షాక్‌ఫార్మర్

6 Jul, 2015 23:39 IST|Sakshi
షాక్‌ఫార్మర్

రైతన్నకు ఫికర్
- అధ్వానంగా ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ
- కరెంటోళ్ల నిర్వాకం.. అన్నదాతకు సంకటం
- కొత్తవి ఇవ్వరు.. మరమ్మతు చేయరు
- 3,500 ట్రాన్స్‌ఫార్మర్ల కోసం అర్జీలు
- 600కే మంజారుఅనుమతులు
- ఆమ్యామ్యాలు ఇస్తేనే పనులు
- ఒక్కో దానికి రూ.10వేల నుంచి 15వేల వరకు వసూళ్లు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:
విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం.. అంతకు మించి కాసుల కక్కుర్తి.. ఫలితంగా రైతన్నల మెడకు ఉచ్చు బిగుస్తోంది. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల కేటాయింపు, కాలిపోయిన వాటికి మరమ్మతులో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో అన్నదాతలకు కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయి. రూ. వేలకు వేలు గుమ్మరిస్తేనే టాన్స్‌ఫార్మర్లు రిపేరు అవుతున్నాయి. లేకుంటే పంటలు ఎండిపోవడం ఖాయం.. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనా ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తుండడంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో చిక్కుకుంది.
 
జిల్లాలో మొత్తం 1.75 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటి ద్వారా దాదాపు 4.59 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. విద్యుత్ సరఫరాలో అత్యంత కీలకపాత్ర ట్రాన్స్‌ఫార్మర్‌దే. వీటి ఏర్పాటులో విద్యుత్ శాఖ సిబ్బంది తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ కావాలని రైతు డీడీ తీసిన దగ్గరి నుంచి పొలంలో ఏర్పాటు చేసేందుకు నెలలు, సంవత్సరాలు పడుతోంది. గత ప్రభుత్వాల హయాంలో ఎలా ఉన్నా... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రైతుల ట్రాన్స్‌ఫార్మర్ కష్టాలు కడతేరడం లేదు. కొత్తవాటిని ఏర్పాటు చేయాలంటే విద్యుత్ సిబ్బంది చుట్టూ ప్రదక్షిణలు చేయడమేకాక, వేల రూపాయలు ముట్టజెప్పాల్పి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌పై ఓవర్‌లోడ్ పడి ట్రిప్ అవుతున్నాయని రైతులు చెబుతున్నారు. మరోవైపు ట్రాన్స్‌ఫార్మర్లతో పాటు లోవోల్టేజీ కారణంగా వ్యవసాయ మోటార్లు కూడా కాలిపోతుండడంతో  రైతుల దుస్థితి గోరుచుట్టపై రోకటి పోటు చందంగా తయారయింది. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల పరిస్థితి అలా ఉంటే కాలిపోయిన వాటికి మరమ్మతు చేసే విషయంలో  సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి మరమ్మతుకు వచ్చిన ట్రాన్స్‌ఫార్మర్ సమస్యను 48 గంటల్లో పరిష్కరించాల్సి ఉన్నా.. అది జరగడం లేదు. కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎస్‌పీఎం సెంటర్‌కు తీసుకెళ్లి మరమ్మతు చేయించి మళ్లీ రైతు పొలంలో ఏర్పాటు చేసేందుకు వాహనాలు ప్రభుత్వమే సమకూర్చినా ఆ భారం కూడా రైతుల పైనే అధికారులు వేస్తున్నారు. కాలిపోయిన దానికి తీసుకెళ్లడానికి ఒక రోజు, మరమ్మతు అయిన దానిని తీసుకెళ్లేందుకు మరో రోజు రైతుకు రూ. వేలకు వేలు రవాణా భారం పడుతోంది.
 
చేతులు ‘తడిపితేనే’....
విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది లంచాలుగా తీసుకుంటున్న మొత్తం రూ. కోట్లు దాటుతాయనే ఆరోపణలున్నాయి. కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా 3 వేల కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయగా, వాటికి ఆమ్యామ్యాల కింద ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌కు సగటున రూ. 10 నుంచి 15వేల చొప్పున రూ.3.5 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖ సిబ్బందికి ముట్టిందని అంచనా. దీనికి తోడు కరెంటు పోల్స్, వైర్లు, ఇతర ఖర్చుల నిమిత్తం రైతులపై ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌కు రూ.2 లక్షల వరకు అదనపు భారం పడుతోంది.

ఇంత ఖర్చు చేసినా రైతుకు మాత్రం సకాలంలో ట్రాన్స్‌ఫార్మర్లు అందుబాటులోకి రావడంలేదు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 3,650 ట్రాన్స్‌ఫార్మర్లు అవసరం ఉండగా, అందులో  కేవలం 600 ట్రాన్స్‌ఫార్మర్లకు మాత్రమే వర్క్ ఆర్డర్లు ఇచ్చినట్లు సమాచారం. వాటిలో కూడా  ఆ రెండు నియోజకవర్గాలదే అగ్రస్థానం.  కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరు నుంచి దాన్ని బిగించే వరకు విద్యుత్ శాఖ సిబ్బందికి ముట్టచెప్పాల్సిందే. ఎంతగా అంటే.. జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చేతికి చిక్కుతున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువ భాగం విద్యుత్ శాఖ సిబ్బంది ఉండడం గమనార్హం.

మరిన్ని వార్తలు