విష జ్వరాలపై గత నాలుగు రోజులుగా సమావేశాలు: ఈటెల

6 Sep, 2019 14:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ప్రబలుతున్న విష జ్వరాలను అరికట్టడానికి తమ శాఖ గత నాలుగు రోజులుగా వరుస సమావేశాలు నిర్వహిస్తోందని వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ స్పష్టం చేశారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే ప్రస్తుతం డెంగ్యూ లక్షణాలు మారాయని.. ప్రస్తుతం రోగుల సంఖ్య పెరిగినా.. త్వరగానే నయం అవుతుందని అన్నారు. ఫీవర్‌ ఆస్పత్రిలో 51వేల మందికి టెస్ట్‌ చేస్తే.. కేవలం 62 మందికే డెంగ్యూ ఉన్నట్లు తెలీందన్నారు. గాంధీ ఆస్పత్రిలో కూడా 419మందికి నయం చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో, భోదన ఆస్పత్రుల్లో సాయంత్రం కూడా ఓపీ నడుపుతున్నామన్నారు. సెలవులు లేకుండా వైద్యులు పని చేస్తున్నారని పేర్కొన్నారు. మందులు కూడా అందుబాటులో ఉంచామన్నారు.

ప్రతి రోజు మినిస్టర్ పేషీ జ్వరాల మీద పని చేస్తోందని.. జూన్ నుంచి జ్వరాలపై ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలు కొనుగోలు చేయాలని.. అవసరమైతే అద్దెకు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. ప్రజలు కూడా వారి పరిసరాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరారు. ప్రజలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే ఈ పరిస్థితుల నుంచి భయటపడగలమన్నారు. ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేసి పని చేసే వారి స్థైర్యాన్ని దెబ్బ తీయవద్దని కోరారు. ప్రైవేట్ ఆస్పత్రులు ప్రతి రోజు సాయంత్రం ఖచ్చితంగా పేషెంట్స్ నివేదికను డీఎంహెచ్‌ఓకి అందించాలని ఆదేశించామన్నారు. సాధరణ జ్వరంతో వచ్చే వారిని డెంగ్యూ అని భయపెట్టవద్దని ప్రైవేట్‌ ఆస్పత్రులను హెచ్చరించారు ఈటెల.

మరిన్ని వార్తలు