నాటిన ప్రతి మొక్కను కాపాడాలి

28 Apr, 2018 09:45 IST|Sakshi
నర్సరీలో మొక్కలు పరిశీలిస్తున్న కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌

చందుర్తి (వేములవాడ) :  హరితహారంలో నాటి ప్రతి మొక్కను కాపాడాలని కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌ కోరారు. రుద్రంగి మండల కేంద్రంలో హరితహారంలో నాటిన మల్బరీ తోటను శుక్రవారం పరిశీలించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధిహామీ వన నర్సరీని పరిశీలించి, ప్రతి మొక్కను ఎండి పోకుండా కాపాడి లక్ష్యాన్ని సాధించాలని ఉపాధిహామీ సిబ్బందికి సూచించారు. అలాగే ఉపాధిహామీలో నిర్మించిన పశువుల పాక, పశువుల తొట్టిని పరిశీలించి ఉపాధిహామీ సిబ్బంది పనితీరును ప్రశంసించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం హరితహారంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రభుత్వ లక్ష్యం వైపు ప్రతి ఒక్కరూ అడుగు వేయాలని కోరారు. ఆయన వెంట ఉపాధిహామీ పీడీ రవీందర్, ఏపీడీ మదన్‌మోహన్, మండల ప్రత్యేకాధికారి మోహన్‌రావు, ఎంపీడీవో శ్రీనివాస్, ఉపాధి హామీ టెక్నికల్‌ అసిస్టెంట్లు దనుంజయ్‌ ఉన్నారు. 

అర్హులందరికీ పింఛన్లు..

అర్హులదరికీ వచ్చే నెల నుంచి పింఛన్లు తప్పకుండా అందిస్తామని కలెక్టర్‌  కృష్ణభాస్కర్‌ అన్నారు. మండలంలోని మానాల గ్రామంలో అర్హులకు పింఛన్‌ అందడం లేదనే ఫిర్యాదు మేరకు శుక్రవారం కలెక్టర్‌ ఆ గ్రామంలో స్వయంగా విచారణ చేపట్టారు. సాంకేతిక కారణాలతో పింఛన్లు అందడం లేదని.. వచ్చే నెల నుంచి అందజేస్తామని హామీ ఇచ్చారు. 

తహసీల్దార్‌పై గ్రామస్తుల ఆగ్రహం

కలెక్టర్‌ సాక్షిగా రుద్రంగి తహసీల్దార్‌ రమేశ్‌బాబుపై మానాల గ్రామస్తులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. సుమారు 60మందికిపైగా కల్యాణలక్ష్మి పథకానికి ఏడాది క్రితం దరఖాస్తు చేసుకున్నా.. ఇప్పటికీ డబ్బులు అందలేదంటూ బుక్యా అమర్‌సింగ్, గుగలోతు రాజం, సుద్దపెల్లి గంగరాజం, సిద్దిమల్ల రాజం ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం లోపు పెండింగ్‌లో ఉన్న కల్యాణలక్ష్మి దరఖాస్తులను అందజేయాలని కలెక్టర్, తహసీల్దార్‌ను హెచ్చరించారు. 
ప్రకృతి ఒడిలో అల్పాహారం
మానాల ఘాట్‌ రోడ్డు పక్కనే ఉన్న ప్రకృతి ఒడిలో కలెక్టర్, జిల్లా, మండల స్థాయి అధికారులతో అల్ఫాహారం చేశారు. వెంటేశ్‌గౌడ్‌ అనే గీత కార్మికుడు తాటి ముంజలను కోసి ఇవ్వగా కలెక్టర్‌ వాటిని ఆరగించారు.  

మరిన్ని వార్తలు