ఏటూరునాగారం పర్యాటకధామం

15 Dec, 2015 03:00 IST|Sakshi
ఏటూరునాగారం పర్యాటకధామం

ట్రైబల్ సర్క్యూట్ టూరిస్ట్ ప్రాంతంగా ఎంపిక
*
తాడ్వాయి అడవి, బొగతా జలపాతం, లక్నవరం చెరువు, మేడారం, మల్లూరు, దామరవాయిలకు చోటు
* 'స్వదేశీ దర్శన్' పథకం కింద ప్రాజెక్టును మంజూరు చేసిన కేంద్రం
* గిరిజన ఇతివృత్తంతో భారీ ప్రణాళిక సిద్ధం చేసిన పర్యాటకాభివృద్ధి సంస్థ
* రూ.120 కోట్లతో తొలిదశ పనులు.. రూ.92 కోట్లు కేటాయించిన కేంద్రం
* రెస్టారెంట్లు, విశ్రాంతి గదులు, రోడ్ల నిర్మాణం
* ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలకు ఏర్పాట్లు
* విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే రీతిలో ఏర్పాట్లకు నిర్ణయం

 
 సాక్షి, హైదరాబాద్: మండు వేసవిలోనూ కనువిందు చేసే అద్భుత జలపాతం.. పదివేల ఏళ్ల నాడు మానవ సమూహం జీవించిన ప్రాంతం.. దట్టమైన అడవిలో 15 అడుగుల ఎత్తయిన భారీ రాళ్లతో అబ్బురపరిచే సమాధులు.. గుట్టపైనుంచి గలగలాపారే నీటి జాడలు... పక్కనే పదడుగుల ఎత్తయిన మూలవిరాట్టుతో అలరారే లక్ష్మీనరసింహస్వామి దేవాలయం.. అద్భుత ఇంజినీరింగ్ ప్రతిభ దాగిన లక్నవరం సరస్సు... స్థానికులకు తప్ప ఇతర ప్రపంచం దృష్టి అంతగా పడని ఈ అద్భుతాలన్నీ కొలువుదీరిన వరంగల్ జిల్లా ఏటూరు నాగారం ప్రాంతానికి ఇక పర్యాటక శోభ రానుంది.

ఇంతకాలం మావోయిస్టులకు పెట్టనికోటగా, ఎదురుకాల్పులు-పోలీసు కూంబింగ్‌ల హడావుడితో మారుమోగే ప్రాంతంగా ఉన్న ఈ ప్రదేశంలోని ప్రత్యేకతలకు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించేందుకు భారీ ప్రణాళిక సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'స్వదేశ్ దర్శన్' పథకంలో భాగంగా రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఈ ప్రాంతాన్ని గిరిజన ఇతివృత్తంతో ‘ట్రైబల్ సర్క్యూట్’గా అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం రూ. 120 కోట్లతో తొలిదశ పనులను చేపట్టనుండగా... కేంద్రం రూ. 92 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 8 కోట్లు ఇవ్వనున్నాయి. మిగతా సొమ్మును పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం కింద సమకూర్చుతారు.

అన్నీ అద్భుతాలే..
 వరంగల్ జిల్లా ములుగు ప్రాంతం ఈ ప్రాజెక్టుకు ‘ప్రవేశ మార్గం’గా ఉండనుంది. రెస్టారెంట్లు, రోడ్డు పక్కన సౌకర్యాలు (వే సైడ్ ఎమినిటీస్) ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇక్కడికి సమీపంలోని లక్నవరం సరస్సు వద్ద రెస్టారెంట్లు, మంచి రోడ్లు, విశ్రాంతి భవనాలు నిర్మిస్తారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ సరస్సు చిన్నచిన్న దీవులతో మనోహరంగా ఉంటుంది. ఆ దీవుల అనుసంధానంగా ఇప్పటికే దీనిపై వేలాడే వంతెనను నిర్మించారు. కానీ ఇక్కడ పెద్దగా వసతులు లేవు. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే  రీతిలో ఇక్కడ వసతులు కల్పిస్తారు. బోటింగ్, జెట్టీలు ఏర్పాటు చేస్తారు. దీనికి చేరువలోనే ప్రఖ్యాత రామప్ప గుడి, రామప్ప చెరువు ఉన్నాయి. సమీపంలో దట్టమైన అడవితో అలరారే తాడ్వాయిని సాహస క్రీడలకు కేంద్రంగా మార్చుతారు. అక్కడ రెస్టారెంట్లు, విశ్రాంతి గదులు, గైడ్లను అందుబాటులో ఉంచుతారు.

ఏటూరు నాగారానికి చేరువగా ఖమ్మం జిల్లా పరిధిలోని వాజేడు మండలంలో కొలువుదీరిన బొగతా జలపాతానికి వెళ్లేలా రోడ్డు నిర్మిస్తారు. తెలంగాణ నయగారాగా పేరొందిన ఈ జలాపాతం వద్ద రెస్టారెంట్లు, విశ్రాంతి గదులు నిర్మిస్తారు. సెక్యూరిటీ పోస్టు ఏర్పాటు చేస్తారు. క్రీస్తుపూర్వం నాటి వందల సమాధులున్న దామరవాయి వద్ద విజ్ఞాన కేంద్రాన్ని, నాటి మానవ మనుగడ ఎలా ఉండేదో తెలిపే వీడియో, ఆడియో ప్రదర్శనశాల, మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తారు. నిరంతరం నీటి గలగలలు వినిపించే మల్లూరులో పర్యాటకుల విడిది ఏర్పాటు చేస్తారు. ట్రెక్కింగ్ లాంటి సాహస క్రీడలకు వసతులు కల్పిస్తారు. ఇక్కడి పురాతన హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చి దాని విశిష్టతను తెలిపే ఏర్పాట్లు చేస్తారు. ప్రఖ్యాత గిరిజన జాతర జరిగే మేడారం వద్ద ప్రత్యేక గిరిజన మ్యూజియాన్ని ఏర్పాటు చేయటంతో పాటు సాధారణ రోజుల్లో పర్యాటకులు వస్తే ఉండేందుకు అవసరమైన వసతులు కల్పిస్తారు.

మరిన్ని వార్తలు