కరోనా నియంత్రణ ఏర్పాట్లలో ముందున్నాం

28 Mar, 2020 03:14 IST|Sakshi

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడి

రాష్ట్రంలో ఇంకా కింది స్థాయికి వైరస్‌ సోకలేదని స్పష్టీకరణ

ప్రైవేటు మెడికల్‌ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులతో భేటీ

వారంలో అనుబంధ ఆసుపత్రులను అప్పగించాలని ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నియంత్రణ ఏర్పాట్లలో తెలంగాణ దేశంలోనే ముందుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంట్రల్‌లో శుక్రవారం జరిగిన మెడికల్‌ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్షణక్షణం పర్యవేక్షిస్తున్నారన్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో వైరస్‌ క్రాస్‌ కంటామినేషన్‌ జరగలేదన్నారు. ముందస్తు చర్యగా 10 వేల పడకలను కరో నా పాజిటివ్‌ కేసుల చికిత్స కోసం సిద్ధం చేశామన్నారు. 700 ఐసీయూ, 190 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. చైనాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోందని వార్తలు వచ్చిన రోజు నుంచే తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్‌ అప్రమత్తం చేశారని చెప్పారు. ఆ రోజు నుంచి ప్రతి రోజూ సమీక్ష నిర్వహించుకుంటూ జాగ్రత్త లు తీసుకుంటున్నామని తెలిపారు. విమా నాశ్రయాల్లో స్క్రీనింగ్‌ చేసి అనుమానం ఉన్న వారికి పరీక్షలు చేశామన్నారు. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో ఒకరికి నయం చేసి ఇంటికి పంపించామన్నారు. శనివారం నుంచి మరికొంత మందిని డిశ్చా ర్జ్‌ చేయబోతున్నామన్నారు. 22 నుంచి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారన్నారు. 14 రోజులు వైరస్‌ ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ ఉంటుంది.. వారం రోజుల్లో ఇది ముగుస్తుందని, ఈ వారం రోజుల్లో ఎన్ని కేసులు వస్తాయో స్పష్టమౌతుందన్నారు.

మూడు దశల్లో.. 
మొదటి దశలో ప్రభుత్వ ఆసుపత్రులను మాత్రమే కరోనా వైరస్‌ చికిత్స అందించేందుకు ఉపయోగిస్తున్నామని ఈటల తెలిపారు. రెండో దశలో హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలకు అనుసంధానంగా ఉన్న ఆసుపత్రులను వినియోగిస్తామన్నారు. మూడో దశలో జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రైవేటు మెడికల్‌ కాలేజీ ఆసుపత్రులను వినియోగిస్తామన్నారు. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీ యాజమాన్యాలంతా వారి అనుబంధ ఆసుపత్రు ల్లో సోమవారం నుంచి ఔట్‌పేషెంట్లను బంద్‌ చేసి మొత్తం ఆస్పత్రిని కరోనా చికిత్స కోసం కేటాయించాలని, వారం రోజుల్లో వీటిని సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి మెడికల్‌ కాలేజీకి ఒక నోడల్‌ ఆఫీసర్‌ను ఏర్పాటు చేసి కాళోజీ ఆరోగ్య వర్సిటీ వీసీ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు