అభివృద్ధికి దిక్సూచి..

13 Mar, 2016 02:27 IST|Sakshi
అభివృద్ధికి దిక్సూచి..

బడ్జెట్‌పై ‘సాక్షి’తో మంత్రి ఈటల రాజేందర్
ప్రజల అవసరాలకు మరింత దగ్గరగా ఉంటుంది
► తొలి ప్రాధాన్యం సంక్షేమానికే...
► గతానికి భిన్నంగా ప్రణాళిక వ్యయమే ఎక్కువ
► ఆదాయానికి ఢోకా లేదు.. రెవెన్యూ రాబడి ఆశించినట్టే ఉంది.. దుబారా ఖర్చులు తగ్గిస్తాం
► అర్హులైన నిరుపేదలందరికీ కల్యాణలక్ష్మి
► కాలేజీ విద్యార్థులకు సన్నబియ్యం పథకం

 సాక్షి, హైదరాబాద్:
 ఈసారి బడ్జెట్‌లోనూ తమ ప్రభుత్వం సంక్షేమానికే తొలి ప్రాధాన్యం ఇస్తుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. వరుసగా మూడోసారి భారీ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని, గతానికి భిన్నంగా ఈసారి ప్రణాళికేతర వ్యయం కంటే ప్రణాళిక వ్యయం ఎక్కువగా ఉంటుందని అన్నారు. దుబారా ఖర్చులను తగ్గించి అభివృద్ధికి దిక్సూచిగా నిధుల కేటాయింపులు ఉంటాయన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆచరణాత్మక పంథాలో 2016-17 బడ్జెట్ రూపకల్పన చేసినట్లు తెలిపారు. రెండేళ్ల ఆదాయ వ్యయాలను మదించుకొని తయారు చేసుకున్నందున ఈసారి బడ్జెట్ వాస్తవికతను ప్రతిబింబిస్తుందని చెప్పారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో వరుసగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న మంత్రి ఈటల రాజేందర్ ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రధానంగా సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, అందులో భాగంగానే కులమతాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ కల్యాణలక్ష్మి పథకం వర్తింపజేశామని చెప్పారు. మైనారిటీ విద్యార్థులకు, పేద పిల్లల కోసం కొత్త రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పుతామన్నారు. కాలేజీ విద్యార్థులకు సైతం సన్న బియ్యం పథకం విస్తరిస్తామని చెప్పారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలివీ..

 ఇది స్పష్టమైన బడ్జెట్: కొత్త రాష్ట్రం కావటంతో తొలి ఏడాది ఆదాయ వ్యయాల గణాంకాలేవీ అందుబాటులో లేవు. కేవలం అంచనాలు, తార్కిక ఆలోచనలతో బడ్జెట్ తయారు చేసుకున్నాం. అప్పటి పది నెలల బడ్జెట్, ఆదాయ వ్యయాలను ఆధారంగా చేసుకొని 2015-16లో తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఇప్పుడు గడిచిన రెండేళ్ల ఆదాయ వ్యయాలున్నాయి. అందుకే మరింత స్పష్టత వచ్చింది. ఈసారి బడ్జెట్ ప్రజల అవసరాలకు మరింత దగ్గరగా ఉంటుంది. బడ్జెట్ తయారీలో ప్రభుత్వం కొత్త పంథా అనుసరించింది. కాలం చెల్లిన పద్దులను తొలగించి.. ఒకే తీరుగా ఉన్న పద్దులను విలీనం చేశాం. దీంతో దుబారా తగ్గుతుంది. అనవసరమైన కేటాయింపులు తొలగిపోతాయి.
 ఇది ఫలితాల సంవత్సరం
 తొలి ఏడాది ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దూరదృష్టితో ఎంచుకున్న పథకాలకు అనుగుణంగా బడ్జెట్ తయారైంది. రెండో ఏడాది ఆ పథకాలన్నింటినీ కార్యాచరణలో పెట్టాం. ఇది మూడో ఏడాది.. ప్రభుత్వం చేపట్టిన పథకాలు ప్రజలకు ఫలాలను అందించే లక్ష్యం చేరువైంది. ఈ ఏడాది చివరినాటికే 6,100 గ్రామాలు, 12 మున్సిపాలిటీల్లో ఇంటింటికీ తాగునీటిని అందిస్తాం. 2017 చివరికల్లా మిషన్ భగీరథ 95 శాతం పూర్తవుతుంది. గతేడాది 60 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేస్తే... ఈ ఏడాది 2 లక్షల ఇళ్లు టార్గెట్‌గా పెట్టుకున్నాం. సాగునీటి ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు కేటాయించి ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యం ఎంచుకున్నాం. అదే సమయంలో మిగతా పథకాల అమలుకు ఆటంకం లేకుండా తగినన్ని నిధులను సమీకరిస్తాం. మిషన్ కాకతీయ, డబుల్ బెడ్‌రూం, మిషన్ భగీరథ, కొత్త ఆసుపత్రుల నిర్మాణాలకు నిధులు సమకూర్చేందుకు హడ్కో, నాబార్డు, దేశ, విదేశీ బ్యాంకులు ముందుకొస్తున్నాయి.

 ఆదాయానికి ఢోకా లేదు
 రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి ఢోకా లేదు. గత ఏడాది బడ్జెట్‌లో అంతకు ముందుతో పోలిస్తే 30 శాతం రాబడి లక్ష్యం పెంచుకున్నాం. రెవెన్యూ రాబడి అంచనాలు ఆశించినట్లుగానే ఉన్నాయ. భూముల అమ్మకం ద్వారా వస్తుందనుకున్న ఆదాయం ఇప్పుడిప్పుడు రావడం మొదలైంది. దేశంలోనే పెట్టుబడుల గమ్యస్థానంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌తో పాటు రియల్ ఎస్టేట్ పుంజుకుంది. దేశ జీఎస్‌డీపీతో పోలిస్తే రాష్ట్ర జీఎస్‌డీపీ ఎక్కువగా ఉంది.

 కేంద్రం నుంచి నిధులొస్తాయి
 నిరుటితో పోలిస్తే ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు వస్తాయనే ఆశాభావంతో ఉన్నాం. కేంద్ర ప్రాయోజిత పథకాల కేటాయింపులపై స్పష్టత వచ్చింది. ఎఫ్‌ఆర్‌బీఎం రుణపరిమితి పెంచే విషయంలో కేంద్రం ఇప్పటికే స్పష్టమైన హామీ ఇచ్చింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రం కావటం, జీఎస్‌డీపీలో నిర్ణీత అప్పుల శాతానికి లోబడి ఉన్న రాష్ట్రానికి 3.5 శాతం ఎఫ్‌ఆర్‌బీఎం వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఈ రెండు నిబంధనలకు లోబడి ఉంది.

 సీఎంను చూసి ఎంతో నేర్చుకున్నాం
 ఆర్థికమంత్రిగా వరుసగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం రావటం ఆనందంగా ఉంది. కొత్త రాష్ట్రం కావటంతో ఎంతో అధ్యయనం చేసేందుకు అవకాశముంది. అన్ని రంగాల్లో అపారమైన అనుభవమున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి ఎంతో నేర్చుకున్నాం. ఆయన సలహాలు, సూచనలు దార్శనికతకు అనుగుణంగా ప్రజలకు ఉపయోగపడేలా ఈ బడ్జెట్ ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు.
 

>
మరిన్ని వార్తలు