నోటుకో ప్రత్యేకత..!

5 Aug, 2019 12:06 IST|Sakshi

దేశ సార్వభౌమాధికార చిహ్నం కరెన్సీ  

సంస్కృతి, చిహ్నాలకు ప్రతిబింబం  

జాతి నేతలకు గౌరవం 

సాక్షి, ఆలేరు: ఏ వస్తువు కొనాలన్నా డబ్బుతోనే ముడిపడి ఉంది. అందుకే పైపా మే పరమాత్మ అంటారు. డబ్బుకున్న విలువ అలాంటిది. అయితే నోటు అనేది సాధారణ కాగితం కాదు. దేశ సార్వభౌమాధికార చిహ్నం. వినిమయ సాధనంలో ద్రవ్యానిది ప్రత్యేక పాత్ర. మార్కెట్‌ క్రయవిక్రయాల్లో నోట్లదే ప్రధాన పాత్ర. అందుకే ప్రతిదేశం తమ దేశానికి సంబంధించి ప్రత్యేక కరెన్సీని ముద్రించుకుంటుంది. ఏ దేశంలో నోట్లు ఆ దేశంలోనే చెల్లుబాటు అవుతాయి. పరాయి దేశంలో మన దేశం నోటుకు విలువలేకున్నా వినిమయ శక్తి ఉంటుంది. ప్రతి దేశం పలు ప్రత్యేకతలతో భద్రతాపరమైన చర్యలతో నోట్లను ముద్రిస్తుంది. ఇందుకు దేశసార్వభౌమాధికార చిహ్నాలు, సంస్కృతి, సంప్రదాయాల ఆనవాళ్లు, జాతినేతల చిత్రాలను నోట్లపై పొందుపరుస్తుంటారు. ప్రస్తుతం నోట్లపై విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇండియన్‌ కరెన్సీ (నోట్లు) వాటి విశిష్టతపై 'సాక్షి' అందిస్తున్న ప్రత్యేక కథనం. 

రూపాయి నోటు.. సాగర్‌ సామ్రాట్‌  
మన కరెన్సీలో రూపాయి నోటుకి విశిష్ట ప్రాధాన్యం ఉంది. ఈ నోటు వెనుక సాగర్‌ సామ్రాట్‌ ఆయిల్‌రిగ్‌ కనబడుతుంది. ఓఎన్‌జీసీకి చెందిన ఈ ఆయిల్‌రిగ్‌ దేశ మౌలిక వసతులను తెలియజేస్తుంది. 

100 రూపాయల నోటు.. మన జాతి ఔన్నత్యం  
వంద నోటు వెనుక భాగంలో ప్రపంచంలో ఎత్తయిన పర్వాతాలైన హిమాలయాలను చూడొచ్చు. ఇందులో సుమారు నూరు శిఖరాలు 7200 మీటర్లు ఎత్తుకు మించి ఉన్నాయి. ఆసియాలో బూటాన్, చైనా, భారతదేశం, నేపాల్, పాకిస్థాన్‌లో ఇవి వ్యాపించి ఉన్నాయి. మనే దేశానికి ఇవి పెట్టని కోటగోడలు. 

2 రూపాయల నోటు.. పులికి గౌరవం  
రెండు రూపాయల నోటుపై మన జాతీయ జంతువు పులి బొమ్మ ఉంటుంది. వన్యప్రాణుల సంరక్షణకు ప్రాముఖ్యతనిస్తూ నోటుపై ఈ బొమ్మ ముద్రించారు.

5 రూపాయల నోటు.. వ్యవసాయం 
ఐదు రూపాయల నోటు వెనుక ముద్రించిన ట్రాక్టర్‌ వ్యవసాయ పనులను, నిర్మాణరంగంలో ఎక్కువగా వాడుకలో ఉన్న కార్యకలాపాలను తెలియజేస్తుంది. ట్రాక్టర్‌ అనే పదం ట్రహేర్‌ అనే లాటిన్‌ పదం నుంచి వచ్చింది. దేశం వ్యవసాయ రంగానికి వెన్నెముక లాంటిదని తెలియజేసే లక్ష్యంతోనే ఐదు రూపాయల నోటుపై ఈ బొమ్మ ముద్రించారు.

20 రూపాయల నోటు.. పార్క్‌కు హోదా 
ఇరవై రూపాయల నోటుపై అండమాన్‌ నికో బార్‌ దీవుల్లోని మౌంట్‌ హేరియంట్‌ నేషనల్‌ పార్కు బొమ్మను ముద్రించారు. దీన్ని 1979లో నిర్మించారు. ఈ పార్క్‌ విస్తీర్ణం 46.62 కిలోమీటర్లు, పోర్టుబ్లెయిర్‌ అండమాన్‌కు కేపిటల్‌. 

2000 రూపాయల నోటు.. శాస్త్ర సాంకేతికత 
పెద్ద నోట్ల రద్దు తర్వాత రెండు వేల రూపాయల నోటును రిజర్వ్‌ బ్యాంకు అమల్లోకి తెచ్చింది. ఈ నోటు ముందు భాగంలో మహాత్మాగాంధీ బొమ్మ, కుడివైపు అశోకుడి స్థూపం ముద్రించారు. వెనుక వైపు స్వచ్చభారత్‌లోగో, మంగళ్‌యాన్‌ ప్రయోగ చిహ్నం ముద్రించారు. గులాబీ రంగులో ఉన్న ఈ నోటు ముద్రణలో 19 జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ చర్యల వల్ల ఈ నోటును నకిలీ చేయడం సాధ్యం కాదని కేంద్రం చెబుతోంది. 

500 రూపాయల నోటు.. ఎర్రకోట 
భారతదేశ అద్భుత కట్టడాల్లో ఎర్రకోట ఒకటి. స్వాతంత్య్ర సంబ రాలకు చిహ్నం. అదే ఢిల్లీలోని ఎర్రకోట. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో మువ్వన్నెల జెండాను ప్రధాని ఎగురవేస్తారు. ఈ కోటకు 360 ఏండ్ల చరిత్ర ఉంది. దీని నిర్మాణాన్ని 1638లో మొదలు పెడితే 1648లో పూర్తయింది. యమున నది ఒడ్డున ఇది ఉంది. మొత్తం 120 ఎకరాల స్థలంలో దీనిని నిర్మించారు. 

10 రూపాయల నోటు.. వన్యప్రాణులు   
పది రూపాయల నోటు వెనుక వన్యప్రాణులైన ఏనుగు, పులి, ఖడ్గమృగం బొమ్మలు కనిపిస్తాయి. భారతీయ ఖడ్గమృగం ఓ పెద్ద క్షీరదం నేపాల్, భారత్, అస్సోంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ఇవి పరిగెత్తగలవు. ఈతలో ప్రావీణ్యం ఉన్న జంతువు, మందమైన చర్మం కలిగి ఉంటుంది. ఆసియన్‌ ఏనుగులు ఆఫ్రికా ఏనుగుల కంటే చిన్నవిగా ఉంటాయి. రెండువేల నుంచి ఐదువేల కేజీల వరకు బరువు ఉంటుంది. బెంగాల్‌ టైగర్‌ను రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ అని అంటారు. ఇది మన జాతీయ జంతువు.

మరిన్ని వార్తలు