‘ఆఫ్‌’గ్రేడ్‌..!

22 Feb, 2019 12:04 IST|Sakshi
పరకాల సివిల్‌ ఆస్పత్రి(మాతా శిశు ఆరోగ్య కేంద్ర భవనం)

పరకాల: ఈ రోజుల్లో వైద్యం అత్యంత ఖరీదుగా మారింది. పేదలకు అందని ద్రాక్షలా మారింది. ప్రతి కుటుంబ సంపాదనలో అధిక మొత్తం ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నారనేది నిత్య సత్యం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చూయించుకుందామంటే అరకొర వసతులు, నాణ్యమైన వైద్యం పొందలేక పోతున్నారు. ప్రజలు అవసరాలకు అనుగుణంగా మెరుగైన వసతుల కల్పనలో పాలకులు, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల పేదల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతుంది. ఈ కోవకే వస్తుంది పరకాల సివిల్‌ ఆస్పత్రి.

చుట్టూ వందల గ్రామాలకు పెద్దదిక్కుగా ఉన్న ఆస్పత్రి అప్‌గ్రేడ్‌కు ఇప్పటికే రెండుసార్లు ప్రతిపాదనలు చేసినా మొగ్గ దశలోనే వాడిపోయాయి. అయితే ఈ ప్రాంత సరిహద్దు మండలం కమలాపూర్‌కు చెందిన ఈటల రాజేందర్‌ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో వంద పడకల ఆస్పత్రికి    చేసిన ప్రతిపాదనలకు తోడుమరో 150 పడకలకు అప్‌గ్రేడ్‌ చేయాలంటూ మంత్రికి విన్నవించుకునేందుకు ప్రతిపాదనలు చేయాలని వైద్యాధికారులను స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  కోరినట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి పరకాల సివిల్‌  ఆస్పత్రిని అభివృద్ధి చేయాలని కోరనున్నట్లు తెలిసింది.

మూడు జిల్లాలకు పెద్ద దిక్కు.. 
వరంగల్‌ రూరల్, అర్బన్, జయశంకర్‌ భూపాలపల్లి  జిల్లాలోని 8 మండలాలుకు చెందిన సుమారు 150 గ్రామాలతో పాటు మహారాష్ట్రకు చెందిన నిరుపేదలకు పరకాల సివిల్‌  ఆస్పత్రి పెద్దదిక్కుగా నిలుస్తుంది. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో ఎంజీఎం ఆస్పత్రి తర్వాత ఎక్కువ మంది రోగులు వైద్యం అందించే  పరకాల సివిల్‌ ఆస్పత్రిఇ పట్టిన జబ్బును నయం చేసేవారు కనిపించలేదు. పొరుగున ఉన్న చిట్యాల, కమలాపూర్‌ వంటి మండల స్థాయి పీహెచ్‌సీలు వంద పడకలుగా మారినా పరకాల ఆస్పత్రిఇ మాత్రం ఆ భాగ్యం లభించలేదు.

నిత్యం  వందలాది మంది రోగులతో కిట కిటలాడే ఆస్పత్రి పుట్టెడు కష్టాలతో తల్లడిల్లుతుంది. ప్రసుత్తం ఉన్న 30 పడకల ఆస్పత్రి భవనంలోనే బాలింతలను, ఇన్‌పెషంట్‌లకు వైద్య సేవలు అందిస్తున్నారు.  100 పడకల ఆస్పత్రి చేస్తామంటూ పాలకులు చేసిన హామీలు నెరవేరలేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల శాతం పెంచడానికి కేసీఆర్‌ కిట్‌లను అందజేయడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న ప్రతి నిరుపేద రోగికి సకాలంలో మెరుగైన  వైద్యసేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసినా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు.

కొత్తగా రూ.45 కోట్లతో ప్రతిపాదనలు..! 
పరకాల సివిల్‌ ఆస్పత్రిని 250 పడకలు దవఖానాగా మార్చాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య  శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను కోరాలని స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  నిర్ణయించినట్లు తెలిసింది.  ఇప్పటికే 250 పడకల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించినట్లు సమాచారం.

గతంలో రెండు సార్లు.. 
పెరుగుతున్న రోగుల సంఖ్యతో పాటు శిథిలావస్థలో ఉన్న భవనం స్థానంలో 100 పడకల ఆస్పత్రి చేయాలంటూ 2012 సంవత్సరంలో ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి సారథ్యంలోని అప్పటి ఆస్పత్రి అభివృద్ధి కమిటీ రూ.5కోట్ల నిధుల కోసం  ప్రతిపాదనలకు  తీర్మానం చేయగా 2015 సంవత్సరంలో ప్రస్తుత ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రూ.23 కోట్లతో మరో విడతగా ప్రతిపాదనలు చేయించారు.  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు రూ.1.50 కోట్లతో మొదటి అంతస్తు భవన నిర్మాణపు పనులకు మంజూరు ఇచ్చిన భవన పనులు జరుగలేదు.  మూడో విడతగా స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 250 పడకల ఆస్పత్రి కోసం రూ.45కోట్ల నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర  వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్‌ను కోరనున్నట్లు తెలిసింది.    

మరిన్ని వార్తలు