్నారంటే... 

నేనానాడే పారిశ్రామికవేత్తను.. 
‘తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలైనప్పుడు ఆ ఉద్యమానికి పారిశ్రామికవేత్తగా నన్ను సాయం చేయమని ఓ నాయకుడు కోరినప్పుడు పార్టీ పరిచయమైంది. ఆ కాలంలోనే నా గురించి పెద్ద పారిశ్రామికవేత్తనని పత్రికలు రాసినయి. హైదరాబాద్‌లో ఆ రోజుల్లో ఈటల రాజేందర్‌ అంటే తెలియని వారు ఉండరనుకుంట. అప్పటి ఉద్యమ రోజుల్లోనే పది లక్షల కోళ్ల ఫారాలను నడుపుతున్నా. 50 లక్షల కోళ్ల ఫాంలను నడిపే సత్తా ఉన్నవాడిని. 2003లో నేను టీఆర్‌ఎస్‌లో చేరి పనిచేస్తున్న క్రమంలో అప్పటి ఉద్యమ నేత అయిన సీఎం కేసీఆర్‌ నన్ను మీది ఎక్కడయ్యా అని అడిగితే కమలాపూర్‌ అని చెప్పిన.

ఆ సందర్భంలో గిక్కడ ఏముందయ్యా.. నీకు గట్టుకు కట్టెలు మోసినట్లు అని చెప్పి.. నీకు డబ్బు, మంచి పేరు ఉంది. నువ్వు అక్కడికి వెళ్లు అని కమలాపూర్‌ పొమ్మన్నడు. అప్పుడు కమలాపూర్‌ నాకు పెద్దగా పరిచయం లేదు సార్‌.. నేను ఈటల మల్లయ్య కొడుకు గానో, ఈటల సమ్మయ్య తమ్ముని గానో, ఈటల భద్రయ్య అన్నగానో చెప్పుకోవాలె తప్ప అక్కడ నాకు చరిత్ర లేదు సార్‌ అని చెప్పిన. అప్పుడు సీఎం కేసీఆర్‌ నువ్వు పో.. నీకు మంచిగ ఉంటుందని చెబితే కమలాపూర్‌లో అడుగు పెట్టిన. తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడిన బిడ్డగా నన్ను ఆరుసార్లు గెలిపించి నియోజకవర్గ ప్రజలు మద్దతుగా నిలిచారు. 

తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగరేసినం 
అనామక మనిషిగా వచ్చిం ఈ గడ్డ మీద ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుచుడు అనేది ఓ చరిత్ర. నా తండ్రి రాజకీయాల్లో లేడు. నాకు నేనుగా నిలబడ్డా. ఒక్క హుజూరాబాదే కాదు.. నేను ఆదిలాబాద్‌కు పోయినా పదిమంది వచ్చి ఫొటో దిగి పోతరు. నేను మహబూబ్‌నగర్‌ పోయినా, వ్యాన్‌లలో వచ్చి పదిమంది ఫొటో దిగి పోతరు. లక్షల మందితో తెలంగాణ గడ్డపై ఉద్యమం చేసిన బిడ్డలం. ఒక పత్రిక రాస్తది.. ఈయనకు మంత్రి పదవే రాకపోతుండే.. కుల సమీకరణలు కలిసొచ్చాయని. కొడుకా గుర్తుపెట్టుకో.. కులంతోటి కొట్లాట పెట్టలే. ఈ మంత్రి పదవే ముఖ్యమా? కులంతో వచ్చినవాడిని కాదు నేను. ఈటల రాజేందర్‌ అనేవాడు తెలంగాణ ఉద్యమం మూడున్నర కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవ బావుటా.

ఆ బావుటా ఎగరేసిన తెలంగాణ బిడ్డను. తెలంగాణ ఆత్మ గౌరవం కోసం, తెలంగాణ తల్లి విముక్తి కోసం కొట్లాడినం. దొంగలెవరో, ద్రోహులెవరో త్వరలోనే తెలుస్తది. ద్రోహులు పదేపదే మోసం చేయలేరు. న్యాయం, ధర్మం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఆనాడు జైళ్లలో, పీడీ యాక్టులు పెట్టాలె అని ముఠాలు కట్టిన్రు. నన్ను చంపాలె అని రెక్కీలు నిర్వహించినప్పుడు.. సంపుతవా నా కొడకా! అని ఛాలెంజ్‌ చేసిన తెలంగాణ బిడ్డను నేను. ఈటల రాజేందర్‌ తెలంగాణ విముక్తి పోరాటం వల్ల గెలిచాడు తప్ప.. నాకు నేనుగా గెలవలేదు అని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌కు చెప్పిన. ఇవాళ పైసల గురించి మాట్లాడుతున్నారు. నాకు ఆనాడే పైసలున్నయ్‌. నా సొంతంగా కోళ్ల ఫారాలతో వ్యాపారాలు చేసుకొని సంపాదించిన పైసలు. నా 15 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవ్వల దగ్గరి నుంచైనా ఐదువేలు లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచే వైదొలుగుతా. నేను ఇల్లు కట్టుకుంటే ఇంత కక్షా? ఇల్లు కట్టుకున్న భూమి కూడా ఇప్పుడు కొన్నది కాదు.  

అడుక్కునేవాళ్లు ఎవరో తెలుస్తది.. 
చెప్పాలంటే 10 గంటలు చెప్తా. ఒక్కోరోజు 4 జిల్లాల్లో 20 సభల్లో లక్షల మందితో ఇంటరాక్ట్‌ అయి ఉద్యమాన్ని నడిపిన వాళ్లం మేం. ఈ గులాబీ జెండాకు ఓనర్లం మేం. అడుక్కుని వచ్చిన వాళ్లం కాదు మేం. బతుకచ్చినోళ్లం కాదు మేం. అడుక్కునేవాళ్లెవరో రేపు తెలుస్తది. అధికారం అనేది శాశ్వతం కాకపోవచ్చు.. కానీ ధర్మం, న్యాయం శాశ్వతంగా ఉంటుంది. ప్రజలే చరిత్ర నిర్మాతలు తప్ప.. నాయకులు కాదనే సత్యాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. కుసంస్కారం ఉన్న, ఎదగలేని, సొంతంగా తిరగలేని నాయకుల గురించి అప్రమత్తంగా ఉండాలి. ధర్మం నుంచి అలాంటి నాయకులు తప్పించుకోలేరు. ప్రజాక్షేత్రంలో వారికి శిక్ష తప్పదు. 

చిల్లరమల్లర వార్తలకు భయపడను.. 
నేను గెలవగలిగే సత్తా ఉన్నోడిని.. అమ్ముడుపోకుండా ఉన్నోడిని నా భుజాలమీద మోసే ప్రయత్నం చేస్తా. ఈ బాధ.. ఇదంతా కూడా నానోటి నుంచే కాదు.. ఎన్నడో ఒకనాడు తప్పకుండా బయటకొస్తాయ్‌. ఎవడు పోయి ద్రోహి అయ్యాడో.. ఎవడు హీరో అయ్యాడో అనేది ఆ రోజు తెలుస్తదన్న ఆశతో బతికేవాడిని. ఈటల రాజేందర్‌ వెలిగే దీపమే తప్ప.. తెలంగాణ గడ్డమీద ఆత్మగౌరవంతో బతికేవాడే తప్ప.. ఈ చిల్లరమల్లర వారితో, వార్తలతో భయపడే ప్రసక్తే లేదని చెబుతున్నా’అని ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. 
 
తప్పుడు వార్తలతో అవమానించొద్దు
హుజూరాబాద్‌ సభలో తాను చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించడంతో మంత్రి ఈటల రాజేందర్‌ స్పందించారు. ఈ విషయంపై కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో తనపై వస్తున్న వార్తల గురించి వివరణ ఇస్తూ గురువారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ నాయకుడు కాసిపేట శ్రీనివాస్‌ చేరిక సందర్భంగా నేను చేసిన ప్రసంగాన్ని కొన్ని వార్తా ఛానళ్లు, సోషల్‌ మీడియాలోని కొన్ని వర్గాలు వక్రీకరించడం సరికాదు. రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో ముమ్మాటికీ గులాబీ జెండానే ఎగురుతుంది. నేను పార్టీలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు గులాబీ సైనికుడినే. మా నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆరే. ఇటీవల కొన్ని పత్రికలతో పాటు, సామాజిక మాధ్యమాల్లో మా పార్టీ అంటే గిట్టనివాళ్లు, నా ఎదుగుదలను ఓర్వలేనివారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

నన్ను ఒక కులానికి ప్రతినిధిగా, డబ్బులకు ఆశపడే వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హుజురాబాద్‌ సభలో చిల్లరవార్తలు వద్దని చెప్పాను. తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యే నాటికే నేను పది లక్షల కోళ్ల ఫారానికి యజమానినని చెప్పాను. కమలాపుర్‌ (ప్రస్తుత హుజురాబాద్‌) నియోజకవర్గానికి నన్ను పంపించి, ఇక్కడ పోటీ చేయించి గెలిపించింది మా నాయకుడు కేసీఆర్‌ అని చెప్పడంతో పాటు.. మేము గులాబీ సైనికులమని, రాజకీయాల్లోకి సంపాదించుకోవడానికి రాలేదని వివరణ ఇచ్చాను. నేను పార్టీలో, ఉద్యమంలో చేరేనాటికే పారిశ్రామికవేత్తను అనే విషయాన్ని కూడా స్పష్టం చేశాను. ఓ పార్టీ నాయకుడు ఇటీవల పత్రికలో వచ్చిన కథనంపై స్పందించాలని వేదికపై కోరడంతో ఆ పత్రికపై నేను చేసిన కామెంట్లలో రంధ్రాన్వేషణ చేయడం సరికాదు. ఉద్యమ సమయంలో పార్టీ మారాలని వివిధ రకాల ఒత్తిళ్లు వచ్చినా లొంగిపోలేదు. తెలంగాణ ఉద్యమ పుణ్యానే నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. నిరాధారమైన వార్తలను ప్రసారం చేయడం ఆపడంతో పాటు, సోషల్‌ మీడియా కూడా నా ప్రసంగ పాఠాన్ని పూర్తిగా విని సంయమనం పాటించాలి’అని మంత్రి ఈటల పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు